స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్(ఎస్సార్ డీపీ) వెబ్‌పోర్టల్ రూపకల్పనకు కసరత్తు చేస్తోంది.
కేబీఆర్ పార్కు వద్ద పనులపై అవగాహన
సాక్షి, హైదరాబాద్: స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్(ఎస్సార్ డీపీ) వెబ్‌పోర్టల్ రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కేబీఆర్ జాతీయ పార్కు వద్ద ఈ ప్రాజెక్టు కోసం చెట్లను తొలగించడంపై అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ దానిని ఏర్పాటు చేస్తోంది. పలువురు పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు పార్కును పరిరక్షించాలని, పార్కులోని వృక్ష, జీవజాతులకు హాని కలిగించవద్దని ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుతో వాటికి ఎలాంటి ముప్పు ఉండదని, పార్కులోని చెట్లను తొలగించడం లేదని జీహెచ్‌ఎంసీ చెబుతోంది.
అయినా, తమ వాదనను ఎవరూ వినడం లేదని, దీంతో ప్రజల్లో గందరగోళం నెల కొందని జీహెచ్‌ఎంసీ గుర్తించింది. అన్ని వివరాలూ సమగ్రంగా వెబ్‌సైట్‌లో పొందుపరచడమే కాక, ప్రజాభిప్రాయాలను కూడా దాని ద్వారా స్వీకరించాలని, ప్రజల సందేహాలకు కూడా వెబ్‌సైట్‌లో సమాధానాలివ్వాలని భావి స్తోంది. కేబీఆర్ పార్కు వద్ద చేసే పనులు, అందుకుగాను తొలగించాల్సిన చెట్లు, ప్రత్యామ్నాయంగా చేపట్టే చర్యలు, ప్రస్తుతం, భవిష్యత్‌లో కాలుష్యం పరిస్థితి, ఎస్సార్డీపీ ఫ్లైఓవర్ల వల్ల కలిగే ప్రయోజనాలు, మంచి- చెడులు, రెండు వైపులా అన్ని అంశాలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని అధికారులు భావిస్తున్నారు. అన్ని వివరాలతో ‘ఎస్సార్‌డీపీ’ వెబ్‌సైట్ రూపక ల్పనకు దాదాపు 3, 4 వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
హైకోర్టుకు వెళ్లవద్దని నిర్ణయం: ఎస్సార్‌డీపీ పనులపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జులై 1 వరకు స్టే ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టుకు వెళ్లాలని అధికారులు భావించారు. అయితే జులై 1 వరకు వేచి చూడాలని, తొందరపడి హైకోర్టుకు వెళ్లనవసరం లేదని ఉన్నతస్థాయిభేటీలో భావించినట్లు తెలిసింది. తమ నుంచి ఎలాంటి పొరపాట్లు లేనందున తదుపరి విచారణ వరకు వేచి చూడాలని అభిప్రాయపడినట్లు సమాచారం.