కదులుతున్న ‘గంజాయి’ డొంక!
⇒ ‘సాక్షి’ కథనంతో కదిలిన పోలీసులు
⇒ బెంజ్ కారు నడిపింది సాత్విక్‌రెడ్డిగా గుర్తింపు
హైదరాబాద్: కేబీఆర్ పార్క్ గేట్ వద్ద శనివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం డొంక కదులుతోంది. ఈ ఉదంతంపై ‘‘బెంజ్‌లో గం‘జాయ్’’పేరుతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పోలీసు విభాగం స్పందించింది. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది జడ్జర్లకు చెందిన రియల్టర్ కుమారుడిగా గుర్తించి ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో మాదకద్రవ్య నిరోధక చట్టంతో పాటు ఇతర సెక్షన్లనూ జోడించారు. (చదవండి: బెంజ్‌లో గం‘జాయ్’!)
జూబ్లీహిల్స్ రోడ్ నెం.31కు చెందిన ఎం.అనిల్‌కుమార్‌రెడ్డి శనివారం ఉదయం కేబీఆర్ పార్క్‌కు వాకింగ్ కోసం వచ్చి గేట్ నెం.2 వద్ద తన బీఎండబ్ల్యూ కారును ఆపారు. అదే సమయంలో జూబ్లీహిల్స్ నుంచి ఫిల్మ్‌నగర్ వైపు వేగంగా దూసుకువచ్చిన బెంజ్ కారు ఈ వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టింది. బీఎండబ్ల్యూ బాగా దెబ్బతినగా... బెంజ్‌లో ఉన్న ముగ్గురు యువకుల్ని వెనుక వచ్చిన మరో కారులోని వారు ఎక్కించుకుని ఉడాయించారు. వాకింగ్ చేస్తున్నవాళ్లు బెంజ్ కారును పరిశీలించగా.. అందులో పొగతో పాటు మద్యం సీసాలు, గంజాయి కనిపించాయి.
పోలీసుల్నీ తప్పుదోవ పట్టించారు...
ఇదిలా ఉండగా... సదరు బెంజ్ కారులో ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, తాజా మంత్రి సంబంధీకులు ఇలా వీవీఐపీల బిడ్డలే ఉన్నారు. దీంతో కేసు నుంచి బయటపడటానికి వారు పోలీసుల్నీ తప్పుదోవ పట్టించారు. సైదాబాద్‌కు చెందిన రాఘవేంద్రరెడ్డి వీరిలో ఒకరి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీవీఐపీల బిడ్డలు అతడిని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు పంపి లొంగిపోయేలా చేశారు. అతడు మద్యం తాగినట్లు నిరూపితం కాకపోవడంతో ఈ కేసు సాధారణ ప్రమాదంగా నమోదైంది. అయితే ‘సాక్షి’కథనంతో రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ డీసీపీ ఎం.వెంకటేశ్వరరావు ఘటనాస్థలిని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా... ప్రమాదం జరిగిన సమయంలో సాత్విక్‌రెడ్డి అనే యువకుడు బెంజ్ కారు నడుపుతున్నట్లు గుర్తించారు.
రియల్టర్ కుమారుడు అరెస్టు...
జడ్జర్లకు చెందిన రియల్టర్ బాల్‌రెడ్డి కుమారుడైన సాత్విక్ అమెరికాలో బీబీఏ విద్యనభ్యసిస్తున్నాడు. ఇటీవల నగరానికి వచ్చిన ఇతడు తన స్నేహితులైన వీవీఐపీల బిడ్డలకు శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌లో పార్టీ ఇచ్చాడు. ఈ విందుకు మాజీ ముఖ్యమంత్రి కుమారుడితో పాటు తాజా, మాజీ మంత్రుల కుమారులు హాజరయ్యారు. శనివారం ఉదయం మద్యం, గంజాయి మత్తులో ఉన్న సాత్విక్ ఫిల్మ్‌నగర్‌కు చెందిన తన స్నేహితుడిని విడిచిపెట్టడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తేలింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం సాత్విక్‌ను అరెస్టు చేశారు. ఈ ఉదంతంలో రాఘవేంద్రరెడ్డి ప్రమేయం లేదని తేలింది.
అదనపు సెక్షన్లు జోడింపు...
ఈ కేసును ఆల్టర్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీలోని 279, ఎంవీ యాక్ట్‌లోని 185తో పాటు మాదకద్రవ్య నిరోధక చట్టం (ఎన్డీపీఎస్ యాక్ట్)లోని 20(బీ)(2)(ఎ) సెక్షన్‌ను అదనంగా జోడించారు. ఈ ఘటనకు కారకులైన వారు ఎంత ప్రముఖులైనా వదిలిపెట్టవద్దని డీసీపీ వెంకటేశ్వరరావు స్థానిక పోలీసులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ ఘటన పూర్వాపరాలపై లోతుగా దర్యాప్తు చేస్తామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.