హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌కి రెండు సందుల అవతల చూస్తే ఓ షాప్ ముందు జనం గుమిగూడి కనిపిస్తారు. అదేంటా అని మరికాస్త ముందుకు వెళ్లి చూస్తే.. బ్రాండ్ న్యూ రామ్స్ దోసె హౌస్ అని తెలుస్తుంది. అంత జనం ఉన్నారంటే అక్కడి దోసెకు ఎంత గిరాకీ ఉందో ఇట్టే తెలిసి పోతుంది. ఆ దోసె బండి ముందర బీఎండబ్ల్యూ, ఆడి, బెంజ్ కార్లు క్యూ కడతాయి. ఎంతో ఓపికగా ఇచ్చిన ఆర్డరు కోసం నిరీక్షిస్తారు జనం. అక్కడి వస్తువుల ఖరీదు వంద రూపాయల కంటె తక్కువే. కాని లక్షల ఖరీదు చేసే కార్లలో వారు నిరీక్షించేలా చేస్తుంది రామ్స్ దోసె. వారి నిరీక్షణ ఫలితం చాలా ఖరీదైనదే అనుకుంటారు వారు.
ఈ రెస్టారెంట్ విజయం వెనుక రహస్యం రామ్ షిండే చిరునవ్వులే. ఇది రామ్ షిండే పెట్టుకున్న రెండో బ్రాంచ్. మొదటిది నాంపల్లిలో ఉంది. దానికి రామ్ కీ బండి అని పేరు. ఇది కూడా రోడ్ పక్కనే ఉంటుంది. పదేళ్ల క్రితం ఈ దోసెల వ్యాపారం మొదలుపెట్టారు షిండే. రామ్ కీ బండి ప్రారంభించిన కొత్తల్లో దోసె పిండి రుబ్బుకుని, పెద్ద పెనం మీద దోసెలు వేసి, గిన్నెలన్నీ తనే కడుక్కునేవాడు. తను ఈ రోజు స్థాపించిన రెస్టారెంట్ చూసుకుంటే, ఆ రోజు అంత కష్టపడ్డానా అనుకుంటారు రామ్. అది నిజం కాదేమో అని కూడా అనుకుంటారు. అర్ధరాత్రి నడుపుతున్న ఆహార పదార్థాల బండ్లలో రామ్ కీ బండి కూడా ఒకటి. దీనికి ఐదుకి 4.2 రేటింగ్ ఇచ్చారు ఫుడ్ లవర్స్. నోరూరించే బటర్ దోసె కొబ్బరి చట్నీతో కలిపి తినడానికి అలవాటు పడ్డ భోజన ప్రియులు తెల్లవారు జామున 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ దోసె తినడానికి వస్తుంటారు. 1989 నుంచి అంటే సుమారు మూడు దశాబ్దాలుగా రామ్ కీ బండి దిగ్విజయంగా దోసెలు వేస్తూనే ఉంది. రామ్ కి ఎనిమిదేళ్ల వయసులో తండ్రి ఈ బండి ప్రారంభించారు. ‘నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పడు నాన్న వెంటే తిరుగుతుండేవాడిని. దోసెలు ఎలా తయారుచేస్తున్నారు, ఇడ్లీలు ఏ విధంగా సర్వ్ చేస్తున్నారు వంటివి చూసేవాడిని. పదేళ్ల క్రితం బండి నా చేతిలోకి వచ్చింది. నేను నాంపల్లిలో ప్రారంభించాను’ అని తెలియజేశారు రామ్‌షిండే. ఈరోజు ఈ దోసె బండి గురించి గూగుల్ సెర్చ్‌లో కొడితే వెంటనే కనపడుతుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారికి రామ్ జీవితమే ఒక పెద్ద ప్రేరణ. కొత్తల్లో తాను సరిగ్గా నడపలేనేమోనని చాలా భయపడ్డారట రామ్. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలనుకున్నాడు. తాను చదువుకున్న ఎంబీఏని లెక్క చేయకుండా ఈ వ్యాపారంలోకి దిగాడు.
రెస్టారెంట్ ప్రారంభించిన కొత్తల్లో రెండేళ్ల పాటు కస్టమర్లు చాలా తక్కువగా వచ్చేవారు. పెట్టుబడి డబ్బులు క్రమేపీ తరిగిపోసాగాయి. కొన్నిరోజులైతే రోజుకు కేవలం వంద రూపాయలే వచ్చేవి. కుటుంబ సభ్యులు సాయం చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. చాలాసార్లు వ్యాపారం విడిచిపోవాలనిపించింది రామ్‌కి. కాని అకుంఠిత దీక్షతో నష్టాల్లోనే నడుపుతూ వచ్చాడు. అప్పుడే వచ్చింది రామ్‌కి ఒక మంచి ఆలోచన. ‘నగరంలో చాలా చోట్ల టేస్టీ దోసెలు దొరుకుతుండగా నా దగ్గరకే ఎందుకు వస్తారు? కొత్తరకం దోసెను కనిపెట్టాలి’ అనుకున్నాడు. ఆ ఆలోచన నుంచి వచ్చినవే చీజ్ దోసె, బటర్ దోసె, పనీర్ దోసె. అంతే క్రమేపీ ఆహారప్రియులు ఈ దోసెలకు ఆకర్షితులవడం ప్రారంభించారు. పిజ్జా దోసె దొరికే మొట్టమొదటి చోటు ఇదే. ‘నేను ఇచ్చే క్వాలిటీ చూసి మరింత మంది నా దగ్గరకు వస్తున్నారు’ అంటారు రామ్ షిండే.
నాంపల్లి తర్వాత జూబ్లీహిల్స్‌లో ప్రారంభించిన దోసె హౌజ్‌కి మంచి స్పందన వచ్చింది. ఇక్కడకు సినీనటులు, వీఐపీలు, యువత అధికంగా వస్తుంటారు. ‘యువత వచ్చి నాతో సెల్ఫీలు తీసుకుంటారు, ఆ ప్రచారమే చాలు’ అంటూ సరదాగా అంటారు. ఈ రోజుకీ రామ్‌తెల్లవారుజామున రెండు గంటలకే నిద్ర లేస్తారు. మూడు గంటలకల్లా నాంపల్లి బండి దగ్గరకు వెళ్తారు. రెస్టారెంట్‌లో రాత్రి ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు ఉంటారు. నాకిది కష్టంగా అనిపించదు. క్యాంటీన్‌లో వారంతా సంతోషంగా తింటుంటే నాకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది’ అంటారు రామ్ షిండే.
తింటే షిండే దోసే తినాలి
Published Sat, Nov 24 2018 12:10 AM | Last Updated on Sat, Nov 24 2018 12:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment