సాక్షి, సిటీబ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ జాతీయ పార్క్‌తోపాటు మృగవని, హరిణ వనస్థలి జాతీయ ఉద్యానవనాల చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ (పర్యావరణ పరంగా సున్నితప్రాంతం)పరిధి కుదింపుపై పర్యావరణ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కేబీఆర్ పార్క్ వద్ద ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా బహుళ వరుసల దారుల నిర్మాణం కోసం జోన్ పరిధిని కొన్ని చోట్ల మూడు మీటర్లు..మరికొన్ని చోట్ల 28 మీటర్లకు కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతోందని..ఈ మేరకు అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు సైతం సర్కారు నివేదించినట్లు వారు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈమేరకు నవంబరునెలలో ఆశాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌కు స్పందించి తమ అభ్యంతరాలను కూడా నివేదించామని చెబుతున్నారు.
పర్యావరణవాదుల అభ్యంతరాలివే..
దేశ సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన మార్గదర్శకాల మేరకు జాతీయ పార్కుల చుట్టూ పర్యావరణ పరంగా సున్నితప్రాంతం (ఎకో సెన్సిటివ్ జోన్) సుమారు 10 కిలోమీటర్ల మేర ఉండాలి. మన నగరంలో ఈ పరిస్థితి లేనందున ప్రస్తుతం ఉన్న జోన్ పరిధిని సైతం తగ్గించే ప్రయత్నం చేయడంతో సుమారు 400 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న కేబీఆర్ పార్క్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, ఈ జాతీయ ఉద్యానవనంలోని సుమారు 200 వృక్ష, జంతుజాలం, పక్షుల మనుగడ కష్టసాధ్యమౌతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు, ట్రాఫిక్ రణగొణ ధ్వనులు, ప్రధాన రహదారులున్నప్పటికీ నగరం నడిబొడ్డున ఉన్న ఈపార్క్ నగరవాసులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తోందని..ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పార్క్‌లో వాకింగ్, ఇతర శారీరక వ్యాయామాలు చేసేవారికి ఆనందం, ఆరోగ్యం కల్పిస్తోందంటున్నారు.
ఈ తరుణంలో పార్క్ చుట్టూ సున్నిత ప్రాంత పరిధిని 28 మీటర్లకు తగ్గించడం శోచనీయమని పర్యావరణ వేత్తలు లుబ్నాసర్వత్, దొంతి నరసింహారెడ్డిలు ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయమై తాము కేంద్ర, అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా తెలియజేశామన్నారు. కేంద్ర అటవీశాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల వివరాలను సైతం గోప్యంగా ఉంచడం పట్ల వారు ఆక్షేపించారు. మరోవైపు చిలుకూరులోని మృగవని, వనస్థలిపురంలోని హరిణ వనస్థలి జాతీయ పార్కుల చుట్టూ ఎకోసెన్సిటివ్ జోన్ పరిధిని ఒక కిలోమీటరుకు కుదించేందుకు చేస్తున్న ప్రయత్నాలను సైతం తాము అడ్డుకుంటామని..ఈ విషయమై న్యాయపోరాటానికి సిద్ధమని స్పష్టంచేశారు.
ప్రభుత్వ వర్గాల వాదన ఇదీ...
కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు చోట్ల ఉన్న ట్రాఫిక్ చిక్కులు తీర్చేందుకు సుమారు రూ.586 కోట్లతో బహుళ వరుసల దారులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పనులు చేపట్టేందుకు వీలుగా పరిధిని కుదించాల్సిన అవసరం ఉందని బల్దియా అధికారులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాల ప్రకారం జోన్ పరిధిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ విషయమై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి తుది నోటిఫికేషన్ వెలువడలేదని తెలిపారు. ప్రస్తుతం ఇరు వర్గాల వాదనలను ఆ శాఖ పరిశీలిస్తుందని..త్వరలో ఈవిషయమై స్పష్టత రానుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment