హీరో బాలకృష్ణ కారులో ఎవరున్నారు?
బంజారాహిల్స్: తెల్లవారుజామున అతివేగంగా దూసుకెళ్తూ హీరో నందమూరి బాలకృష్ణ కారు ప్రమాదానికి గురైంది. డివైడర్ మీదుగా వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. అయితే కారులో ఎవరున్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. బంజారాహిల్స్ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు... బంజారాహిల్స్ రోడ్ నం. 12 అగ్రసేన్ చౌక్ టీఆర్‌ఎస్ భవన్ వైపు నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మీదుగా కేబీఆర్‌పార్కు వైపు బుధవారం తెల్లవారుజామున 1.35 గంటలకు దూసుకెళ్తున్న తెలుపు రంగు ఫార్చునర్ కారు (ఏపీ 02 ఏవై 0001) కేన్సర్ ఆస్పత్రి సమీపంలో వేగాన్ని కంట్రోల్ చేయలేక డివైడర్‌ను ఢీకొట్టింది.
పెద్దగా శబ్దం రావడంతో ఫుట్‌పాత్‌పైన, నైట్ షెల్టర్లలో నిద్రిస్తున్నవారు ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు. వారు వచ్చేసరికే కారులో నుంచి ఓ వ్యక్తి దిగి అటూ, ఇటూ చూసి అవతలి వైపు డివైడర్ దిగి అటుగా వెళ్తున్న ఆటో ఎక్కి వెళ్లినట్లు వారు తెలిపారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఎస్‌ఐ జితేందర్‌రెడ్డి 1.45 గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించేందుకు యత్నించగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కారులో ఒక్కరే ఉన్నారని, ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, కారు నుంచి దిగి ఆయన ఆటోలో వెళ్లిపోయాడని అక్కడే ఉన్న రోగులు, వారి బంధువులు ప్రత్యక్ష సాక్షులుగా వెల్లడించారు.
ఎస్‌ఐ వెంటనే కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఈ కారుకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి తమ వద్దకు ఎవరూ రాలేదని బంజారాహిల్స్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. కారు నడుపుతున్నది ఎవరన్నదానిపై బాలకృష్ణ మేనేజర్‌ను పిలిపించి సమాచారం రాబడతామని, ఆ దారిలో ఉన్న సీసీ ఫుటేజీలను కూడా పరశీలిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా బసవతారకం చౌరస్తాలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ ప్రమాదానికి గల కారణాలు, కారు నడుపుతున్నది ఎవరన్నది తెలియకుండా ఉంది. అగ్రసేన్ చౌక్, సీవీఆర్ న్యూస్ చౌరస్తా, రోడ్ నెం. 45 చౌరస్తాలలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.