కేబీఆర్ పార్క్‌లో బాలయ్య యోగా
హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి అనుబంధంగా కొనసాగుతున్న యాడ్ లైఫ్ బుధవారం యోగా సాధన కార్యక్రమాన్ని కేబీఆర్ పార్కు వద్ద ఏర్పాటు చేసింది. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ఇంతటి ప్రాచుర్యం రావడం భారతదేశానికి, ఇక్కడి సాంస్కృతిక పరంపరకు దక్కిన గౌరవం అన్నారు.
యోగా ప్రకృతి సిద్ధంగా మన ఆరోగ్యానికి వరదాయనిలాంటిదని అందులో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయని అవి శరీరంలోని పలు కీలక అవయవాలకు మేలు చేస్తాయన్న విషయం శాస్త్రీయంగా రుజువైందని చెప్పారు. మంచి ఆరోగ్యాన్ని కోరుకునే వారందరూ నిరంతరం యోగా సాధన చేయాలని సూచించారు. ముఖ్యంగా క్యాన్సర్‌తో బాధపడతున్న వారికి యోగ మేలు చేస్తుందని ఒత్తిడి తగ్గించడమే కాక నయం చేయడంపై కూడా ప్రభావాన్ని చూపుతుందన్నారు. అందుకే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో యోగా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. కార్యక్రమంలో భాగంగా యోగా గురువులు క్రమపద్ధతిలో యోగాసనాలు చేయించారు. పెద్ద సంఖ్యలో ఆస్పత్రి నర్సులు, వైద్యులు సిబ్బందితో పాటు కేబీఆర్ పార్కు వాకర్లు, సందర్శకులు పాల్గొన్నారు.