సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో అత్యంత కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం ఈ నెల 17న (మంగళవారం) జరగనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 17కి బదులుగా నవంబర్ 9(రెండో శనివారం)న పనిదినంగా ప్రకటించింది. ఈ నెల 7న మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు 17తో ముగియనున్నాయి.
నిమజ్జనాలు నేపథ్యంలో నగర పోలీసులు, అదనపు బలగాలతో కలిపి దాదాపు 25 వేల మంది బందోబస్తు, భద్రత విధులు నిర్వర్తిస్తారని కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రకటించారు. నిమజ్జనంతో పాటు 19న జరగనున్న మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఒక్క అడుగుతో మొదలై 70 అడుగులకు..
హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఏడాది కూడా ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాలు నిషేధించామని చెప్పిన ఆయన ఎన్టీఆర్ మార్గ్‌తో పాటు పీవీ నరసింహారావు మార్గ్‌ల్లో అవసరమైన అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. గణేష్ విగ్రహాల ఊరేగింపు జరిగే మార్గాలతో పాటు సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
మరోపక్క కమిషనరేట్‌లోని జోన్ల వారీగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆనంద్ శుక్రవారం వెస్ట్ జోన్‌పై సమీక్షించారు. మాసబ్‌ట్యాంక్‌లో డీసీపీ కార్యాలయానికి వెళ్లిన ఆయన శాంతిభద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్, టాస్‌్కఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు. కమ్యూనల్ రౌడీలను కట్టడి చేయాలని, సోషల్ మీడియా ద్వారా వదంతులు, సున్నిత అంశాలు సంబంధించిన వీడియోలు ప్రచారం చేసే వారిపైనా నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment