
ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
షింకాన్సెన్ బుల్లెట్ రైలులో జపాన్ ప్రధానమంత్రితో ప్రయాణం
సెమీకండక్టర్ ప్లాంట్ సందర్శన
టోక్యో: ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో షింకాన్సెన్ బుల్లెట్ రైలులో ప్రయాణించారు. జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబాతో కలిసి రాజధాని టోక్యో నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని సెండాయ్‌కి చేరుకున్నారు. అక్కడ సెమీకండక్టర్ ప్లాంట్‌ను సందర్శించారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ తొలి రోజు శుక్రవారం ఇషిబాతో సమావేశమై, ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండో రోజు శనివారం టోక్యో ఎల్రక్టాన్ లిమిటెడ్–మియాగీ(టెల్ మియాగీ)ను సందర్శించారు. సెమీకండక్టర్ల తయారీలో ఈ సంస్థ అగ్రగామిగా మారింది. సెమీకండక్టర్ల తయారీలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, జపాన్ ఇప్పటికే నిర్ణయానికొచ్చాయి.
モディ首相と仙台へ。昨夜に引き続き、車内からご一緒します。 pic.twitter.com/ggE6DonklN
— 石破茂 (@shigeruishiba) August 30, 2025
భారత్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు జపాన్ సాంకేతిక సహకారం అందించనుంది. అలాగే 508 కిలోమీటర్ల ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు జపాన్ సహకరించేలా ఒప్పందం కుదిరింది. సెండాయ్‌లో మోదీ గౌరవార్థం ఇషిబా ప్రత్యేక విందు ఇచ్చారు. ఇండియా–జపాన్ మధ్య సహకారంలో సెమీకండక్టర్ రంగం అత్యంత కీలకమని మోదీ ఉద్ఘాటించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
టోక్యో ఎల్రక్టాన్ ఫ్యాక్టరీలో ట్రైనింగ్ రూమ్, ప్రొడక్షన్ ఇన్నోవేషన్ ల్యాబ్‌ను సందర్శించానని, అధికారులతో మాట్లాడానని తెలిపారు. సెమీకండక్టర్ల రంగంలో భారత్, జపాన్ గత కొన్నేళ్లుగా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఈ సహకారం మరింత పెరగాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల సరఫరాలో టెల్–మియాగీ ప్రాధాన్యతను అధికారులు మోదీకి వివరించారు.
JR東日本で研修中のインド人運転士さんたちとご挨拶。 pic.twitter.com/UXKoSVP50r
— 石破茂 (@shigeruishiba) August 30, 2025