
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నం.2లో వంశీరాం బిల్డర్స్ పేలుళ్లు జరపడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వంశీరాం బిల్డర్స్ పేలుళ్లు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పార్క్‌హయత్ హోటల్ జనరల్ మేనేజర్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ ఆరోపణలపై వివరాలు అందజేయాలని సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ఆదేశించారు.
ఈ మేరకు ప్రతివాదులైన హోంశాఖ కార్యదర్శి, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లకు నోటీసులు జారీ చేశారు. పేలుళ్ల వల్ల హోటల్‌లో బసచేసే వారికే కాకుండా చుట్టుపక్కల వారికీ ప్రమాదం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ వాదించారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు.