hero balakrishna
-
రేపు వేల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రారంభం
హైదరాబాద్: వేల్యూ జోన్ హైపర్ మార్ట్ కొత్త అవుట్లెట్ మాల్ హైదరాబాద్‌లోని పటాన్చెరులో గురువారం (రేపు) ప్రారంభం కానుంది. సినీ నటుడు బాలకృష్ణ లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. ఇందులో ప్రముఖ బ్రాండ్లపై 40% డిస్కౌంట్ లభిస్తుంది. అవుట్లెట్ చుట్టుపక్కల ఇక్రిశాట్, నిమ్జ్, ఐఐటీ, ప్రధాన సంస్థలు ఉండటంతో విద్యార్థులు, కుటుంబాలు, నిపుణులను మాల్ ఆకర్షిస్తుందన్న విశ్వాసాన్ని యాజమాన్యం వ్యక్తం చేసింది. ‘‘మాల్ ఆర్కిటెక్చర్, లేవుట్ నిర్మాణం భాగ్యనగర సంస్కృతి, అభివృద్ధికి వేదికగా నిలిచింది. వెడలై్పన కారిడార్లు, సహజకాంతి, అధునాతన పద్ధతుల్లో రూపొందించిన స్టోర్ల మిశ్రమం సందర్శకులకు గొప్ప షాపింగ్ అనుభూతి పంచుతాయి’’ అని యాజమాన్యం వివరించింది. -
వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ: బాలకృష్ణ
హిందూపురం: తన తనయుడు మోక్షజ్ఞ త్వరలో సినీ రంగ ప్రవేశం చేయనున్నట్టు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. బుధవారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా తన నియోజకవర్గం హిందూపురంలో బాలకృష్ణ కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. తనను ఆదరించినట్టే తన కొడుకును కూడా ఆదరించాలని ప్రేక్షకులకు బాలకృష్ణ పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జూన్ కల్లా మోక్షజ్ఞ సినిమా ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. కాగా బాలకృష్ణ ప్రస్తుతం తన 102 చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. కె.ఎస్. రవికుమార్ దర్శకుడు. నయనతార, నటాషా దోషీ కథానాయికలు. సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
కేబీఆర్ పార్క్‌లో బాలయ్య యోగా
హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి అనుబంధంగా కొనసాగుతున్న యాడ్ లైఫ్ బుధవారం యోగా సాధన కార్యక్రమాన్ని కేబీఆర్ పార్కు వద్ద ఏర్పాటు చేసింది. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా యోగాకు ఇంతటి ప్రాచుర్యం రావడం భారతదేశానికి, ఇక్కడి సాంస్కృతిక పరంపరకు దక్కిన గౌరవం అన్నారు. యోగా ప్రకృతి సిద్ధంగా మన ఆరోగ్యానికి వరదాయనిలాంటిదని అందులో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయని అవి శరీరంలోని పలు కీలక అవయవాలకు మేలు చేస్తాయన్న విషయం శాస్త్రీయంగా రుజువైందని చెప్పారు. మంచి ఆరోగ్యాన్ని కోరుకునే వారందరూ నిరంతరం యోగా సాధన చేయాలని సూచించారు. ముఖ్యంగా క్యాన్సర్‌తో బాధపడతున్న వారికి యోగ మేలు చేస్తుందని ఒత్తిడి తగ్గించడమే కాక నయం చేయడంపై కూడా ప్రభావాన్ని చూపుతుందన్నారు. అందుకే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో యోగా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. కార్యక్రమంలో భాగంగా యోగా గురువులు క్రమపద్ధతిలో యోగాసనాలు చేయించారు. పెద్ద సంఖ్యలో ఆస్పత్రి నర్సులు, వైద్యులు సిబ్బందితో పాటు కేబీఆర్ పార్కు వాకర్లు, సందర్శకులు పాల్గొన్నారు. -
హీరో బాలకృష్ణకు నోటీసులు
హైదరాబాద్: సినీ హీరో బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమా నిర్మాతలకు కూడా నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గౌతమీ పుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు వినోద పన్ను మినహాయింపుపై దాఖలైన పిల్‌ను న్యాయస్థానం మంగళవారం విచారించింది. గతంలో ఈ విషయంలో తమిళనాడు తీర్పును పిటిషనర్ ఉదహరించారు. -
సీఎం కేసీఆర్‌ను కలిసిన బాలకృష్ణ
-
సీఎం కేసీఆర్‌ను కలిసిన బాలకృష్ణ
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు. కేసీఆర్ ను కలిసిందేకు బాలకృష్ణ శుక్రవారం అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి తెలంగాణలో రాయితీ ఇచ్చినందుకు సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సినిమా తిలకించేందుకు రావాల్సిందిగా కేసీఆర్‌ను బాలకృష్ణ ఆహ్వానించారు. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చారిత్రక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’.. హీరోయిన్ గా శ్రియ, కీలక పాత్రలో హేమమాలిని నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బాలకృష్ణ నటించిన 100వ చిత్రం కావడంలో అటు అభిమానుల్లోనూ, ఇటు చిత్ర పరిశ్రమలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. -
హీరో బాలకృష్ణ కారులో ఎవరున్నారు?
బంజారాహిల్స్: తెల్లవారుజామున అతివేగంగా దూసుకెళ్తూ హీరో నందమూరి బాలకృష్ణ కారు ప్రమాదానికి గురైంది. డివైడర్ మీదుగా వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. అయితే కారులో ఎవరున్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బంజారాహిల్స్ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు... బంజారాహిల్స్ రోడ్ నం. 12 అగ్రసేన్ చౌక్ టీఆర్ఎస్ భవన్ వైపు నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మీదుగా కేబీఆర్‌పార్కు వైపు బుధవారం తెల్లవారుజామున 1.35 గంటలకు దూసుకెళ్తున్న తెలుపు రంగు ఫార్చునర్ కారు (ఏపీ 02 ఏవై 0001) కేన్సర్ ఆస్పత్రి సమీపంలో వేగాన్ని కంట్రోల్ చేయలేక డివైడర్‌ను ఢీకొట్టింది. పెద్దగా శబ్దం రావడంతో ఫుట్‌పాత్‌పైన, నైట్ షెల్టర్లలో నిద్రిస్తున్నవారు ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు. వారు వచ్చేసరికే కారులో నుంచి ఓ వ్యక్తి దిగి అటూ, ఇటూ చూసి అవతలి వైపు డివైడర్ దిగి అటుగా వెళ్తున్న ఆటో ఎక్కి వెళ్లినట్లు వారు తెలిపారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఎస్ఐ జితేందర్‌రెడ్డి 1.45 గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించేందుకు యత్నించగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కారులో ఒక్కరే ఉన్నారని, ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, కారు నుంచి దిగి ఆయన ఆటోలో వెళ్లిపోయాడని అక్కడే ఉన్న రోగులు, వారి బంధువులు ప్రత్యక్ష సాక్షులుగా వెల్లడించారు. ఎస్ఐ వెంటనే కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఈ కారుకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి తమ వద్దకు ఎవరూ రాలేదని బంజారాహిల్స్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. కారు నడుపుతున్నది ఎవరన్నదానిపై బాలకృష్ణ మేనేజర్‌ను పిలిపించి సమాచారం రాబడతామని, ఆ దారిలో ఉన్న సీసీ ఫుటేజీలను కూడా పరశీలిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా బసవతారకం చౌరస్తాలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ ప్రమాదానికి గల కారణాలు, కారు నడుపుతున్నది ఎవరన్నది తెలియకుండా ఉంది. అగ్రసేన్ చౌక్, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, రోడ్ నెం. 45 చౌరస్తాలలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. -
బాలకృష్ణకు గన్ని అల్పాహార విందు
రాజమహేంద్రవరం సిటీ : ‘డిక్టేటర్’ విజయోత్సవ యాత్రలో భాగంగా నగరానికి వచ్చిన సినీ హీరో బాలకృష్ణకు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గన్ని కృష్ణ శనివారం ఉదయం అల్పాహారవిందు ఇచ్చారు. బాలకృష్ణ గన్ని ఇంటివద్ద ఉన్న ఎన్టీఆర్, గన్ని సత్యన్నారాయణమూర్తిల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ‘డిక్టేటర్’ విజయం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. త్వరలో తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయనున్నట్లు తెలిపారు. కాగా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. లారీ డ్రైవర్లకు దుస్తులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్, మేయర్ పంతం రజనీ శేషసాయి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సినీ దర్శకుడు శ్రీవాస్ పాల్గొన్నారు. -
తిమ్మమాంబ చరిత్ర తీయడం ఆనందంగా ఉంది
- హీరో బాలకృష్ణ ‘‘అనంతపురంలో తిమ్మమ్మ మర్రిమాను చరిత్రతో సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. ఓ మహిళ కథతో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అని హీరో బాలకృష్ణ అన్నారు. శ్రీ వెంకట్, భవ్యశ్రీ జంటగా బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో ఎస్.ఎస్.ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పెదరాసు సుబ్రమణ్యం నిర్మిస్తున్న చిత్రం ‘సతీ తిమ్మమాంబ’. ఈ చిత్రం పాటల సీడీని బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ- ‘‘తెలుగు భాష, సంస్కృతి అంటే నాకెంతో ప్రేమ. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న తెలుగు జాతి మనది. తెలుగును మర్చిపోయి పరభాష మీద ప్రేమ పెరుగుతున్న ఈ రోజుల్లో మన చరిత్రకు సంబంధించిన సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ కథ రాశాక బాలకృష్ణగారు నటించిన ‘భైరవ ద్వీపం’ ప్రథమార్ధాన్ని చాలాసార్లు చూశాను. కానీ ఆ సినిమా అంత గొప్పగా ఈ సినిమా చేయలేకపోయాం. ఉన్నంతలో చక్కగా తెరకెక్కించాం. బాలకృష్ణగారి కోసం శివరావణ యుద్ధం అనే కథ తయారు చేశాను. ఆయన అంగీకరిస్తే, సినిమా చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు. ‘‘మా పూర్వీకులకు సంబంధించిన కథ ఇది. నియమ నిబంధన లతో ఈ చిత్రాన్ని రూపొందించాం. మొదట ఈ చిత్రాన్ని సీరియల్‌గా చేసి టెన్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేశాం. కానీ, స్లాట్ దొరక్క పోవడంతో మొత్తం ప్రదర్శించలేకపోయాం. అందుకే సినిమాగా తీర్చిదిద్దాం. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని నిర్మాత అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు.