చెన్నైవాసులు సైకిల్ ప్రియులు
- దేశంలోనే ప్రథమ స్థానం
- త్వరలో సైకిల్ ట్రాక్
చెన్నై, సాక్షి ప్రతినిధి: మానవుల ప్రయాణం ఆనాడు నడకతో ప్రారంభమై నేడు బుల్లెట్ ట్రైన్‌లకు చేరుకున్న దశలో సైతం చెన్నై నగరవాసులు సైకిల్ వినియోగంలో నెంబర్‌వన్‌గా నిలిచి ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకప్పుడు గమ్యం ఎంత దూరమైనా సగటు మానవుడు కాలినడకనే ఎంచుకున్నాడు. కలక్రమేణా గుర్రపు బగ్గీలు, బండ్లు అందుబాటులోకి వచ్చినా ఆ వాహనాలు ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. క్రమేణా సైకిళ్లు ప్రవేశించాయి. ఆ తరువాత వ్యక్తిగత ప్రయాణంలో సైకిళ్ల స్థానంలో మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, కార్లు వాడుకలోకి వచ్చాయి.
దేశంలోని ముంబయి, డిల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో రోజు రోజుకూ మోటార్ సైకిళ్లు, కార్ల సంఖ్య పెరిగిపోతోంది. ఆ నగరాల్లో రానురానూ సైకిల్ కనుమరుగై పోతుండగా, మోటార్ సైకిల్ లేని ఇళ్లు ఉండవంటే అతిశయోక్తి కాదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయా నగరాలతో పోలిస్తే చెన్నై నగరంలో సైకిల్ వాడకం ప్రథమ స్థానంలో ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది.
2001లో 46 శాతం మంది సైకిళ్లు వాడుతుండగా అది క్రమేణా తగ్గుతూ 2011 నాటికి 37 శాతానికి చేరింది. అయినా ఇతర నగరాల కంటే అధికమనే సత్యమని వెల్లడైంది. పూనే 33 శాతం, డిల్లీ 31 శాతం, హైదరాబాద్, కోల్‌కతా 26 శాతం, బెంగళూరు 23 శాతం, ముంబై 9 శాతం సైకిల్ వినియోగం ఉన్నట్లు తేలింది. వేగంగా గమ్యం చేరుకోవాలంటే మోటార్ సైకిల్ లేదా కారును ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా ఆరోగ్య పరిరక్షణకు నడక లేదా సైకిల్ తొక్కడం అవసరమనే స్పృహ చెన్నైవాసులకు అత్యధికమని సర్వేలో తేటతెల్లమైంది.
ఇతర నగరాల్లో సైతం వ్యాయామాన్ని దృష్టిలో ఉంచుకుని సైకిల్ పట్ల ఆసక్తి ఉన్నా సైకిల్ ప్రయాణికులు వెళ్లేందుకు అవసరమైన ప్రత్యేక బాట లేకపోవడం కారణంగా దాన్ని వినియోగించడం లేదని తెలుస్తోంది. పూనేలో 134 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ఉంది. అలాగే బెంగళూరులో 40, ముంబయిలో 13 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ఉంది. నగరవాసుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని చెన్నైలో సైతం సైకిల్ ట్రాక్‌ను నిర్మించే ఆలోచనలో కార్పొరేషన్ ఉన్నట్లు తెలుస్తోంది.