పక్షి, వృక్షసంపదతో బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు అలరారుతోంది
హైదరాబాద్ : పక్షి, వృక్షసంపదతో బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు అలరారుతోంది. ప్రతీయేటా ఈ పార్కులో పక్షులతో పాటు జంతు, వృక్షసంపద అనూహ్యంగా పెరుగుతూ పార్కుకే వన్నె తెస్తుంది. అయితే అధికారులు సోమవారం పార్కులోని పక్షులు, వృక్షాల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా కేబీఆర్ పార్కులో మొత్తం 460 నెమళ్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు 70 జాతుల పాములు కూడా ఉన్నట్లు తేల్చారు. ఇందులో పంగోలిన్ అనే అరుదైన జాతి సర్పం కూడా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. కోబ్రా, పైతాన్‌లాంటి విషసర్పాలు కూడా పార్కులో ఉన్నాయి. వీటితో పాటు 60 ఉడుములు కూడా అటూ ఇటూ తిరుగుతూ సందడి చేస్తున్నాయి. 130 రకాల పక్షిజాతులతో పాటు 20 రకాల జాతుల సీతాకోక చిలుకలు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 50 అడవి పందులు , 100 కుందేళ్లు ఉన్నాయి. తాము జరిపిన లెక్కింపులో పక్షుల సంఖ్య మునుపటి కంటే పెరిగిందని కేబీఆర్ పార్కు డీఎఫ్‌వో మోహన్ వెల్లడించారు. కాగా ఇటీవల ఓ కొండచిలువ పార్కు నుంచి బయటకు వచ్చి రోడ్డుపైన వెళ్తుండగా స్థానికులు గమనించి తమకు సమాచారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ పామును పట్టుకొని మళ్లీ పార్కులో వదిలేశామని కూడా వారు వెల్లడించారు.