కేబీఆర్ పార్కు చెట్ల నరికివేతపై హైకోర్టు నిలదీత
- నాటేది రెండు మూడడుగుల మొక్కలు..
- కూల్చేది 20,30 ఏళ్ల నాటి చెట్లనా?
- తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు
- తదుపరి విచారణ 18కి వాయిదా
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి(కేబీఆర్) పార్కులో భారీస్థాయిలో చెట్ల నరికివేత విషయమై హైకోర్టు బుధవారం తెలంగాణ సర్కార్‌ను నిలదీసింది. ఒకవైపు హరితహారం పేరుతో రెండు, మూడు అడుగుల మొక్కలు నాటుతూ మరోవైపు 20-30 ఏళ్ల నాటి చెట్లను నరికేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించింది. ఇది సరైన పద్ధతి కాదని స్పష్టం చేసింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్‌ఆర్‌డీపీ) కింద చేపట్టిన బహుళ అంతస్తుల ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం కేబీఆర్ పార్క్‌లోని చెట్లను పెద్దసంఖ్యలో నరికివేస్తుండటంపై ఓ దినపత్రిక ఎడిటర్ హైకోర్టుకు లేఖ రాయగా, దానిని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది.
దీనిని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ఎ.సంజీవ్‌కుమార్ స్పందిస్తూ పిటిషనర్ తన లేఖలో 3100 చెట్లను కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారని, ఇది నిజం కాదని అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ‘మీరు ఒకపక్క హరితహారం అంటారు. ఇందులో రెండు, మూడు అడుగులున్న చిన్న మొక్కలు నాటుతారు. మరోవైపు అభివృద్ధి అంటూ 20-30 ఏళ్ల నాటి భారీ చెట్లను నరికివేస్తారు. ఇది ఎంత వరకు సబబో మీరే చెప్పాలి.’ అని ప్రశ్నించింది. పిటిషనర్ చెప్పిన లెక్కల్లో తేడాలునప్పటికీ చెట్లు కొట్టేస్తున్నది నిజమా.. కాదా.. అని నిలదీసింది. ఈ కేసులో కోర్టు సహాయకారిగా(అమికస్ క్యూరీ) సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్‌ను నియమించిన ధర్మాసనం, ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే దాఖలైన వ్యాజ్యంతో దీనిని కూడా జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.