Cycle track
-
Hyderabad: కేబీఆర్ పార్కు, హుస్సేన్‌సాగర్‌ల చుట్టూ సైకిల్ ట్రాక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంటే ఒకప్పుడు సైకిళ్ల నగరం. వాహనాలు పెద్దగా రోడ్డెక్కని ఆ రోజుల్లో ప్రజలు సైకిళ్లనే అత్యధికంగా వినియోగించారు. బహుశా మరే నగరంలో లేనన్ని సైకిళ్లు హైదరాబాద్‌లో వినియోగంలో ఉన్నందుకే నిజాం కాలంలో దీన్ని సైకిళ్ల నగరం అని పిలిచారు. అలాంటి నగరం ఇప్పుడు వాహనాల నగరంగా మారింది. సుమారు 80 లక్షలకు పైగా వాహనాలు సిటీ రోడ్లపైన పరుగులు తీస్తున్నాయి. దీంతో సైకిల్‌కు చోటు లేకుండా పోయింది. ఈ క్రమంలో యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఉమ్టా) నాన్‌మోటరైజ్డ్ రవాణా సదుపాయాలపైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా నగరంలో అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఉమ్టా అధికారులు తెలిపారు. మొదటి దశలో సుమారు 50 కిలోమీటర్ల వరకు సరికొత్త సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సైకిలిస్టులకు పూర్తి భద్రత ఉండేవిధంగా ఈ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. మెట్రోస్టేషన్లు, సిటీ బస్స్టేషన్లు, జంక్షన్లలో సైకిళ్లను వినియోగించే విధంగా పబ్లిక్ బైస్కిల్ షేరింగ్ సిస్టమ్‌ను అమలు చేయనున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ట్రాక్... ఈ ప్రణాళికలో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ సైకిల్ ట్రాక్‌ను మరింత అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా హుస్సేన్‌సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు, నెక్లెస్‌రోడ్ సందర్శనకు వచ్చేవారు సరదాగా సైకిళ్లపైన విహరించవచ్చు. అలాగే కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాక్‌లను విస్తరించడం వల్ల వాకింగ్‌తో పాటు సైకిలింగ్ కూడా ఒక వ్యాయామంగా మారనుంది. మరోవైపు పాదచారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా వాహనాల వల్ల సైకిలిస్టులకు ప్రమాదాలు వాటిల్లకుండా ఫుట్‌పాత్‌ల మధ్యలో ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. మెట్రో స్టేషన్లకు సైకిళ్లు... కాంప్రహెన్సివ్ మెబిలిటీ ప్లానింగ్‌లో భాగంగా మెట్రో స్టేషన్లకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కోసం నాన్‌మోటరైజ్డ్ సర్వీసులను అందుబాటులోకి తేవాలనే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం మెట్రో స్టేషన్లకు 2 కిలోమీటర్ల పరిధిలో సైకిళ్లను వినియోగించేవిధంగా ట్రాక్‌లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అవకాశం ఉన్న మెట్రో స్టేషన్ల వద్ద ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కోసం పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా ప్రోత్సహించడంతో పాటు సైకిళ్ల వినియోగాన్ని పెంచేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అలాగే నగరం కొత్తగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో చేపడుతున్న రోడ్డు నిర్మాణాల్లో సైకిళ్ల కోసం ప్రత్యేకమైన ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో అవకాశం ఉన్న చోట 50 కిలోమీటర్ల వరకు ట్రాక్‌లను విస్తరించి దశల వారీగా ట్రాక్‌ల సంఖ్యను పెంచనున్నారు. గత సంవత్సరం నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, ఇటు కొల్లూరు వరకు హెచ్ఎండీఏ అధునాతన సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లానింగ్...⇒ హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్టా కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లానింగ్‌పైన దృష్టి సారించింది. ఇందుకోసం వినియోగంలో ఉన్న ప్రజా, ప్రైవేట్, వ్యక్తిగత రవాణా సదుపాయాలపైన అధ్యయనం చేసి 2050 నాటికి అవసరమైన రహదారుల విస్తరణ, రవాణా,మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయవలసి ఉంది. ⇒ ఇందుకోసం ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ లీ అసోసియేట్స్‌కు అధ్యయన బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. భవిష్యత్తులో ఈ పరిధి 10 వేల చదరపు కిలోమీటర్లకు పైగా పెరగనుంది. అలాగే నగర జనాభా కూడా 3 కోట్లు దాటవచ్చునని అంచనా. ఈ మేరకు ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ)ను రూపొందించవలసి ఉంది. ఇందులో భాగంగా సైకిల్ ట్రాక్‌ల అభివృద్ధిని చేపడతారు. -
Hyderabad:: హైటెక్సైకిల్ ట్రాక్‌ను చూసి వావ్ అనాల్సిందే!
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుకు చేరువలో రూ.100 కోట్లతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ప్రతిష్టాత్మక సైకిల్ ట్రాక్‌ను ఆదివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దక్షిణ కొరియాలో ఉన్న సైకిల్ ట్రాక్ తరహాలో దేశంలోనే ఆ స్థాయిలో తొలి సైకిల్ ట్రాక్‌ను నగరంలో ఏర్పాటు చేయడం విశేషం. కొల్లూరు నుంచి నార్సింగి వరకూ, నార్సింగి నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకూ మొత్తం 23 కి.మీ మార్గంలో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. సైకిల్ ట్రాక్ పొడవునా సోలార్ రూఫ్ టాప్ సైతం ఏర్పాటు చేశారు. సోలార్ పలకల నుంచి ఉత్పన్నమయ్యే విద్యుత్‌ను ట్రాక్ అవసరాల కోసం వినియోగిస్తారు. ట్రాక్ పొడవునా అద్దె సైకిళ్లు, సైకిల్ రిపేరింగ్ కేంద్రాలు కూడా నెలకొల్పారు. రైడర్లు విశ్రాంతి తీసుకునేందుకు కెఫెటేరియా వంటి వసతులు కూడా అందుబాటులోకి తెచ్చారు. -
సైక్లింగ్‌కు మొగ్గు చూపుతున్న యువత
రామచంద్రాపురం(పటాన్చెరు): నేటి యువత ఒత్తిడికి దూరంగా ఉండేందుకు అనేక మార్గాలను వెతుక్కుంటున్నారు. నిత్యం పని ఒత్తిడి, పోటీ ప్రపంచంలో ఉదయం నుంచి రాత్రి వరకు మనిషి యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నాడు. దాంతో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొంతమంది జిమ్‌లకు వెళ్తుండగా, మరి కొందరు సైకిల్ తొక్కడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో అనేక సైకిల్ క్లబ్‌లను ఏర్పాటు చేసి సైకిల్ తొక్కేవారిని ప్రోత్సహిస్తున్నారు. ఆరోగ్యం కోసం చిన్నారుల నుంచి వృద్ధుల వరకు సైక్లింగ్ పై ఆసక్తిని పెంచుకుంటున్నారు. పూర్వకాలంలో లాగా సమయం దొరికిందంటే సైకిల్ తొక్కుతున్నారు. బీహెచ్ఈఎల్ కాలనీలో విశాలమైన రోడ్లు, మంచి వాతావరణం ఉండడంతో ఉదయం సాయంత్రం వేళల్లో ఐటీ ఉద్యోగులు, యువత సైకిల్ పై చక్కర్లు కొడుతున్నారు. అదేవిధంగా గతంలో హైదరాబాద్ నగరానికి చెందిన సైక్లింగ్ క్లబ్బులు సైతం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి సైకిళ్ల కోసం ప్రత్యేక ట్రాకులను అభివృద్ధి చేయాలని కోరారు. దాంతో ప్రభుత్వం స్పందించి కోట్లాది రూపాయలు వెచ్చించి రింగ్ రోడ్డు ఆనుకొని ఓ సైక్లింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేసింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు రింగ్ రోడ్డు నుంచి కోకాపేట్ వరకు సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది. కాగా నేడు మార్కెట్లో సైతం వివిధ రకాల సైకిళ్లు అందుబాటులోకి వచ్చాయి. కొందరు విదేశాల నుంచి సైతం సైకిళ్లను తెప్పించుకుంటున్నారు. అయితే సైక్లింగ్‌తో ఆరోగ్యం పొందాలనుకునేవారు నిత్యం సుమారు 10 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు సైకిళ్లు తొక్కుతున్నారు. ప్రోత్సహిస్తున్న సైక్లింగ్ క్లబ్‌లు ఆరోగ్యమే మహాభాగ్యమంటూ పలు సైక్లింగ్ క్లబ్‌లు యువతను ప్రోత్సహిస్తుంది. సైకిల్ తొక్కడంపై ఆసక్తి పెంచేందుకు కృషి చేస్తున్నాయి. గతంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు చిలకమర్రి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్ఫూర్తి హెల్త్ క్లబ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సైక్లింగ్ పై అవగాహన కల్పించి సుమారు 200 మంది సభ్యులకు సైకిళ్లు పంపిణీ చేశారు. వీరంతా నిత్యం 15 కిలోమీటర్లు సైకిల్ తొక్కేవారు. అదే సమయంలో తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి సైతం అనేకమందికి సైకిల్ ఇప్పించి ప్రోత్సహించారు. ఒకప్పుడు ప్రతి ఇంటిలో సైకిల్ ఉండేది. ఎక్కడికి వెళ్లాలన్నా దాని మీదే వెళ్లేవారు. ఆధునిక బైకులు, కార్ల రాకతో సైకిళ్ల వాడకం తగ్గిపోయింది. ఎవరైనా సైకిల్ తొక్కుతూ రోడ్డు మీద కనిపిస్తే ఎగతాళి చేసేవారు. అలాంటిది ఆరోగ్య ప్రయోజనం కోసం యువత మళ్లీ సైకిల్‌పై సవారీ చేస్తున్నారు. -
సోలార్ సైకిల్ ట్రాక్ అదరహో
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ పర్యావరణవేత్త, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలిమ్ ఆదివారం ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని సైకిల్ ట్రాక్‌ను హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ నేతృత్వంలో అద్భుతమైన సోలార్ సైకిల్ ట్రాక్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. ట్రాక్‌పైన కొద్ది సేపు సైకిల్ తొక్కారు. దక్షిణ కొరియాలోని సైకిల్ ట్రాక్ తరహాలో ఇక్కడ ఏర్పాటు కావడం సంతోషమని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు రెండు విభాగాలుగా మొత్తం 23 కిలోమీటర్ల అధునాత సోలార్ సైకిల్ ట్రాక్‌ను హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కానున్న ఈ ట్రాక్ వద్ద పార్కింగ్ సదుపాయంతో పాటు సైకిళ్లు అద్దెకు లభిస్తాయి. అలాగే కెఫెటేరియా వంటి ఏర్పాట్లు కూడా ఉంటాయి. -
అసలే ఇరుకు..ఆపై సైకిల్ ట్రాక్
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ ప్రధాన రహదారిని కాంప్రహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్(సీఆర్ఎంపీ) ఏజెన్సీ నిర్వహిస్తోంది. రోడ్లపై గుంతలు పడినా, ఫుట్‌పాత్‌లు దెబ్బతిన్నా కొత్తగా రోడ్డు వేయాలన్నా, తవ్వాలన్నా సీఆర్ఎంపీ నిర్వహణలోనే చేపట్టాలి. అయితే గత కొంత కాలంగా కేబీఆర్ పార్కు చుట్టూ సైకిల్ ట్రాక్ నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో భాగంగా రెండేళ్లుగా ఫుట్‌పాత్‌లను ఆనుకుని సైకిల్ ట్రాక్ బొల్లార్డ్స్ కోసం గుంతలు తీశారు. వర్షాలకు ఈ గుంతలు నిండిపోయి పార్కుకు వచ్చే వాకర్లు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సైకిల్ ట్రాక్ నిర్మాణం పేరుతో పార్కు చుట్టూ సదరు సంస్థ రోడ్డును ఛిద్రం చేసింది. నాలుగైదు సార్లు గుంతలు తీసి పూడ్చి రూ. లక్షల్లో నిధులు వృథా చేశారు. జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా పార్కు చుట్టూ సైకిల్ ట్రాక్ నిర్మాణ పనుల కోసం తవ్వకాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే పార్కు చుట్టూ రోడ్డు ఇరుగ్గా ఉందని ఈ సైకిల్ ట్రాక్ నిర్మాణం చేపడితే సమస్య జఠిలంగా మారుతుందని, వాహహనాలు ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదని కేబీఆర్ పార్కుకు వచ్చే వాకర్లు, సందర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. తక్షణం పార్కుచుట్టూ సైకిల్ ట్రాక్ నిర్మాణ పనులు నిలిపివేయాలని తీసిన గుంతలను పూడ్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సీఆర్ఎంపీ నిర్వాకంతో పార్కు చుట్టూ రోడ్డు అధ్వానంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నడక హక్కును అమలు చేసిన తొలి రాష్ట్రం.. అక్కడ ఫుట్‌పాత్‌లు తప్పనిసరి!
దేశంలో నడక హక్కు (రైట్ టు వాక్)ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. రోడ్డు ప్రమాదాల కారణంగా పాదచారులు, సైక్లిస్టుల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్హెచ్ఏఐతో సహా అన్ని రహదారి యాజమాన్య ఏజెన్సీలు రోడ్ల నిర్మాణం, విస్తరణలో భాగంగా ఫుట్‌పాత్‌లు నిర్మించడాన్ని తప్పనిసరి చేసింది పంజాబ్ ప్రభుత్వం. తద్వారా 'నడక హక్కు'ను అమలు చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఇదీ చదవండి: Mothers Day: బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే.. టాప్ బిజినెస్ టైకూన్స్ మాతృమూర్తుల గురించి తెలుసా? పంజాబ్ హర్యానా హై కోర్ట్, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిల్ పై ఆయా కోర్టు ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది . పంజాబ్ చీఫ్ సెక్రటరీ విజయ్ కుమార్ జంజువా ఆ రాష్ట్ర ప్రభుత్వ ట్రాఫిక్ సలహాదారు నవదీప్ అసిజాకు ఇచ్చిన సమాచారం మేరకు.. రాష్ట్రంలో ఇకపై చేపట్టే అన్ని రోడ్ల నిర్మాణాలు, విస్తరణల్లో సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు తప్పనిసరి. ఈ మేరకు ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లను నిర్మించడానికి కావాల్సిన బడ్జెట్, కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, స్థానిక సంస్థలు, ఎన్హెచ్ఏఐ, అర్బన్ డెవలప్మెంట్ విభాగాలకు కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం నుంచి లేఖలు అందాయి. ఇదీ చదవండి: మొబైల్ ఫోన్ పోయిందా? ఇక చింతే లేదు.. త్వరలో పటిష్ట వ్యవస్థ! -
Hyderabad: తుదిదశకు సైక్లింగ్ ట్రాక్ పనులు.. రెండు నెలల్లో అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అధునాతన సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మరో రెండు నెలల్లో ట్రాక్‌పై సైకిళ్లు పరుగులు తీయనున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని 23 కిలోమీటర్ల మార్గంలో ట్రాక్ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. పర్యారణ పరిరక్షణ కోసం సైక్లింగ్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఈ నిర్మాణాన్ని చేపట్టింది. గతేడాది సెప్టెంబర్‌లో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సుమారు రూ.100 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును రెండు మార్గాల్లో చేపట్టారు. ఔటర్‌ను ఆనుకొని నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.5 కిలోమీటర్లు, కొల్లూరు నుంచి నార్సింగి వరకు 14.5 కిలోమీటర్ల మార్గంలో 5.3 మీటర్ల వెడల్పుతో, మూడు లైన్లలో ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలకు ధీటైన అభివృద్ధి జరుగుతుందని హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తోన్న సైకిల్ ట్రాక్ నగర ప్రతిష్టను మరింత పెంచుతుందన్నారు. ఆరోగ్యవిహారం... సైక్లింగ్ ట్రాక్‌లో సైకిళ్లపైన పరుగులు తీయడం కేవలం ఒక వ్యాయామ ప్రక్రియగానే కాకుండా ఒక విహారంలాంటి అనుభూతిని కలిగించేవిధంగా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ట్రాక్ పొడవునా అక్కడక్కడా రెస్ట్రూమ్లు, కెఫెటేరియాలు, బ్రేక్‌ఫాస్ట్ సెంటర్లు ఉంటాయి. అలాగే సైకిళ్లను ఇక్కడే అద్దెకు తీసుకోవచ్చు. సైకిళ్లకు పంక్చర్లయినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మరమ్మతులు చేసి ఇస్తారు. ట్రాక్ పొడవునా తాగునీటి సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రాలు ఉంటాయని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. అలాగే ట్రాక్‌ను పూర్తిగా పచ్చదనం ఉట్టిపడేవిధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ మార్గంలో సైక్లింగ్ చేసేవారికి ఆకుపచ్చ నడవాలు పరుగులు తీస్తున్న అనుభూతి కలుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్న ఈ ట్రాక్‌పైన సైక్లింగ్ పోటీలను కూడా నిర్వహించనున్నారు. మరోవైపు భద్రత దృష్ట్యా ట్రాక్ పొడవునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. సౌర విద్యుత్ వినియోగం... ట్రాక్‌పై కప్పును పూర్తిగా సౌరఫలకలతో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌ను ట్రాక్ అవసరాలకు వినియోగించనున్నారు. లైట్లు, తదితర అన్ని సదుపాయాలు కల్పిస్తారు. ఇక్కడ వినియోగించగా మిగిలిన విద్యుత్‌ను ఇతరులకు వినియోగించే అవకాశం ఉంది. ఈ 23 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం పూర్తయిన తరువాత రెండో దశలో గండిపేట వద్ద అతి పెద్ద సైకిల్ ట్రాక్ నిర్మిచనున్నారు. -
సైకిల్‌వాలా జిందాబాద్!
సాక్షి, హైదరాబాద్: త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఖైరతాబాద్ జోన్లో ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి. స్మార్ట్ సిటీస్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం చేపట్టిన ‘ఇండియా సైకిల్ 4 చేంజ్ చాలెంజ్ (సీ4సీ చాలెంజ్)’ అమలు చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. సైకిల్ ఫ్రెండ్లీ సిటీస్‌గా సీ4సీ చాలెంజ్‌కు నమోదైన 95 నగరాల్లో రాష్ట్రం నుంచి హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్‌లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రజల్లో సైకిల్ వినియోగాన్ని పెంచేందుకు కూడా ఈ కార్యక్రమాన్ని అనువుగా మలచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(హుమ్టా) పూర్తి స్థాయిలో తగిన సాంకేతిక సహకారం, సలహాలు అందిస్తాయి. పైలట్ ప్రాజెక్ట్‌గా తొలుత ఖైరతాబాద్ జోన్లో అమలు చేసేందుకు హెచ్ఎండీఏ, హుమ్టా, జీహెచ్ఎంసీలు నిర్ణయించాయి. అందుకుగాను ఆ విభాగాల అధికారులతోపాటు ట్రాఫిక్ పోలీసులు సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటు తదితర అంశాలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. జోన్‌లోని 23 కి.మీ.ల పొడవునా(రెండు వైపులా వెరసి 46 కి.మీ.) ఏడు సైకిల్ ట్రాక్‌ల మార్గాల్ని గుర్తించారు. తొలిదశలో పది కి.మీ.ల మేర అమలు చేస్తారు. ఎదురయ్యే సాధకబాధకాలు, ప్రజల స్పందన, ఫలితాన్ని బట్టి మిగతా మార్గాల్లో ఏర్పాటు చేస్తారు. సైకిల్‌ట్రాక్‌లు అందుబాటులోకి తెచ్చే ప్రాంతాల్లో తగిన సైనేజీలు, రోడ్మార్కింగ్లు, బారికేడింగ్, ప్లగ్ ప్లే బొల్లార్డ్ వంటివి ఏర్పాటు చేస్తారు. సైక్లిస్టుల భద్రతకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు పూర్తి సహకారం అందజేస్తారు. దశలవారీగా 450 కి.మీ.ల మేర.. ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం మెట్రో రైలు స్టేషన్లు, ఆర్టీసీ బస్ టెర్మినళ్లు, డిపోలు,ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్ద అందుబాటులో ఉన్న స్థలాల్లో పబ్లిక్ బైసికిల్ షేరింగ్ డాక్స్ (పీబీఎస్) ఏర్పాటు చేస్తారు. భవిష్యత్‌లో దశలవారీగా సైబరాబాద్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, చార్మినార్, మెహదీపట్నం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్, కోకాపేట ప్రాంతాల్లో 450 కి.మీ.ల మేర సైకిల్మార్గాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ దూర ప్రయాణాలకు సైకిల్ ప్రయాణం మేలని, అందుకు తగిన మార్గాలు అవసరమని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. చాలెంజ్.. రెండు దశల్లో.