ఫైట్స్: వైష్ణవి
యోగాను, కలరిపయట్టును కలిపికొడుతున్న అమ్మాయి!
ఉదయం ఎనిమిది గంటలు దాటింది. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ దగ్గర్లో ఉన్న ఓ డ్యాన్స్ స్కూల్ జనంతో కిటకిటలాడుతోంది. వారందరి ఎదుటా నిలబడి ఓ ఇరవై నాలుగేళ్ల అమ్మాయి డెమో ఇస్తోంది. ఒళ్లును విల్లులా వంచి ఆమె ప్రదర్శిస్తోన్న ఆసన భంగిమలు చూపరుల మతి పోగొడుతున్నాయి. చేతుల్ని చురకత్తుల్లా తిప్పుతోన్న భంగిమలు ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. అందరికీ తెలిసిన యోగాకి... కేరళ వారికి మాత్రమే తెలిసిన యుద్ధకళ కలరిపయట్టును కలిపిన ఆమె ప్రతిభకి చప్పట్ల వర్షం కురిసింది. ప్రశంసల జల్లులో తడిసి ముద్దయిన ఆ యువతి పేరు... వైష్ణవీ సాయినాథ్. ప్రముఖ నర్తకి రాజేశ్వరీ సాయినాథ్ కుమార్తె, చిన్న వయసులోనే కీర్తి కిరీటాలను అందుకున్న భరతనాట్య, ఒడిస్సీ నృత్యకారిణి. నర్తకిగా తన ప్రయాణం గురించి, తాను రూపొందించిన
‘కలరి-యోగ’ గురించి వైష్ణవి మాటల్లోనే...
నా మూడో యేటనే నృత్య సాధన మొదలుపెట్టాను. అమ్మలాగా మంచి డ్యాన్సర్‌ని కావాలని, గొప్ప పేరు తెచ్చు కోవాలని ఊహ తెలిసిన నాటి నుంచీ కలలు కనేదాన్ని. నిజానికి నాలో నాన్న సాయినాథ్ టాలెంట్ కూడా ఉంది. ఆయన క్రికెటర్. రంజీ ఆడారు. నేనూ చదువుకునే రోజుల్లో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ ప్లేయర్‌ని. అయినా క్రీడల కంటే నాట్యమే నన్ను ఎక్కువ ఆకర్షించడంతో భరతనాట్యం, ఒడిస్సీ నేర్చు కున్నాను. దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. అవార్డులూ గెల్చుకున్నాను. కానీ అన్నిటికంటే ఆనందం కలిగించేదేంటో తెలుసా... అమ్మతో కలిసి వేదిక మీద నృత్యం చేయడం, నేను సోలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు అమ్మ ప్రేక్షకుల్లో కూర్చుని నావైపు గర్వంగా చూస్తూ ఉండటం!
అప్పుడొచ్చిన ఆలోచనే..
ఓరోజు సాయంత్రం ఫ్రెండ్స్‌తో బయటి కెళ్లాను. ఒక చోటికి వెళ్దామని నేనంటే, వాళ్లు ఈ టైమ్‌లో ఎందుకు రిస్క్ అన్నారు. సరే అన్నాను కానీ తర్వాత చాలా ఆలోచించాను. అమ్మాయిలకు రక్షణ లేదు. శరీరం బలహీన మైనది కావడం వల్ల చెడుకు ఎదురు తిరిగే శక్తి ఉండదు. కాబట్టే ఎక్కడికైనా వెళ్లాలంటే భయం. అదే మనం బలంగా ఉంటే, ఎవరినైనా ఎదుర్కోగల శక్తిమంతులమైతే... ఏ సమయంలోనైనా, ఎక్కడికైనా ధైర్యంగా వెళ్లగలం. అలా అనుకున్నప్పుడు పుట్టిన ఆలోచనకు రూపమే... ‘కలరి-యోగా’.
మార్షల్ ఆర్ట్స్ అనగానే అందరికీ విదేశీ కళలు గుర్తొస్తాయి. కానీ మనదేశంలోనే ఓ గొప్ప మార్షల్ ఉంది... కలరిపయట్టు. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ కళలో నాలుగు దశలుంటాయి. మొదటి దశలో బాడీ మూమెంట్స్.. రెండో దశలో కర్ర సాము.. మూడో దశలో కత్తి వంటి ఆయు ధాలను వాడటం.. నాలుగో దశలో మర్మకళను నేర్పుతారు. నేను మూడేళ్లుగా కేరళ వెళ్లి కలరిపయట్టు నేర్చు కుంటున్నాను. మూడో దశకు చేరుకున్నాను. ఈ కళను మన వారికి కూడా పరిచయం చేయాలని పించింది. అయితే కలరిపయట్టు నేర్చుకోవడం అంత తేలిక కాదు. చాలా కష్టమైన విద్య కాబట్టి శరీరం సహకరించదు. ముందుగా యోగా ప్రాక్టీస్ చేస్తే... శరీరం ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఆపైన కలరిపయట్టు తేలికగా అబ్బుతుంది. అందువల్ల ఈ రెండిటినీ కలిపాను. అది మాత్రమే కాదు. మారిన జీవనశైలి అనారోగ్యాలను పెంచుతోంది. వాటిని అదుపు చేయాలంటే యోగాయే మంచి మార్గం. అటువంటి యోగాకి కలరిపయట్టును జతచేస్తే... వ్యాయామంతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకున్నట్టు అవుతుంది కదా అని కూడా అనిపించింది. మహిళలపై నేరాలు పెరిగిపోతున్న ఈ సమయంలో ఇలాంటి విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది.
కళ అడ్డంకి కాదు...
మాకు హైదరాబాద్‌లో డ్యాన్స్ స్కూల్స్ ఉన్నాయి. వాటిలో చాలామంది డ్యాన్స్ నేర్చు కుంటున్నారు. అయితే ఇప్పటికీ చాలామంది తల్లి దండ్రులు డ్యాన్సూ గట్రా అంటూ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు, ముందు చదవండి అని పిల్లల్ని కట్టడి చేయడం కనిపిస్తోంది. కళలు సమయాన్ని వృథా చేస్తాయనడం కరెక్ట్ కాదు. నేను చిన్నప్పుడు ఎక్కువసేపు డ్యాన్స్‌తోనే కాలం గడిపినా, చదువులో వెనుకబడలేదు. బీఏ జర్నలిజంతో పాటు, రెండు సబ్జెక్ట్స్ మాస్టర్స్ చేసింది. నాట్యం చేసేటప్పుడు అవయవాలన్నింటినీ కో ఆర్డినేట్ చేయాల్సి వస్తుంది. అది ఏకాగ్రతను నేర్పుతుంది. ఏకాగ్రత ఎప్పుడైతే పెరుగుతుందో గ్రాహ్యశక్తి కూడా పెరుగుతుంది. అందుకే నాకు ఏ పాఠమైనా ఒకట్రెండుసార్లు చదివితే వచ్చేసేది. డ్యాన్స్ పిల్లల్ని మరింత షార్ప్‌గా తయారు చేస్తుందే తప్ప ఎందులోనూ వెనుకబడనివ్వదు. కాబట్టి పిల్లల్ని నిరుత్సాహపర్చకండి... ప్రోత్సహించండి!!
ఫొటోలు: ఠాకూర్