పచ్చని ఆకు సాక్షిగా ప్రమాద ఘంటిక | Hyderabad environment is at risk | Sakshi
Sakshi News home page

పచ్చని ఆకు సాక్షిగా ప్రమాద ఘంటిక

Published Tue, Jun 7 2016 1:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

పచ్చని ఆకు సాక్షిగా ప్రమాద ఘంటిక - Sakshi

పచ్చని ఆకు సాక్షిగా ప్రమాద ఘంటిక

  • పచ్చదనానికి దూరమవడంతో పెరుగుతున్న మానసిక రుగ్మతలు
  • జంట నగరాల్లో గత యాభై ఏళ్లలో దారుణంగా తగ్గిపోయిన గ్రీన్‌బెల్ట్
  • ఓ వైపు పచ్చదనం కనుమరుగవుతుంటే కేబీఆర్ పార్కుపై సర్కారు దండయాత్ర
  • పనులు ఆపాలంటూ పర్యావరణవేత్తల ఆందోళన
  • అయినా ముందుకు సాగుతున్న అధికారులు
  •  
     
    జాగో హైదరాబాద్

    1950ల్లో 35 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండగా.. ఇప్పుడు కేవలం 8 శాతం
    1,394: ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా పార్కు చుట్టూ తొలగించనున్న వృక్షాలు
    400 ఎకరాలు: కేబీఆర్ పార్కు విస్తీర్ణం. అరుదైన వృక్ష, జంతు జాతులకు ఆలవాలం
    2.5 లక్షలు: కేబీఆర్ జంక్షన్ చుట్టూ ప్రస్తుతం రోజుకు సగటున ప్రయాణిస్తున్న వాహనాలు

     

     
    సాక్షి, హైదరాబాద్: ప్రకృతిని మనిషిని వేర్వేరుగా చూడలేం.. మనిషి సహజ ఆవరణం అడవే.. ఎన్నో ఏళ్లుగా మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలివి! అనేక పరిశోధనల్లోనూ ఇదే తేలింది. మనిషి మానసిక ఆరోగ్యానికి, ప్రకృతిలోని పచ్చదనానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రకృతికి దూరమయ్యే కొద్దీ మానసిక సమస్యలు, ఒత్తిళ్లు, రుగ్మతలు పెరుగుతాయని తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పీటర్ ఖాన్ పరిశోధనలోనూ వెల్లడైంది. మరి మన రాజధాని నగరంలో పచ్చదనం పాలెంత? రోజురోజుకూ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతున్న నగరంలో హరితప్రాంతం (గ్రీన్‌బెల్ట్) వేగంగా కరిగిపోతోంది. 1950వ దశకంలో హైదరాబాద్ విస్తీర్ణంలో ఇది 35 శాతం ఉండేది. ఇప్పుడెంత ఉందో తెలుసా? కేవలం 8 శాతం!! అంటే నగరంలో ఏకంగా 27 శాతం పచ్చదనం కనుమరుగైందన్నమాట! ప్రకృతికి ఇంతగా దూరం కావడంతో జనంలో క్రమంగా మానసిక దౌర్బల్యం, రుగ్మతలూ పెరుగుతూ వస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

    తక్షణమే మేలుకోకుంటే సామాజికంగా పెనుసంక్షోభం తప్పదని పర్యావరణ వేత్తలు, మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే... నగరానికే తలమానికంగా ఉంటూ, 400 ఎకరాల్లో విస్తరించిన అద్భుతమైన కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కుపై సర్కారు దండయాత్రకు దిగుతోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ఎస్‌ఆర్‌డీపీ) పేరుతో పార్కులోని అరుదైన వృక్ష, జంతు జాతులకు ముప్పు తెస్తోంది. ఈ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో రెండు వరుసల ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు సిద్ధమవుతోంది. పార్కు చుట్టూ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 1394 చెట్లను తొలగించాలని భావిస్తోంది. దీన్ని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మొండిగా ముందుకే వెళ్తోంది.
     
    అసలేంటి ఈ ఎస్‌ఆర్‌డీపీ?
     నగరంలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు/గ్రేడ్ సెపరేటర్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఈ ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు చేపట్టింది. ఐదు ప్యాకేజీల్లో 18 ప్రాంతాల్లో పనులకు టెండర్లు పిలిచారు. వీటిల్లో కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో రెండు వరుసల ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. వీటిల్లో రెండు జంక్షన్ల వద్ద భూసేకరణ ఇబ్బందులతో వెనక్కు తగ్గారు. నాలుగు జంక్షన్లలో పనులు చేపట్టేందుకు.. కేబీఆర్ చుట్టూ ఉన్న చెట్లను తొలగించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు రూ.322 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ల వద్ద పనుల్ని ఉపసంహరించుకున్నారు. కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్, మహారాజ అగ్రసేన్ విగ్రహం, ఫిల్మ్‌నగర్, రోడ్డు నంబర్ 45 జంక్షన్ల వద్ద పనులకు సిద్ధమయ్యారు. కేబీఆర్ పార్కు వద్ద గత జనవరిలోనే పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ పనుల్లో భాగంగా పార్కుచుట్టూ ఉన్న 1,394 చెట్లను తొలగించాల్సి ఉంది.

