![సైకిళ్లతో తెల్లాపూర్ స్ఫూర్తి హెల్త్ క్లబ్ సభ్యులు (ఫైల్) - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/28/27ptc21b-350052_mr_0.jpg.webp?itok=t236GbWF)
సైకిళ్లతో తెల్లాపూర్ స్ఫూర్తి హెల్త్ క్లబ్ సభ్యులు (ఫైల్)
రామచంద్రాపురం(పటాన్‌చెరు): నేటి యువత ఒత్తిడికి దూరంగా ఉండేందుకు అనేక మార్గాలను వెతుక్కుంటున్నారు. నిత్యం పని ఒత్తిడి, పోటీ ప్రపంచంలో ఉదయం నుంచి రాత్రి వరకు మనిషి యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నాడు. దాంతో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొంతమంది జిమ్‌లకు వెళ్తుండగా, మరి కొందరు సైకిల్ తొక్కడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో అనేక సైకిల్ క్లబ్‌లను ఏర్పాటు చేసి సైకిల్ తొక్కేవారిని ప్రోత్సహిస్తున్నారు. ఆరోగ్యం కోసం చిన్నారుల నుంచి వృద్ధుల వరకు సైక్లింగ్ పై ఆసక్తిని పెంచుకుంటున్నారు. పూర్వకాలంలో లాగా సమయం దొరికిందంటే సైకిల్ తొక్కుతున్నారు.
బీహెచ్‌ఈఎల్ కాలనీలో విశాలమైన రోడ్లు, మంచి వాతావరణం ఉండడంతో ఉదయం సాయంత్రం వేళల్లో ఐటీ ఉద్యోగులు, యువత సైకిల్ పై చక్కర్లు కొడుతున్నారు. అదేవిధంగా గతంలో హైదరాబాద్ నగరానికి చెందిన సైక్లింగ్ క్లబ్బులు సైతం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి సైకిళ్ల కోసం ప్రత్యేక ట్రాకులను అభివృద్ధి చేయాలని కోరారు. దాంతో ప్రభుత్వం స్పందించి కోట్లాది రూపాయలు వెచ్చించి రింగ్ రోడ్డు ఆనుకొని ఓ సైక్లింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేసింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు రింగ్ రోడ్డు నుంచి కోకాపేట్ వరకు సైకిల్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది. కాగా నేడు మార్కెట్లో సైతం వివిధ రకాల సైకిళ్లు అందుబాటులోకి వచ్చాయి. కొందరు విదేశాల నుంచి సైతం సైకిళ్లను తెప్పించుకుంటున్నారు. అయితే సైక్లింగ్‌తో ఆరోగ్యం పొందాలనుకునేవారు నిత్యం సుమారు 10 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు సైకిళ్లు తొక్కుతున్నారు.
ప్రోత్సహిస్తున్న సైక్లింగ్ క్లబ్‌లు
ఆరోగ్యమే మహాభాగ్యమంటూ పలు సైక్లింగ్ క్లబ్‌లు యువతను ప్రోత్సహిస్తుంది. సైకిల్ తొక్కడంపై ఆసక్తి పెంచేందుకు కృషి చేస్తున్నాయి. గతంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు చిలకమర్రి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్ఫూర్తి హెల్త్ క్లబ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సైక్లింగ్ పై అవగాహన కల్పించి సుమారు 200 మంది సభ్యులకు సైకిళ్లు పంపిణీ చేశారు. వీరంతా నిత్యం 15 కిలోమీటర్లు సైకిల్ తొక్కేవారు. అదే సమయంలో తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి సైతం అనేకమందికి సైకిల్ ఇప్పించి ప్రోత్సహించారు.
ఒకప్పుడు ప్రతి ఇంటిలో సైకిల్ ఉండేది. ఎక్కడికి వెళ్లాలన్నా దాని మీదే వెళ్లేవారు. ఆధునిక బైకులు, కార్ల రాకతో సైకిళ్ల వాడకం తగ్గిపోయింది. ఎవరైనా సైకిల్ తొక్కుతూ రోడ్డు మీద కనిపిస్తే ఎగతాళి చేసేవారు. అలాంటిది ఆరోగ్య ప్రయోజనం కోసం యువత మళ్లీ సైకిల్‌పై సవారీ చేస్తున్నారు.
![కొల్లూరులో రింగ్ రోడ్డును ఆనుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ 1](/gallery_images/2023/09/28/27ptc21-350052_mr.jpg)
కొల్లూరులో రింగ్ రోడ్డును ఆనుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్
Comments
Please login to add a commentAdd a comment