నోటిఫికేషన్ ఇచ్చే వరకు పనులు ఆపండి
కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణంపై ఎన్‌జీటీ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రణాళిక(ఎస్సార్‌డీపీ)లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించ తలపెట్టిన ఆకాశ వంతెనలకు బ్రేక్ పడింది. ఫ్లై ఓవర్ల నిర్మాణం కేబీఆర్ పార్క్‌లోని జీవరాశి మనుగడకు ప్రమాదకరమంటూ పర్యావరణ, సామాజికవేత్తలు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ)ను ఆశ్రయించడంతో పనులు చేపట్టకుండా గతంలో ఎన్‌జీటీ స్టే ఇచ్చింది. దీనికి సంబంధించి బుధవారం తుది తీర్పునిచ్చిన ఎన్‌జీటీ.. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్(ఈఎస్‌జడ్)పై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తుది నోటిఫికేషన్ వెలువడేంత వరకు పనులు చేపట్టొద్దని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. దీంతో ఫ్లైఓవర్ల పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ మరికొంత కాలం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈఎస్‌జడ్ తగ్గించాలని కేంద్రానికి ప్రతిపాదనలు..
కేబీఆర్ పార్క్ ఈఎస్‌జడ్ సగటున 25–35 మీటర్లుగా ఉంది. అందులో పార్క్ వాక్‌వే ఉంది. ఫ్లైఓవర్ల పనులు పూర్తయితే వాక్‌వే 3 నుంచి 7 మీటర్లకు తగ్గనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెరిగిన నగరీకరణ, జనసమ్మర్థంతో పార్క్ నగరం మధ్యకు చేరడంతో ఎకో సెన్సిటివ్ జోన్‌ను సగటున 3 నుంచి 7 మీటర్లకు తగ్గించాలని ఒకసారి, జీరో మీటర్లకు తగ్గించాలని మరోసారి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించింది. చెన్నైలోని గిండి జాతీయ పార్క్ ఈఎస్‌జడ్ జీరో మీటర్లకు తగ్గించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తుది నోటిఫికేషన్ వెలువరించాల్సి ఉన్నందున, సదరు నోటిఫికేషన్ వెలువడేంత వరకు పనులు నిలుపుదల చేయాలని ఎన్‌జీటీ తన తీర్పులో పేర్కొంది. దీంతో ఆ నోటిఫికేషన్ వచ్చే వరకూ ఈ పనులు చేపట్టే అవకాశం లేదు.
తుది నోటిఫికేషన్‌ను బట్టే ముందడుగు..
తుది నోటిఫికేషన్‌లో ఎకో సెన్సిటివ్ జోన్‌ను 3–7 మీటర్లకు లేదా జీరో మీటర్లకు తగ్గిస్తే.. జీహెచ్‌ఎంసీ ఫ్లైఓవర్ల పనులు చేపట్టవచ్చు. తుది నోటిఫికేషన్‌లో 25–35 మీటర్ల వరకు యథాత థంగా ఉంచితే ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం జీహెచ్‌ఎంసీ.. నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ స్టాండింగ్ కమిటీ నుంచి క్లియరెన్స్ పొందాలని పర్యావరణ నిపుణుడొకరు తెలి పారు. జాతీయ పార్కులకు ఈఎస్‌జడ్‌లు ఉన్నప్పటికీ రహదా రులు, ఇతర ప్రజావసరాల దృష్ట్యా కమిటీ తగిన మినహాయింపులిస్తుందని ఆయన పేర్కొన్నారు.