    అరుదైన వృక్ష, జంతు జాతులకు ముప్పు..
     రాజధాని నగరంలో సుమారు 1,800 రకాల వృక్షజాతులు ఉండగా.. కేబీఆర్ పార్కులోనే 500 రకాల అరుదైన వృక్షజాతులు ఉన్నాయి. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టుతో పార్కుకు వాటిల్లే ముప్పు ఇదీ..

    •      పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే డ్రాసిరా ఇండికా, డ్రాసిరా బర్మానీతోపాటు ఔషధ విలువలు అధికంగా ఉన్న నన్నారి (మారేడు గడ్డలు), పొడపత్రి, అస్తమా రోగులకు ఉపశమనం ఇచ్చే కొండగోగు, తిరుమ, రేగిస, సోమి, పాలకొడిశ, అరుదైన పక్షుల ఆకలి తేర్చే కల్మికాయలు, జీడిపండు, సీతాఫలం, ఊడుగు వంటి వృక్షాల మనుగడ ప్రశ్నార్థకం కానుంది.
    •   పార్కు చుట్టూ ఉన్న చెట్లలో సైకస్, మహాఘని, చాంపియన్ పామ్, బాటిల్‌బ్రష్, బహున్ల, నెమలి నార, రావి, తెల్లమద్ది, బిగ్నీనియా, ఉల్లింత, రేల తదితర  చెట్లు కనుమరుగుకానున్నాయి.

     
     
    పర్యావరణ అభ్యంతరాలు బేఖాతర్
     ఎస్‌ఆర్‌డీపీపై పర్యావరణవేత్తలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పనులతో కేబీఆర్ పార్క్‌లో జీవ వైవిధ్యానికి పెను ముప్పు వాటిల్లుతోందని నెల రోజులుగా ఉద్యమిస్తున్నా తగ్గడం లేదు. ఈ జాతీయ పార్కు చుట్టూ బఫర్‌జోన్‌గా పరిగణించే ప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల మేర విస్తరించిన వాక్‌వే మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతోపాటు పార్కులో అరుదైన వృక్ష, జంతు, జీవజాతులు, ఔషద మొక్కల జాతులు అంతరించి పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లండన్, న్యూయార్క్ వంటి మహానగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తుండగా ఇక్కడ బహుళ వరుసల ఫ్లైఓవర్ల పేరుతో జాతీయ పార్కు ఉనికిని దెబ్బతీయడం సమంజసం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా జాతీయ పార్కులకు పది కిలోమీటర్ల మేర బఫర్ జోన్‌గా పరిగణిస్తారు. ఆ పరిధిలో భారీ నిర్మాణాలు చేపట్టరాదని కేంద్ర అటవీ శాఖ నిబంధనలు స్పష్టంచేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అంటున్నారు.

    అయినా ముందుకే..
     ఎస్‌ఆర్‌డీపీ పనులపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా జీహెచ్‌ఎంసీ ముందుకే వెళ్తోంది. ఈ వ్యవహారంపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. మానవ హక్కుల కమిషన్‌లో పిల్ దాఖలైంది. చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ).. చెట్ల తొలగింపుపై ఇప్పటికే  స్టే ఇచ్చింది. విచారణను జూలై 1కి వాయిదా వేసింది. ఇవన్నీ ఇలా ఉండగానే కౌంటర్‌లతోపాటు హైకోర్టుకు వెళ్లాలని అధికారులు యోచిస్తున్నారు.

    ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు నివేదికను ప్రజల ముందుంచాలి
     ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు రిపోర్టును ప్రజల ముందుంచాలి. ఈ ప్రాజెక్టు వల్ల తలెత్తే పర్యావరణ సమస్యలపై అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం పర్యావరణ ప్రభావ నివేదికను సిద్ధం చేసి స్థానిక పోలీసు స్టేషన్, తపాలా కార్యాలయం, రెవెన్యూ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో పెట్టాలి. ఆ తర్వాత ఒక నెల గడువు ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ఆ తర్వాతే పనులు చేపట్టాలి. కానీ ప్రభుత్వం ఇవేవీ చేయడం లేదు. చట్టం, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ఈ ప్రాజెక్టు పనులను తక్షణం ఆపాలి. లే కుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం.   
     - ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణవేత్త
     

    జీహెచ్‌ఎంసీ ఏం చెబుతోంది?
    కేబీఆర్ పార్కు చుట్టూ ఎస్‌ఆర్‌డీపీ పనులు చేపట్టకుంటే నగరంలో 2035 నాటికి కాలుష్యం మరింత పెరిగి ప్రజా జీవనం దుర్భరమవుతుందని జీహెచ్‌ఎంసీ వాదిస్తోంది. కేబీఆర్ జంక్షన్ చుట్టూ ప్రస్తుతం రోజుకు సగటున 2.5 లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యల వల్ల, సిగ్నల్స్ వద్ద ఆగాల్సి రావడం వల్ల రోజుకు సగటున32,096 వేల లీటర్ల ఇంధనం వృథా అవుతోందని, కాలుష్యం పెరిగిపోతోందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని మెరుగుపరచేందుకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం అవసరమని, అందుకు ఈ మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు/గ్రేడ్ సెపరేటర్లు  ఉపయోగపడతాయని అంటున్నారు.
     
