చెట్ల నరికివేతపై వివరణ ఇవ్వండి
- కేబీఆర్ పార్కుపై సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
- ఎన్‌జీటీ ఉత్తర్వుల నేపథ్యంలో ఎటువంటి ఆదేశాలివ్వలేం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కులోని చెట్లను పెద్ద సంఖ్యలో నరికివేస్తుండటంపై హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వ వివరణ కోరింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్‌ఆర్‌డీపీ) కింద చేపట్టిన బహుళ అంతస్తుల ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం పార్కులోని చెట్లను నరికివేస్తున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెట్ల నరికివేత వ్యవహారంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) యథాతథ స్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు జారీ చేసినందున తాము ప్రస్తుతానికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ లోపు ఎన్‌జీటీ ఏవైనా ఉత్తర్వులు జారీ చేస్తే, అవి మీకు వ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తే, వాటిని తమ దృష్టికి తీసుకురావొచ్చునని పిటిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేబీఆర్ పార్కులో చెట్ల నరికివేతను అడ్డుకోవాలని కోరుతూ ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని ధర్మాసనం విచారించింది.
పార్కును పణంగా పెట్టొద్దు
ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ... బహుళ అంతస్తుల ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం కేబీఆర్ పార్కు వద్ద దాదాపు 2,390 చెట్లను కొట్టేస్తున్నారని తెలిపారు. ఇందులో పార్కు లోపలి చెట్లు కూడా ఉన్నాయన్నారు. ఈ నరికివేత వల్ల అరుదైన జాతుల చెట్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... ఇంతకీ ఫ్లైఓవర్లు ఎక్కడి నుంచి వెళుతున్నాయని ప్రశ్నించింది. పార్కును ఆనుకుని వెళుతున్నాయని ప్రభుత్వం తరఫున ఏజీ కె.రామకృష్ణారెడ్డి బదులిచ్చారు. అభివృద్ధి అవసరమేనని, అయితే కేబీఆర్ పార్కు వంటి వాటిని పణంగా పెట్టడానికి వీల్లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
పార్కు బయట నుంచి ఫ్లైఓవర్లు వెళుతుంటే పార్కు లోపల చెట్లతో పనేముందుందని ప్రశ్నించింది. దీనికి ఏజీ స్పందిస్తూ, తాము లోపలి చెట్లను నరకడం లేదని, పార్కు చుట్టూనే ఫ్లైఓవర్లు వస్తున్నాయని చెప్పారు. చెట్లు జోలికి వెళ్లకుండా ప్రణాళికలు రూపొందించడం సాధ్యపడదా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నామని ఏజీ తెలియజేశారు. చెట్ల నరికివేత సమస్యకు పరిష్కారం కాదని, వాటిని మరో చోటుకు తరలిస్తే మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒక చెట్టు కొట్టిన చోట మూడు చెట్లు నాటుతున్నామని ఏజీ చెప్పగా, మెట్రో రైల్ నిర్మాణం సందర్భంగా ఎన్ని చెట్లు నాటారని ధర్మాసనం ప్రశ్నించింది. కేబీఆర్ పార్కు లోపల చెట్ల నరికివేతపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఏజీకి తేల్చి చెప్పింది.