సాక్షి హైదరాబాద్: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, కేబుల్ బ్రిడ్జి, అండర్‌పాస్‌లు, స్టీల్‌బ్రిడ్జిలు వంటి పనులు విజయవంతంగా పూర్తిచేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పుడిక సొరంగ మార్గాలపై దృష్టి సారించారు. హైదరాబాద్‌లో గతంలో లేనటువంటి వివిధ మార్గాలను అందుబాటులోకి తెస్తున్న వారు ప్రస్తుతం సొరంగ మార్గాల నిర్మాణాలకు ఆసక్తి కనబరుస్తున్నారు.
అందుకనుగుణంగా ఇప్పటికే జూబ్లీహిల్స్ నుంచి పంజగుట్ట వరకు భూగర్భంలో సొరంగ మార్గానికి (వయా కేబీఆర్ పార్క్) టెక్నికల్ కన్సల్టెంట్ల కోసం టెండర్లు పిలిచారు. ఖాజాగూడ గుట్టను తొలిచి అక్కడ మరో సొరంగ మార్గానికి సమాయత్తమవుతున్నారు.
మంత్రి కేటీఆర్ ఆసక్తితో..
కేబీఆర్ పార్కు కింద నుంచి సొరంగమార్గానికి మంత్రి కేటీఆర్ ఆసక్తి కనబరచడంతో, ఖాజాగూడ సొరంగానికీ నిధులు కోరుతూ ప్రభుత్వం ముందుంచారు. ఎస్సార్‌డీపీ పనులకు సంబంధించి తొలి ప్రతిపాదనల మేరకు అయిదు ఫేజ్‌ల్లో ప్రణాళికలు రూపొందించారు. క్షేత్రస్థాయి పరిస్థితులతోపాటు ఇతరత్రా కారణాలతో వివిధ ఫేజ్‌ల్లో ఉన్న పనుల్లో ఆటంకాలు లేని పనుల్ని చేపట్టారు. కొన్ని పూర్తయ్యాయి. కొన్ని పురోగతిలో ఉన్నాయి.
ప్రస్తుతం వాటన్నింటినీ ఫేజ్– 1 గానే పరిగణిస్తూ, కొత్తగా ఫేజ్–2లో చేపట్టేందుకు 14 పనుల్ని ప్రతిపాదించారు. వాటిలో ఖాజాగూడ సొరంగమార్గం ప్రముఖంగా ఉంది. ఫేజ్– 2లోని పనుల మొత్తం అంచనా వ్యయం రూ.3515 కోట్లు కాగా, అందులో రూ. 1080 కోట్లు ఈ సొరంగ మారానికే ఖర్చు కానుంది. మిగతా 13 పనుల్లో పాతబస్తీకీ తగిన ప్రాధాన్యమిచ్చారు.
శాస్త్రిపురం జంక్షన్‌నుంచి ఇంజన్‌బౌలి వరకు రూ.250 కోట్లతో రోడ్డు విస్తరణ, బెంగళూర్ హైవే నుంచి శాస్త్రిపురం వరకు రూ.150 కోట్లతో రోడ్డు విస్తరణ పనుల్ని కొత్తగా చేర్చారు. వీటితోపాటు కొన్ని పాత ప్రతిపాదనలు సైతం ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఆమోదం కోసం ఈ నెల 12న జరగనున్న సభలో వీటిని ఉంచే అవకాశం ఉంది.
(చదవండి: ప్రత్యామ్నాయ ఫ్రంట్ దిశగా..!)
Comments
Please login to add a commentAdd a comment