    కాంట్రాక్టర్ల కోసమే..
     నగరంలో ప్రజారవాణా వ్యవస్థను పటిష్టం చేయకుండా కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే ఎస్‌ఆర్‌డీపీ పనులు చేపడుతున్నారు. పర్యావరణ నిపుణులు, సామాజిక కార్యకర్తలు, స్థానికుల అభిప్రాయాలను తుంగలోకి తొక్కి ఈ పనులు చేపడితే నగరానికి పెనుముప్పు తప్పదు. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నా కాలుష్య తీవ్రత తగ్గలేదని గుర్తెరగాలి.
     - ప్రొఫెసర్ రామచంద్రయ్య, సెస్
     
    సమతుల్యతను దెబ్బతీయడమే
     చెట్లను తొలగించి బహుళ వరుసల ఫ్లైఓవర్లు నిర్మించడమంటే కేబీఆర్ పార్క్‌ను నాశనం చేయడమే. ఈ ప్రాజెక్టుతో పార్కులో జీవావరణ వ్యవస్థలోని సమతుల్యత దెబ్బతింటుంది.
     - ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, పర్యావరణ వేత్త
     
    జీవ వైవిధ్యానికి ప్రమాదం
     తెలంగాణ జీవవైవిధ్యానికి ప్రతీక ఈ పార్క్. ఇందులో వందలాది వృక్ష జాతులు, అరుదైన పక్షిజాతులు,  క్షీరద జాతులు, సరీసృపాలు, ఉభయచరాలతోపాటు వందలాది కీటక జాతులున్నాయి. ఈ పార్కును వారసత్వ కట్టడంగా పరిగణించి కాపాడాలి.
     - జయభారతి, పర్యావరణ వేత్త,  హైదరాబాద్ రైజింగ్ ప్రతినిధి
     
     
    నగరాల్లో మానసిక రుగ్మత లు పెరిగిపోతున్నాయి
    పచ్చటి చెట్లు, రకరకాల జంతువులు, పక్షుల మధ్య ఏళ్ల కిందట మనిషి సాగించిన మనుగడ తాలూకూ అనుభూతులు మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఈ అనుభూతులకు ఎప్పుడైతే తగిన ప్రేరణ లేకుండా పోతుందో అప్పుడు మానసిక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. డిప్రెషన్, స్ట్రెస్ వంటి మానసిక రుగ్మతలతో బాధపడే వారిని వాకింగ్ చేయమని సలహా ఇస్తుంటాం. సూర్యోదయం కంటే ముందు వాకింగ్ చేయడం ఒకరకంగా ప్రకృతితో మమేకం అయ్యేందుకే. వడివడిగా నాలుగు అంగలు వేశామన్నట్లుగా కాకుండా పరిసరాలను గమనిస్తూ.. మంచు బిందువుల నుంచి పక్షుల కిలకిలల వరకూ ప్రకృతి అందించే ఆనందాలన్నింటినీ అనుభూతి చెందగలిగితే మానసిక సమస్యలు వేగంగా దూరమైపోతాయి. హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఏటా మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జనరల్ యాంగ్జైటీ డిజార్డర్, డిప్రెషన్ కేసులు ఎక్కువవుతున్నాయి
     - నిరంజన్‌రెడ్డి, ప్రఖ్యాత సైకాలజిస్ట్, హైదరాబాద్

     

    ప్రకృతికి దూరమవడంతో మానసిక సమస్యలు
    ప్రకృతికి, నగర ప్రజల మానసిక స్థితికి దగ్గరి సంబంధం ఉందని ఓ పరిశోధనలో తేలింది. ప్రకృతికి, పచ్చదనానికి ఎంతగా దూరమైతే అంతగా ప్రజల్లో అంతగా మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని స్పష్టమైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ప్రొఫెసర్ పీటర్ ఖాన్ చేసిన పరిశోధనలో ఈ మేరకు వెల్లడైంది. ‘‘నగరాలు, పట్టణ వాతావరణంలో మానసిక ఒత్తిళ్లు, భావోద్వేగ సమస్యలు సర్వసాధారణమయ్యాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ప్రజలు ప్రకృతికి దూరమవడం. నగ ర జీవులు తమ నిత్య జీవితంలో ప్రకృతికి దూరంగా ఉండిపోతున్నారు. ఇది వారి శారీరక ఆరోగ్యంపైనే కాదు.. మానసిక ఆరోగ్యంపైనా దుష్ర్పభావం చూపుతోంది’’ అని పీటర్ ఖాన్ చెప్పారు.




     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement