2029 నాటికి 76 బిలియన్ డాలర్లకు టెలికం మార్కెట్
వచ్చే అయిదేళ్లపై టీమ్‌లీజ్ అంచనాలు
ముంబై: బ్రాడ్‌బ్యాండ్, 5జీ నెట్‌వర్క్ సహా డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఫైబర్ టెక్నాలజీ విభాగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ఫైబర్ ఇన్‌స్టాలేషన్, మెయింటెనెన్స్, రిపేర్ సెగ్మెంట్లలో కొత్తగా లక్ష ఉద్యోగాలు రానున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ పి. సుబ్బురత్నం ఈ విషయాలు వెల్లడించారు.
2024లో దేశీయంగా టెలికం మార్కెట్ 48.61 బిలియన్ డాలర్లుగా ఉండగా ఏటా 9.40 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2029 నాటికి 76.16 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. 2023 నాటికి దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం పూర్తయిందని, డిజిటల్ మౌలిక సదుపాయాలు విస్తరించడానికి ఇది గణనీయంగా ఉపయోగపడిందని వివరించారు.
అసాధారణమైన స్పీడ్, తక్కువ లేటెన్సీ, మరింత మెరుగైన కనెక్టివిటీని అందిస్తూ 2030 నాటికి 5జీ టెక్నాలజీ మరింతగా విస్తరించనుందని సుబ్బురత్నం చెప్పారు. ‘ప్రభుత్వం, టెలికం సంస్థలు ఫైబర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణపై దృష్టి పెడుతుండటంతో ఫైబర్ టెక్నీషియన్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొత్తగా సుమారు లక్ష ఉద్యోగావకాశాలు రానున్నాయి‘ అని సుబ్బురత్నం చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా ఫైబర్ టెక్నీషియన్ల సంఖ్య సుమారు 5 లక్షల పైగా ఉన్నట్లు అంచనా.
ఇంజనీర్లు, టెక్నీషియన్లకు డిమాండ్...
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టే టెలికం, ఐటీ, నిర్మాణ, తయారీ తదితర రంగాల్లో ఫైబర్ సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుంది. ఫైబర్ ఇంజనీర్లు, ఫైబర్ టెర్మినేషన్ ఎక్విప్‌మెంట్ టెక్నీషియన్లు, ఇన్‌స్టాలేషన్.. రిపేరు, ఫాల్ట్ రిజల్యూషన్ టీమ్, ఫైబర్ సెల్‌సైట్ ఇంజనీర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వర్గాలకు డిమాండ్ నెలకొనవచ్చని సుబ్బురత్నం చెప్పారు. అయితే, అట్రిషన్ రేటు అధిక స్థాయిలో వార్షికంగా 35–40%గా ఉంటోందన్నారు. సుదీర్ఘ పనిగంటలు, వేతనాల పెంపు చాలా తక్కువగా ఉండటం, ఉద్యోగులను ఇతర సంస్థలను ఎగరేసుకు పోతుండటం తదితర అంశాలు కారణమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment