
పరువు తీసేస్తున్నారు
క్రమశిక్షణకు మారు పేరు పోలీస్ శాఖ. అలాంటి శాఖలో ఇటీవల కాలంలో ఉన్నతాధికారులు, సిబ్బంది ప్రవర్తనతో ఆ శాఖ పరువు కాస్తా గంగలో కలుస్తోంది. అందుకు నగరంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలే ఉదాహరణ. గత వారం నగరంలోని ఓ లాడ్జీలో ఓ సీఐ, మహిళా ఎస్సై రాసలీలలు చోటు చేసుకున్నాయి. ఆ ఘటనపై సాక్షాత్తూ సదరు మహిళ ఎస్సై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ అయి సదరు సీఐ, మహిళా ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆ సంఘటన మరువక ముందే నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది.
బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్కు వచ్చిన అరబిందో ఫార్మా కంపెనీ వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడం.... కాల్పులు జరపడం... ఆ క్రమంలో నిత్యానందరెడ్డి సోదరుడు కిడ్నాపరుపై దాడికి ఉపక్రమించడంతో అతగాడు ఉపయోగించిన ఏకే 47 తుపాకీ వదిలి పరారైయ్యాడు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభిస్తే... ఆ కిడ్నాపర్ ఎవరో కాదు.... పోలీసు శాఖకు చెందిన కానిస్టేబుల్ ఓబులేసు అని తేల్చారు. అంతేకాదు గతేడాది విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహించి హైదరాబాద్ తిరిగి వస్తూ... గల్లంతైన ఏకే 47 ఇదే అని పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే అబిడ్స్ పోలీసు స్టేషన్లోకి అర్థరాత్రి ఓ వ్యక్తి దర్జాగా వెళ్లి వైర్లెస్ సెట్ను దొంగిలించాడు. ఆ సమయంలో స్టేషన్ తలుపు తీసుకుని నిద్రపోతున్నారు.
వైర్లెస్ సెట్ట్ కోసం పోలీసులు ఒకరు ఇద్దరిని కాదు దాదాపు 600 మందిని విచారించారు. అయినా పోలీసు స్టేషన్లోకి దర్జాగా వచ్చి... వెళ్లిన వ్యక్తి ఎవరో గుర్తించలేక పోయారు. ఇది మన పోలీసుల తీరు. నగరంలో ఎక్కడబడితే అక్కడ చైన్ స్నాచర్లు ఆగడాలు రోజురోజూకు పెరిగిపోతున్నాయి. ఆ కేసులను పరిష్కరించ లేక పోలీసులు నానావస్థలు పడుతున్నారు. ఓ వైపు సీఎం కేసీఆర్ మాత్రం పోలీసు వ్యవస్థను అంతర్జాతీయ స్థాయికీ తీసుకువెళ్తామని ఆయన మాటలు ఆకాశాన్ని తాకుతుంటే.. పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందిలోని కొందరు ఆలోచనలు మాత్రం ఖాకీ వనంలో విత్తిన గంజాయి మొక్కల్లా ఏపుగా ఎదుగుతున్నాయి.