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు సీ4సీ కార్యక్రమాన్ని రెండు దశల్లో అమలు చేస్తారు. తొలి దశలో పైలట్‌గా సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటు ప్రణాళిక, ప్రజల్లో అవగాహన కల్పించడం, వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం వంటివి ఉంటాయి. మొదటి దశకు అక్టోబర్ 14 చివరి తేదీ. దీనికి సంబంధించి 95 నగరాల నుంచి అందిన ప్రణాళికలు, అమలు, వ్యూహాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని రెండో దశకు 11 నగరాలను ఎంపిక చేస్తారు. అక్టోబర్ 28 వరకు ఈ ఎంపిక పూర్తిచేస్తారు. ఎంపికైన నగరాలకు కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ కోటి రూపాయలు చొప్పున అవార్డుగా అందజేస్తుంది. ఎంపికైన నగరాలకు జాతీయ, అంతర్జాతీయ నిపుణులు తగిన సలహాలిస్తారు. రెండో దశ సైకిల్నెట్వర్క్ కార్యక్రమం వచ్చే సంవత్సరం మే నెలాఖరు వరకు పూర్తికాగలదని భావిస్తున్నారు. -
చెన్నైవాసులు సైకిల్ ప్రియులు
- దేశంలోనే ప్రథమ స్థానం - త్వరలో సైకిల్ ట్రాక్ చెన్నై, సాక్షి ప్రతినిధి: మానవుల ప్రయాణం ఆనాడు నడకతో ప్రారంభమై నేడు బుల్లెట్ ట్రైన్లకు చేరుకున్న దశలో సైతం చెన్నై నగరవాసులు సైకిల్ వినియోగంలో నెంబర్‌వన్‌గా నిలిచి ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకప్పుడు గమ్యం ఎంత దూరమైనా సగటు మానవుడు కాలినడకనే ఎంచుకున్నాడు. కలక్రమేణా గుర్రపు బగ్గీలు, బండ్లు అందుబాటులోకి వచ్చినా ఆ వాహనాలు ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. క్రమేణా సైకిళ్లు ప్రవేశించాయి. ఆ తరువాత వ్యక్తిగత ప్రయాణంలో సైకిళ్ల స్థానంలో మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, కార్లు వాడుకలోకి వచ్చాయి. దేశంలోని ముంబయి, డిల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో రోజు రోజుకూ మోటార్ సైకిళ్లు, కార్ల సంఖ్య పెరిగిపోతోంది. ఆ నగరాల్లో రానురానూ సైకిల్ కనుమరుగై పోతుండగా, మోటార్ సైకిల్ లేని ఇళ్లు ఉండవంటే అతిశయోక్తి కాదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయా నగరాలతో పోలిస్తే చెన్నై నగరంలో సైకిల్ వాడకం ప్రథమ స్థానంలో ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. 2001లో 46 శాతం మంది సైకిళ్లు వాడుతుండగా అది క్రమేణా తగ్గుతూ 2011 నాటికి 37 శాతానికి చేరింది. అయినా ఇతర నగరాల కంటే అధికమనే సత్యమని వెల్లడైంది. పూనే 33 శాతం, డిల్లీ 31 శాతం, హైదరాబాద్, కోల్‌కతా 26 శాతం, బెంగళూరు 23 శాతం, ముంబై 9 శాతం సైకిల్ వినియోగం ఉన్నట్లు తేలింది. వేగంగా గమ్యం చేరుకోవాలంటే మోటార్ సైకిల్ లేదా కారును ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా ఆరోగ్య పరిరక్షణకు నడక లేదా సైకిల్ తొక్కడం అవసరమనే స్పృహ చెన్నైవాసులకు అత్యధికమని సర్వేలో తేటతెల్లమైంది. ఇతర నగరాల్లో సైతం వ్యాయామాన్ని దృష్టిలో ఉంచుకుని సైకిల్ పట్ల ఆసక్తి ఉన్నా సైకిల్ ప్రయాణికులు వెళ్లేందుకు అవసరమైన ప్రత్యేక బాట లేకపోవడం కారణంగా దాన్ని వినియోగించడం లేదని తెలుస్తోంది. పూనేలో 134 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ఉంది. అలాగే బెంగళూరులో 40, ముంబయిలో 13 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ఉంది. నగరవాసుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని చెన్నైలో సైతం సైకిల్ ట్రాక్‌ను నిర్మించే ఆలోచనలో కార్పొరేషన్ ఉన్నట్లు తెలుస్తోంది.