24/7 నిఘా నేత్రం
దేశంలోనే తొలిసారిగా వాహన ఉల్లంఘనలపై నిఘాకు ప్రత్యేక వ్యవస్థ
- ఐటీఎంఎస్ ఏర్పాటు.. రాత్రీపగలూ నిరంతరాయంగా పరిశీలన
- పరిమితికి మించి వేగంగా వెళితే చిక్కినట్లే..
- రెడ్ సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్ రూట్‌లో వచ్చినా అంతే..
- ప్రయోగాత్మకంగా కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మధ్య ఏర్పాటు
హైదరాబాద్: అర్ధరాత్రి సమయం.. ట్రాఫిక్ పోలీసులెవరూ ఉండరనే ఉద్దేశంతో అత్యంత వేగంగా వాహనం నడిపాడు ఓ యువకుడు.. కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా దూసుకుపోయాడు.. కానీ ఒకటి రెండు రోజుల్లోనే అతడి ఇంటికి ఈ–చలానా వచ్చింది. పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్లినందుకు, రెడ్ సిగ్నల్ జంప్ చేసినందుకు జరిమానా విధించారు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో అమల్లోకి వచ్చిన అత్యాధునిక సెన్సర్ కెమెరాల వ్యవస్థ పనితీరు ఇది.
పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడం, రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా ముందుకెళ్లిపోవడం, రాంగ్ రూట్‌లో వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి ఉల్లంఘనలన్నింటినీ రాత్రి సమయాల్లోనూ ఈ సెన్సర్ కెమెరాలు రికార్డు చేస్తాయి. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్)గా పిలిచే ఈ వ్యవస్థను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని కేబీఆర్ పార్కు–జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు మధ్య ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు.
ఎన్ని వాహనాలు వెళ్లినా..
హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ వి.రవీందర్ గురువారం ఈ వ్యవస్థ పనితీరును పరిశీలించారు. బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కేబీఆర్ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు 10,800 వాహనాలు వెళ్లినట్లుగా అందులో వెల్లడైంది. ఇక్కడ నిర్దేశించిన గరిష్ట వేగ పరిమితి గంటకు 50 కిలోమీటర్లుకాగా.. 64 శాతం వాహనాలు పరిమితికి లోబడి వెళ్లాయని, మిగతావి ఎక్కువ వేగంతో వెళ్లాయని తేలింది. ఇక బుధవారం రాత్రి 8 నుంచి గురువారం ఉదయం 8 వరకు 11,706 వాహనాలు వెళ్లగా... 2,200 వాహనాలు పరిమితికి మించిన వేగంతో వెళ్లినట్లు గుర్తించారు.
నాలుగు వాహనాలు 100 కి.మీపైన వేగంతో.. తొమ్మిది వాహనాలు 120 కి.మీపైగా వేగంతో దూసుకుపోయాయి. ఒక ఆడి కారు (ఏపీ 09 సీఏ 7119) గంటకు 127 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్లు ఐటీఎంఎస్‌లో నమోదైంది. మొత్తంగా సగానికిపైగా వాహనాలు నిర్దేశిత పరిమితికి మించి వేగంతో వెళ్లినట్లు తేలింది. స్మార్ట్ సిటీ, సేఫ్ సిటీ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌వ్యాప్తంగా అన్ని కూడళ్లు, కారిడార్లలో పదివేల సెన్సర్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా రవీందర్ వెల్లడించారు.
ప్రయారిటీ ట్రాఫిక్ కూడా..
ట్రాఫిక్ ఎక్కువై ముందున్న వాహనాలు కదలకపోవడం, రెడ్ సిగ్నల్ పడి వాహనాలు ఆగిపోవడం వంటి వాటి కారణంగా చాలాసార్లు అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతుంటాయి. అయితే ఐటీఎంఎస్‌లో ఏర్పాటు చేసే కెమెరాలు ట్రాఫిక్ సిగ్నల్స్‌కు అనుసంధానమై.. అంబులెన్స్‌లు వేగంగా ముందుకు కదిలేలా గ్రీన్‌సిగ్నల్స్ ఇస్తాయని అధికారులు చెబుతున్నారు.