
ఇక కేబీఆర్ డిజిటల్ పార్క్
హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు డిజిటల్ పార్క్‌గా రూపుదాల్చబోతోంది. ఇందుకోసం ఇప్పటికే పార్క్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయింది. రేపటి నుంచి వాకర్లను బయోమెట్రిక్ విధానం ద్వారా పార్క్‌లోకి అనుమతించనున్నట్లు డీఎఫ్‌వో కొండా మోహన్ శుక్రవారం వెల్లడించారు. ఈ ఏడాది వాకర్లకు పాస్‌లు కూడా బయోమెట్రిక్ విధానం ద్వారానే జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇకపై పార్క్ లోపలికి వెళ్లాలంటే కచ్చితంగా బయోమెట్రిక్ విధానం ద్వారానే వెళ్లాల్సి ఉంటుందని వివరించారు.
పార్క్‌కు రెండు వైపులా ఉన్న ప్రవేశ ద్వారాల వద్ద బయోమెట్రిక్ యంత్రాలను అమర్చినట్లు పేర్కొన్నారు. పార్క్లోకి వెళ్లాలని అనుకునే ప్రతి ఒక్కరు వారికిచ్చిన గుర్తింపు కార్డును తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు. కార్డు లేకపోతే, ఫింగర్ ప్రింట్ ద్వారా మిషన్‌లో వివరాలు నమోదు చేసుకొని ప్రవేశించాల్సి ఉంటుందన్నారు. ఇక టిక్కెట్లు కూడా డిజిటల్ రూపంలోనే ఇస్తామని మెహన్ చెప్పారు. కేబీఆర్ పార్క్ నగరంలోనే తొలి డిజిటల్ పార్క్‌గా రూపుదాల్చిందని ఆయన వివరించారు.