Jubilee Hills police
-
సైబర్ క్రైమ్ సొమ్ముతో ఎన్నారై మహిళకు టోకరా
బంజారాహిల్స్: సైబర్ మోసంలో సంపాదించిన డబ్బుతో ఓ ఎన్ఆర్ఐ మహిళ ఇల్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి పథకం ప్రకారం ఆమె ఇంటిని కబ్జా చేసి ఆమె బ్యాంకు ఖాతాను సైబర్ పోలీసులు సీజ్ చేసే విధంగా పావులు కదిపిన ఘటనలో నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... అమెరికాలో నివసించే డాక్టర్ బినోతి మార్తాండ్‌కు జూబ్లీహిల్స్ రోడ్ నెం.52లోని నందగిరిహిల్స్ లే అవుట్లో ప్లాట్ నెంబర్ 81లో 334 గజాల్లో ఇల్లు ఉంది. 2022లో సదరు ఇంటిని అమ్మకానికి పెట్టిన ఆమె ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా వివరాలు నమోదు చేశారు. అలాగే గురునాథ్ అనే వ్యక్తిని అమ్మకానికి సంబంధించి ఎంక్వైరీ కోసం ఏజెంట్‌గా నియమించుకున్నారు. 2022లో ఆమె యూఎస్‌లో ఉండగా ఎస్బీకే గ్రూప్ చైర్మన్ బాబు అలియాస్ షేక్ బషీర్ పేరుతో వాట్సాప్ కాల్ వచి్చంది. నందగిరిహిల్స్‌లోని మీ ప్లాట్‌ను కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు షేక్ బషీర్ చెప్పడంతో ఆమె ఇంటిని రూ. 12.50 కోట్లకు విక్రయిస్తున్నట్లు తెలిపింది. సదరు మొత్తాన్ని షేక్ బషీర్ ఆరీ్టజీఎస్ ద్వారా పలుమార్లు ఆమె ఖాతాకు బదిలీ చేశాడు. ఈ ఏడాది జూలై 18న ఈ మొత్తం ఆమె ఖాతాలో జమ చేసినట్లు ఆధారాలు పంపించిన అతను అదే రోజు తాను ఇంట్లో దిగుతున్నానంటూ ఆమెకు ఫోన్‌చేసి చెప్పి ఇంటిని తన ఆ«దీనంలోకి తీసుకున్నాడు. జూలై 19న ఆమెకు బ్యాంకు నుంచి మీ అకౌంట్ ఫ్రీజ్ చేస్తున్నామంటూ సైబర్ పోలీసులు నోటీసు పంపడంతో నివ్వెరపోయింది. వెంటనే ఆమె బాబు అలియాస్ షేక్ బషీర్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు. బ్యాంకు అధికారులను ఆరా తీయగా ఈ మొత్తం డబ్బు సైబర్ మోసం ద్వారా సంపాదించినదని చెప్పారు. అంతే కాకుండా షేక్ బషీర్ ఆమె ఇంటిని ఆక్రమించమే కాకుండా చంపేస్తానని బెదిరించాడు. ఆమె ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు తొలగించి తాజాగా తన సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాడు. జూలై 28న ఇండియాకు వచి్చన బాధితురాలు తన కుమారుడితో కలిసి ఇంటికి వెళ్లగా బషీర్ అనుచరులు అందులో ఉన్నారు. తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఇంటిని స్వా«దీనం చేసుకున్న నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు బషీర్ కోసం గాలిస్తున్నారు. -
జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీసులకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే భారత్‌కు వస్తానన్న ప్రభాకర్‌రావు.. గత నెలలోనే భారత్ రావాల్సి ఉన్నా వాయిదా వేసుకోక తప్పలేదని లేఖలో పేర్కొన్నారు. క్యాన్సర్‌తో పాటు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని పేర్కొన్నారు.కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ప్రభాకర్‌రావుపై నమోదు అయ్యాయి. ఈ కేసులో తొలి అరెస్ట్ ప్రణీత్‌రావును చేయగా.. అంతకు ముందే అలర్ట్ అయిన ప్రభాకర్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు. -
వివాహితతో సహజీవనం చేస్తూ చిత్రహింసలు
బంజారాహిల్స్: ఓ వివాహితతో సహజీవనం చేస్తూ ఆమెను అడ్డుగా పెట్టుకుని పలువురిని బెదిరించి కేసులు పెట్టించి డబ్బు దండుకునేందుకు యతి్నంచడమే కాకుండా ఆమెను తీవ్రంగా కొట్టిన ఘటనలో నిందితున్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. ఖమ్మం జిల్లా మధిర మండలం, సిరిపురం గ్రామానికి చెందిన కొనకంచి కిరణ్ కుమార్(34)పై పలువురిని బెదిరించిన ఘటనలో నగరంలోని పలు పోలీస్ స్టేషన్లల్లో 8 కేసులు నమోదై ఉన్నాయి. శ్రీ కృష్ణానగర్‌లో అద్దెకు ఉంటున్న కిరణ్ కుమార్ సమీపంలో ఒక ఇంట్లో పనిచేస్తున్న ఒక వివాహితతో రెండు సంవత్సరాక్రితం పరిచయం పెంచుకున్నాడు. నిన్ను, నీ పిల్లల బాగోగులు చూసుకుంటానంటూ చెప్పాడు. మాయమాటలతో ఆమెను లోబర్చుకున్నాడు. ఇటీవల పక్కింట్లో నివసిస్తున్న ఓ యువకుడితో ఆమె మాట్లాడుతుండగా చూసిన కిరణ్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఆమెతో ఫిర్యాదు చేయించి తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పించాడు. సదరు యువకుడిని బ్లాక్‌మొయిల్ చేశాడు. ఇలాంటి అబద్ధాలు ఎందుకంటూ ఆమె కిరణ్ కుమార్‌ను నిలదీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్యా తీవ్ర వాద్వాదం జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న కిరణ్ కుమార్ ఈ నెల 17న తన గదిలో తాళ్లతో ఆమెను మంచానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. కడుపులో తన్నాడు. ఆమె విలవిలాడుతుండగానే అలాగే వదిలేసి పారిపోయాడు. కట్లు విప్పుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు గతంలో కూడా జైలుకు వెళ్లొచి్చనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరు కారం ఫేమస్ సాంగ్.. కుర్చీ తాతను మడతపెట్టేశారు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేశ్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసింది. అయితే ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌పై నెట్టింట రీల్స్ కూడా తెగ వైరలయ్యాయి. ఎందుకంటే ఈ డైలాగ్ ఓ తాత చెప్పింది కావడంతో సినిమాకు క్రేజ్‌ను తీసుకొచ్చింది. అలాగే ఈ డైలాగ్ సినిమాలో పెట్టినందుకు కుర్చీ తాతకు లక్ష రూపాయలు సాయం కూడా అందించారు. గుంటూరు కారం సినిమాలో కుర్చీని మడతపెట్టి సాంగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన కుర్చీ తాత.. తాజాగా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నటి స్వాతి నాయుడు, వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు కుర్చీ తాతని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తమను బూతులు తిడుతూ వీడియోలు చేస్తున్నారని.. తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయానని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని వైజాగ్ సత్య పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. హైదరాబాద్‌లో కృష్ణ కాంత్ పార్క్ వద్ద ఉంటాడు. ఇతనికి భార్య, కొడుకులు, కూతురు ఉన్నారు. అయితే ఇంట్లో వాళ్లని పట్టించుకోకుండా ఇలా రోడ్లపైనే తిరుగుతుంటారు. అయితే యూట్యూబ్ ఛానల్స్ అతన్ని వైరల్ చేయడంతో పాపులర్ అయ్యారు. -
బిగ్ బాస్ నిర్వాహకులకు షాక్.. అసలేం జరిగిందంటే?
పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్‌తో బిగ్‌బాస్ నిర్వాహకులకు పోలీసులు షాకిచ్చారు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆర్టీసీ బస్సులతో పాటు, కంటెస్టెంట్స్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. తాజాగా ఈ ఘటనలపై యాజమాన్యం ఎండమోల్‌షైన్‌కు నోటీసులు జారీ చేశారు. అభిమానులు భారీగా వస్తారని తెలిసినా ముందస్తుగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై నమోదైన రెండు కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని సైతం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పీఎస్‌కు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. -
బిగ్‌బాస్ గొడవలో మరో ముగ్గురి అరెస్టు
హైదరాబాద్: బిగ్‌బాస్ గొడవలో జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 17న అన్నపూర్ణ స్టూడియోస్‌లో బిగ్‌బాస్ ఫైనల్స్ అనంతరం విజేత ప్రశాంత్, రన్నరప్ అమర్‌దీప్‌చౌదరి అభిమానులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడి బస్సులు, కార్లను ధ్వంసం చేసి పోలీసులపై రాళ్లు రువ్వి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడు మహావీరంలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా శనివారం వీరిద్దరూ బెయిల్‌పై వచ్చారు. అలాగే ఈ విధ్వంసానికి పాల్పడిన 12 మందిని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. తాజాగా సరూర్‌నగర్‌కు చెందిన హరినాథ్‌రెడ్డి, యూసుఫ్‌గూడలకు చెందిన ఎం. సుధాకర్‌లను ఆదివారం రిమాండ్‌కు తరలించారు. పవన్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పరారీలో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్!
హైదరాబాద్: పబ్లిక్ న్యూసెన్స్‌కు కారకుడైన బిగ్‌బాస్ సీజన్–7 విజేత గొడుగు పల్లవి ప్రశాంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండగా ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గజ్వేల్ సమీపంలోని కొలుగూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ ఆదివారం రాత్రి జరిగిన బిగ్‌బాస్–7 విజేతగా ఎంపిక కాగా, అమర్దీప్ రన్నరప్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్‌రోడ్ నె.ం 5లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమర్‌దీప్‌ను విజేతగా ప్రకటించ కపోవడంతో ఆయన అభిమానులు గొడవకు దిగారు. మరోవైపు పల్లవి ప్రశాంత్ అభిమానులు వేలాదిగా అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ అమర్దీప్ కారును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడమేగాక అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బయట గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన బిగ్‌బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్‌ను స్థానిక పోలీసుల సహకారంతో రహస్య మార్గం నుంచి బయటికి పంపించింది. మళ్లీ ఇటు వైపు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే పల్లవి ప్రశాంత్ ఇటు పోలీసుల ఆదేశాలను, అటు బిగ్‌బాస్ యాజమాన్యం సూచనలను బేఖాతర్ చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీప్‌పై చేరుకోవడంతో రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మద్దతుదారులు రాళ్లు రువ్వుతూ మహిళా కంటెస్టెంట్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఇందుకు కారకుడైన పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. దీంతో అతడి సోదరుడు పరుశరాములు కోసం పోలీసులు ఒక బృందాన్ని స్వగ్రామానికి పంపించారు. కారు డ్రైవర్ సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కోసం ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటు చేశారు. ఆయన అనుచరుల ఫోన్ డేటాను సేకరించారు. కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో పల్లవి ప్రశాంత్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి కూడా ఓ బృందాన్ని పంపించనున్నారు. ఇదిలా ఉండగా బస్సులపై రాళ్లు రువి్వన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం 15 మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను వడపోస్తున్నారు. -
రూ.4.50 లక్షలకు పసికందు అమ్మకం
బంజారాహిల్స్ (హైదరాబాద్) : పుట్టిన నాలుగు రోజులకే పసికందును విక్రయించిన మహిళతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తిపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కాగజ్‌నగర్‌కు చెందిన అనూషకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. గత శనివారం రహ్మత్‌నగర్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో మూడో బిడ్డకు జన్మనిచ్చింది. కొడుకును విక్రయించేందుకు అంతకుముందే రూ.4.50 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. మంగళవారం రాత్రి ప్రాంతంలో డబ్బు తీసుకుని పసి కందును అప్పగించారు. ఈ వ్యవహారం పోలీసులదాకా వెళ్లడంతో మధ్యవర్తిగా వ్యవహరించిన సంతోషిని అదుపులోకి తీసుకొని వారు ప్రశ్నించారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వ్యక్తి రూ.4.50 లక్షలు ఇచ్చి చిన్నారిని కొనుగోలు చేశాడని, మధ్యవర్తిగా తనకు రూ. 50 వేలు ఇచ్చినట్లుగా తెలిపింది. బిడ్డను కొనుగోలు చేసిన వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేశారు. -
మరో వివాదంలో కార్వీ కన్సల్టెన్సీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కార్వీ మరో వివాదంలో చిక్కుకుంది. పవర్ ప్లాంట్ షేర్ల వ్యవహారంలో గోల్మాల్ బయటపడింది. పవర్ ప్లాంట్ ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కార్వీ యజమాని పార్థసారథిపై జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్‌స్టేషన్‌కు పిలిచి పార్థసారథిని ఆదివారం విచారించారు. సీఆర్పీసీ 41 కింద ఆయనకు నోటీసులు ఇచ్చి పంపించారు. ఇదిలాఉండగా.. క్లయింట్లకు సంబంధించి రూ.2,000 కోట్ల మేర విలువైన సెక్యూరిటీలను దుర్వినియోగం చేసిన విషయమై కూడా కార్వీ బ్రోకింగ్ సర్వీసెస్‌పై పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. చదవండి: (కార్వీ తరహా మోసాలకు చెక్) అలా ఎలా రుణాలిచ్చేశారు? -
‘ఆరోగ్యశ్రీ’లో అక్రమాలు!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీలో అవినీతి జలగలు రాజ్యమేలుతున్నాయి. పేదల వైద్యం కోసం ఏర్పాటైన దీన్ని కూడా అవినీతికి కంచుకోటగా మార్చారు. బయటి దళారులతో కుమ్మక్కై వారితో అక్రమాలు చేయిస్తూ సొమ్ము గడిస్తున్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ దందా జరుగుతున్నట్లు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఫిర్యాదులు అందాయి. వీటిపై సంబంధిత విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతుండగా, వరంగల్ జిల్లాలో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.వాటిపై సమగ్ర విచారణ జరిపిన తర్వాత ఈ దందాలో పాల్గొన్న ఆరోగ్యశ్రీ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ సహా మరో ముగ్గురు టీం లీడర్లపై వేటు వేశారు. దీన్ని తొలగించుకునేందుకు వారు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల వద్ద ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు ఆరోగ్యశ్రీ అధికారులు తిరిగి వారిని వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలావుండగా ఇతర జిల్లాల్లో జరుగుతున్న దందాపైనా విజిలెన్స్ అంతర్గతంగా విచారణ జరుపుతోంది. లాగిన్, పాస్వర్డ్ దొంగిలించి మరీ... ఆరోగ్యశ్రీని అమలుచేసేందుకు జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్, మేనేజర్లు ఉంటారు. వారి కింద టీం లీడర్లు ఉంటారు. వారి పరిధిలో ప్రతీ నెట్వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రలు విధులు నిర్వహిస్తారు. వీళ్లు నెట్వర్క్ ఆసుపత్రులకు వెళ్లే రోగుల శస్త్రచికిత్సలకు ఆన్లైన్లో అనుమతులు ఇవ్వడం, ఆ తర్వాత ప్యాకేజీ ప్రకారం ఆసుపత్రుల బిల్లులు తయారు చేసి ఆరోగ్యశ్రీ ట్రస్టుకు ఆన్లైన్లో పంపడం వారి విధుల్లో కీలకమైనవి. దీన్నే జిల్లాస్థాయిలోని ఆరోగ్యశ్రీలోని కొందరు ఉద్యోగులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి కొర్రీలు పెట్టకుండా బిల్లులు పాస్ చేయించినందుకు నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి మామూళ్లు తీసుకుంటారు. ఎవరైనా ఇవ్వకుంటే కొర్రీలు వేస్తారు. లేకుంటే ఆయా ఆసుపత్రులపై చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తారు. దీంతో ప్రతీ నెట్వర్క్ ఆసుపత్రి వారికి నెలవారీగా రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఇవ్వాల్సిందే. దాంతోపాటు ఆరోగ్యశ్రీ రోగుల నుంచి బిల్లులకు చెల్లించాల్సిన పన్నుల సొమ్మును వసూలు చేస్తున్నారు. మరోవైపు బయటి దళారులతో కుమ్మక్కై వారికి ఆరోగ్యశ్రీ అంతర్గత వెబ్సైట్ లాగిన్, పాస్వర్డ్ వివరాలు అందజేస్తారు. వారు ఆ బిల్లుల వివరాలు, అవి ఆమోదం పొందాయో గుర్తిస్తారు. ఆ ప్రకారం ముందే ఆసుపత్రి యాజమాన్యం వద్దకు వెళ్లి మేం ఇంత సొమ్ము ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి ఇప్పిస్తామంటూ బేరసారాలు ఆడతారు. లేకుంటే కొర్రీలు పెడతామని బెదిరిస్తారు. దీంతో యాజమాన్యాలు ఎంతో కొంత ముట్టజెప్పుతాయి. తీగలాగితే డొంక కదిలిందిలా...! గత నెల ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగులను ఫోన్లలో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న హరీశ్ అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ ముఠా ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందిన రోగుల జాబితాను తస్కరించి వారి నుంచి బిల్లులపై వేసే పన్నుల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు హరీశ్ అంగీకరించాడు. వరంగల్ కేంద్రంగా జరుగుతున్న ఈ రాకెట్‌ను విజిలెన్స్ సిబ్బంది బట్టబయలు చేశారు. ఓ నలుగురు ఉద్యోగులు ఆరోగ్యశ్రీ వెబ్సైట్ లాగిన్ సమాచారాన్ని హరీశ్‌తో పాటు ఇతర వ్యక్తులకు ఇచ్చి రోగుల వివరాలను సేకరించి, డబ్బులు వసూలు చేస్తున్నారని తేలింది. ఆరోగ్యశ్రీ వెబ్సైట్లలో ప్రభుత్వ చెల్లింపుల వివరాలను తెలుసుకుని ఆయా ఆసుపత్రులకు వెళ్లి తామిచ్చిన నివేదికల వల్లే వారికి ఆరోగ్యశ్రీ నిధులు మంజూరు ఆయ్యాయని, అందుకు కమీషన్ చెల్లించాలని ఒత్తిళ్లు చేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. -
ఎవరీ కోటేశ్వరరావు?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వస్తోందంటూ తెలంగాణ ఇంటెలిజెన్స్ పేరుతో బోగస్ సర్వేను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన వ్యక్తిపై కేసు దర్యాప్తులో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు పురోగతి సాధించారు. ఈ వార్తను రూపొందించిన టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఉద్యోగి ప్రసన్నకుమార్‌ను సోమవారం అరెస్టు చేశారు. ఇతడికి సదరు సర్వే విషయం వాట్సాప్ ద్వారా కోటేశ్వరరావు అనే వ్యక్తి పంపినట్లు వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన ఇతడు టీడీపీ కీలక నేతలకు సన్నిహితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కోటేశ్వరరావును పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏపీకి పంపడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఉన్న భవనం కేంద్రంగా పని చేసిన టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నేతృత్వంలో ఈ కుట్ర జరిగినట్లు పోలీసులు గుర్తించారు. టీఎఫ్సీ సంస్థ డైరెక్టర్ శాఖమూరి తేజోభాను కోసం ముమ్మరంగా వెతుకుతున్నారు. వైఎస్ షర్మిలపై దుష్ప్రచారంలోనూ టీఎఫ్సీ పాత్ర? వైఎస్ షర్మిలపై సోషల్‌మీడియాలో జరిగిన దుష్ఫ్రచారం వెనుకా టీఎఫ్సీ సంస్థ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న నిందితులు దొరికితే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. సాంకేతిక ఆధారాలను బట్టి ప్రస్తుతం వీళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
జయరాం హత్య కేసులో మరో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టు అయినవారిలో ఎస్ఆర్నగర్ బాపూనగర్‌కు చెందిన రౌడీషీటర్ నేనావత్ నగేష్ అలియాస్ సింగ్ అలియాస్ బాబుసింగ్(35), ఆయన మేనల్లుడు విస్లావత్ విశాల్(20), సుభాష్‌చంద్రారెడ్డి(26) ఉన్నారు. మంగళవారం ఇక్కడ దర్యాప్తు అధికారి కేఎస్ రావుతో కలసి వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. జయరాంను హత్య చేయాలని ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి ముందుగానే పథకం వేసుకొని గత నెల 29న ఎస్ఆర్నగర్ బాపూనగర్‌కు చెందిన రౌడీషీటర్ నేనావత్ నగేష్ అలియాస్ సింగ్ అలియాస్ బాబుసింగ్‌ను తన ఇంటికి పిలిపించాడు. ఇందుకోసం నగేష్ తన మేనల్లుడు విస్లావత్ విశాల్(20)ని రాకేశ్‌రెడ్డికి పరిచయం చేశాడు. రాకేశ్‌రెడ్డి దిండుతో జయరాం ముఖంపై ఒత్తిపెట్టి ఊపిరాడకుండా చేయగా విశాల్ చేతులను గట్టిగా పట్టుకున్నాడు. పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించిన ఘటనను నగేష్ వీడియో తీశాడు. మహబూబ్‌నగర్ జిల్లా న్యూటౌన్ శేషాద్రినగర్‌కు చెందిన లక్ష్మిరెడ్డి సుభాష్‌చంద్రారెడ్డి(26) అల్వాల్ పంచశీల్కాలనీలోని హైటెన్షన్ రోడ్డులో ఉంటున్నాడు. బీటెక్ చదువుకున్న సుభాష్‌చంద్రారెడ్డి ఆఫీస్ అసిస్టెంట్‌గా రాకేశ్‌రెడ్డితో కలసి ఉంటున్నాడు. సుభాష్‌చంద్రారెడ్డి సిమ్‌నే రాకేశ్‌రెడ్డి తన వ్యక్తిగత కార్యకలాపాలకు వాడుతున్నాడు. అదే ఫోన్‌తో వీడియోలను సుభాష్చంద్రారెడ్డికి పంపించాడు. ఈ ముగ్గురు జయరాం హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. జయరాంను బెదిరించి ఆయన ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ చేశారు. ఆ తర్వాతనే చంపేద్దామనుకున్నారు. హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్ వద్ద బెదిరించి తెప్పించిన డబ్బులతోపాటు సంతకాలు చేసిన కొన్ని డాక్యుమెంట్లను తీసుకున్నారు. హత్యకు ముందు ఒక ఇన్స్పెక్టర్, ఆ తర్వాత మరో ఇన్స్పెక్టర్ సలహాలను రాకేశ్‌రెడ్డి తీసుకున్నాడు. ఈ హత్య కేసులో ఐదుగురు పోలీసు అధికారులను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాసులు, రాంబాబులతోపాటు మరో వ్యక్తి వివరణ తీసుకున్నారు. శిఖాచౌదరిని ఏడు గంటలపాటు విచారించగా, జయరాం హత్య కేసులో ప్రత్యక్షంగా తన పాత్ర ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదు. రూ.1.3 కోట్లు శిఖా కోసం తాను ఖర్చు చేసినట్లు రాకేశ్‌రెడ్డి చెప్పగా అలాంటిదేమీ లేదని శిఖా కొట్టిపారేసింది. శిఖాచౌదరి స్నేహితుడు సంతోష్ ద్వారా రాకేశ్‌రెడ్డి పరిచయమయ్యాడు. జయరాం హత్యకేసులో టీడీపీ నేత బీఎన్‌రెడ్డి పాత్రపై ఇంకా విచారిస్తున్నారు. జయరాం హత్య కేసులో శిఖాకు సంబంధముందా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. -
కస్టడీకి జయరామ్ హత్య కేసు నిందితులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరామ్ హత్యకేసు దర్యాప్తును జూబ్లీహిల్స్ పోలీసులు ముమ్మరం చేశారు. ఓవైపు నిందితులను విచారించేందుకు సన్నాహాలు చేస్తూనే మరోవైపు ఈ కేసులో కీలక సాక్షులను ప్రశ్నిస్తూ పోలీసులు వాంగ్మూలాల నమోదు ప్రారంభించారు. హత్య కేసు నిందితులుగా ఉన్న రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్‌లు ఇప్పటికే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండగా వీరిని తదుపరి విచారణ నిమిత్తం మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం ఆదేశాలిచ్చింది. దీంతో బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి వీరిద్దరినీ అదుపులోకి తీసుకుంటామని కేసు దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ ఏసీపీ కె.శ్రీనివాసరావు మంగళవారం మీడియాకు చెప్పారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత వీరిద్దరితో ‘క్రైమ్‌సీన్ రీ–కన్స్ట్రక్షన్’చేయనున్నారు. నిందితుల విచారణ నేపథ్యంలో జయరామ్ హత్యలో శిఖా చౌదరితో పాటు ఇతరుల పాత్ర, పోలీసు అధికారులైన ఏసీపీ మల్లారెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల ప్రమేయంపై ఆరా తీయనున్నారు. జయరామ్ భార్య పద్మశ్రీ చేసిన ఆరోపణల పైనా లోతైన విచారణ అవసరమని పోలీసులు నిర్ణయించారు. శిఖా చౌదరి నివసిస్తున్న విల్లాకు గత నెల 29న జయరామ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఆ రోజు ఆయన ఎందుకు అక్కడకు వెళ్లారనే అంశాన్ని ఆరా తీస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇంటి వద్ద ఏం జరిగింది? అనే అంశాలు తెలుసుకోవడానికి శిఖా చౌదరి ఇంట్లో పని మనిషిని పోలీసులు విచారించారు. ఆమె నుంచి వాంగ్మూలాన్నీ నమోదు చేశారు. ఈమెతో పాటు మరికొందరి వాంగ్మూలాలను నమోదు చేసిన పోలీసులు శిఖా చౌదరికి నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు. -
పురుషులా.. మహిళలా.. ఏ జైలుకు?
హైదరాబాద్: హిజ్రాల అరెస్టు కేసులో పోలీసులకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ఓ కేసుకు సంబంధించి ప్రియ(22), సనం(20), అఫ్రిన్(22), యాస్మిన్(26) అనే నలుగురు హిజ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించమని కోర్టు ఆదేశించింది. అయితే వారిని మగవారి జైలుకు తరలించాలా? లేక మహిళా జైలుకు తరలించాలా? అన్నదానిపై పోలీసులు తర్జనభర్జన పడ్డారు. జూబ్లీహిల్స్ పోలీసులు మొదట వీరిని చంచల్‌గూడ మగవారి జైలుకు తీసుకెళ్లారు. అయితే వీరు ఆడవారని, ఇక్కడకు అనుమతించబోమంటూ జైలు అధికారి నిరాకరించారు. దీంతో పోలీసులు కోర్టును ఆశ్రయించగా తాము రిమాండ్ విధించి జైలుకు తరలించాలని చెప్పామని, ఎక్కడికి తీసుకెళ్తారో మీ ఇష్టమంటూ వ్యాఖ్యానించింది. దీంతో పోలీసులు ఈ నలుగురిని మహిళా జైలుకు తీసుకెళ్లారు. అయితే వీరు ఆడా? మగా? అన్న విషయాన్ని వైద్యుడిచే ధ్రువీకరించి తీసుకురావాలని జైలు అధికారి తెలిపారు. దీంతో ఈ నలుగురిని ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా ఆడవారే(మగవారు ఆపరేషన్ చేయించుకుని మహిళలుగా మారారు)నని వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఆ పత్రాలు తీసుకెళ్లి చంచల్‌గూడ మహిళా జైలర్‌కు ఇవ్వడంతో జైలర్ వీరిని జైలులోకి అనుమతించారు. వీరిని రిమాండ్‌కు తరలించడానికి 10 గంటల పాటు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. వివరాలు.. రాజస్తాన్‌కు చెందిన కైలాశ్ పటేల్ అనే యువకుడు అన్నపూర్ణ స్టూడియో పక్కన నుంచి శనివారంరాత్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ ఐదుగురు హిజ్రాలు కనపడగా వారితో మాటామంతి కలిపాడు. కొద్దిసేపటికి తన నుంచి హిజ్రాలు డబ్బులు లాక్కున్నారంటూ అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం నలుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు అనంతరం రిమాండ్‌కు తరలించారు. సిమ్రాన్ ఫాతిమా(20) అనే మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
నిద్ర లేకుండా చేస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని పెద్దమ్మ దేవాలయం కమాన్ వద్ద ఉన్న ఆమ్నేషియా లాంజ్ పబ్‌లో అర్ధరాత్రి దాటినా శబ్దాలు చేస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని రౌనక్ బండారి అనే యువకుడు నగర పోలీసు కమిషనర్‌కు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశాడు. గత కొంత కాలంగా ఈ పబ్ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగుతున్నదని ఇష్టారాజ్యంగా మ్యూజిక్ ప్లే చేస్తూ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపించాడు. దీనిపై స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు నైట్ డ్యూటీ ఆఫీసర్‌తో పాటు పెట్రోలింగ్ పోలీసులను పంపి మ్యూజిక్‌ను ఆపివేయడం జరిగిందని సమాధానమిచ్చారు. శబ్ధకాలుష్యం లేకుండా తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అయితే రౌనక్ బండారి ఇందుకు సంతృప్తి చెందలేదు. ఆదివారం రాత్రి కూడా మ్యూజిక్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, భారీ శబ్ధాలతో ఇబ్బందులు పడ్డామంటూ మరోసారి ట్వీట్ చేశారు. -
ఆడేదెవరైనా గెలుపు అతడిదే!
హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పేకాటలో గెలుపెవరిదో పసిగట్టి ఆపై బెట్టింగ్ జరిపే ముఠాను శనివారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఊస నాగప్రవీణ్ కుమార్ (31) బీటెక్ పూర్తి చేశాడు. యూసఫ్‌గూడలో నివసించే అతడు కొద్దికాలంగా యాదగిరినగర్‌లో హైటెక్ పేకాట శిబిరాన్ని నిర్వహి స్తున్నాడు. పేకాట శిబిరంలపై పోలీసులు దాడి చేయ గా విస్తుగొలిపే అంశాలు వెల్లడయ్యాయి. పేకాటలో ఎవరు గెలుస్తారో ముందుగా చెప్పే టెక్నాలజీ ఉన్న సెల్‌ఫోన్‌ను ఢిల్లీ నుంచి రూ.28 వేలకు ప్రవీణ్ కొనుగోలు చేశాడు. దీనిద్వారా గెలుపొందే వ్యక్తిపై బెట్టింగ్ నిర్వహించి భారీ మొత్తంలో సొమ్ము చేసుకునేవాడు. పోలీసులు ప్రవీణ్, ఇంటి యజమాని అజయ్‌తో పాటు నలుగురిని అరెస్టు చేశారు. రూ. 38 వేల నగదును, ఐదు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ కేఎస్ రావు వెల్లడించారు. టెక్నాలజీ పనితీరు ఇదీ.. ప్రవీణ్ కొనుగోలు చేసిన సెల్‌లోని డిజైన్డ్ కార్డ్ స్కానర్ ముందుగా పేకముక్కల్ని స్కాన్ చేస్తుంది. ఒక్కొక్కరికీ మూడు పేకముక్కల చొప్పున పంచే తీన్‌పత్తా ఆటలో ముందుగా సీక్వెల్ వచ్చిన వారు గెలుపొందుతారు. పంచిన పేకలు ఎవరెవరికి వెళ్లాయో సెన్సర్ల ద్వారా విశ్లేషించుకుని వరుస నంబర్లు (సీక్వెల్) ఎవరికి వచ్చిందన్న విషయాన్ని సంఖ్యల ద్వారా కొత్త టెక్నాలజీ చెప్పేస్తుంది. -
‘నామా’ పురాణం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళను బ్లాక్మెయిల్ చేసిన ఉదంతం ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలనమైంది. నగ్న చిత్రాలున్నాయని, వాటిని బయటపెడతానని నామా బెదిరించడంపై హైదరాబాద్‌కు చెందిన మహిళ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నామా నాగేశ్వర్రావుతోపాటు ఆయన సోదరుడు సీతయ్యలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై శనివారం ‘సాక్షి’ ప్రచురించిన కథనం రెండు రాష్ట్రాల్లో దుమారం రేపింది. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి మహిళ పట్ల వ్యవహరించిన తీరు మీడియాలో చర్చనీయాంశమ యింది. బాధిత మహిళ సుజాతా రామకృష్ణన్ కూడా నేరుగా మీడియా ముందుకు వచ్చారు. తనను నామా బెదిరించారని, అసభ్య పదజాలంతో దూషించారని, నగ్నచిత్రాలను బయటపెడతానని భయభ్రాంతులకు గురిచేశారని ఆవేదనను వెలిబుచ్చారు. నామా తనతో సంభాషించిన ఆడియోలను కూడా విడుదల చేశారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘అదంతా వ్యక్తిగత వ్యవహారం.. పరిశీలిస్తాం.’ అని చెప్పి తేలిగ్గా కొట్టిపారేయడం గమనార్హం. బాబు సమాధానం చెప్పాలి: సుజాత బాధిత మహిళ సుజాతా రామకృష్ణన్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై తాను రెండు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినా కొందరు టీడీపీ నేతలు, మాజీ మంత్రులు కలసి కేసు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. తన కుమారుడిని ఓ రౌడీషీటర్‌తో బెదిరించారని, ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని చాలా ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తానని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. మహిళలను లొంగదీసుకుని, బెదిరించే మనస్తత్వం ఉన్న నామాను పార్టీ పొలిట్‌బ్యూరోలో ఎలా కొనసాగిస్తారో బాబు సమాధానం చెప్పాలని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరారు. త్వరలోనే నోటీసులు : ఈ ఉదంతంపై త్వరలోనే మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావుకు నోటీసులిచ్చి విచారణ జరుపుతామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. బాధిత మహిళ గతంలో రెండుసార్లు ఫిర్యాదు ఇచ్చిందని, అయితే, ఎలాంటి ఆధారాలు చూపనందున ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. తాజాగా ఫిర్యాదుతోపాటు ఆడియో, వీడియో ఆధారాలు ఇచ్చినందున వాటిని పరిశీలించి నామా, ఆయన సోదరుడు సీతయ్యపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. త్వరలోనే నోటీసులిచ్చి చట్టప్రకారం నామాను విచారిస్తామని చెప్పారు. మరోవైపు సుజాతా రామకృష్ణన్ వాంగ్మూలాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం నమోదు చేసుకున్నారు. ఈ రికార్డు ఆధారంగానే నామాకు నోటీసులిచ్చి విచారణ జరపనున్నారు. నా జీవితం తెరిచిన పుస్తకం టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు సాక్షి, అమరావతి: తనపై సుజాత చేసిన ఆరోపణల మీద టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు స్పందించారు. టీటీడీపీ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం విజయవాడ వచ్చిన ఆయన ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. తాను బ్లాక్ మెయిల్ చేసినట్లు ఎవరో ఆరోపించిన విషయం తనకు తెలిసిందని, అందుకే బయటకు వచ్చి మాట్లాడుతున్నానన్నారు. ఇంకా పూర్తి వివరాలు తనకు తెలియవని, తెలుసుకున్న తర్వాత మాట్లాడుతానన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, తాను ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయలేదన్నారు. నలుగురికీ సాయపడ్డానే తప్ప ఎవరినీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. సుజాత మీకు తెలుసా అని మీడియా ప్రతినిధులు అడిగినా స్పందించకుండా ఆయన వెళ్లిపోయారు. నామా, సుజాతల ఆడియో సంభాషణ ఇదీ... సుజాత: ఎందుకు అరుస్తారు అసలు నామా: సంబంధం లేదన్నాను. ఒకసారి చెప్పాను.. వందసార్లు చెప్పాను.. నువ్వు కావాలని చెప్పి చేయించి కాదంటావు.. ప్రామిస్ చేయమంటావు. సుజాత: ఏమీ లేనప్పుడు ప్రామిస్ చేయడానికి ఏమైంది? నామా: నువ్వెవరివే అసలు. నువ్వు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు.. నా మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు నాతో మాట్లాడకు అని వందసార్లు చెప్పా. నాతో మాట్లాడకు. అంతే.. ఒకటే మాట. నువ్వు ఇంత చిల్లర (బూతు మాట).. కాబట్టి డ్రైవర్ల దగ్గర ఎంక్వైరీ చేయడమేనా.. ఇదేనా నీ పద్ధతి. సుజాత: వాళ్లను అడిగితే లేని విషయాలు బయటకు వస్తాయా? నామా: ఏంటే... నువ్వు చిల్లర... కాబట్టి కథలు అల్లుతున్నావే. రోజుకో కథ అల్లి దొబ్బుతున్నావు. దొంగ (బూతు) ఒకసారి చెప్తారు.. రెండుసార్లు చెప్తారు... రోజూ ఆట అయిపోయింది నీకు.. ఇది కాదే బ్లాక్మెయిల్? సుజాత: ఎందుకు, నిజాన్ని అడగడం బ్లాక్‌మెయిలా? నామా: నీ..... సుజాత: నిజం అడిగితే బ్లాక్‌మెయిలా... నాకు చెప్పండి.. ప్రామిస్ చేస్తారా... లేదా? నామా: ఈ మాట మాట్లాడకు. నాకు సంబంధం లేదని చెప్పాను. సుజాత: అంటే.. లేనప్పుడు ఎందుకు ప్రామిస్ చేయవు? నామా: (బూతు మాట) నాకు సంబంధం లేదంటే నీకేంటే ప్రామిస్ చేసేది... (బూతు మాట) సుజాత: నువ్వెవరు నన్ను (బూతు మాట) అనడానికి నామా: బూతుమాట సుజాత: అంటే అది నిన్ను పెళ్లి చేసుకుందా. అది పతివ్రతా.. అంటే నువ్వు దానికి తాళి కట్టావు. అంతే కదా.. అందుకే కదా అది నిన్ను మొగుడు అని చెప్పుకుంటుంది. నామా: పద్ధతి ప్రకారం మాట్లాడు సుజాత: నేను పద్ధతి ప్రకారమే మాట్లాడుతున్నా. అది నిన్ను మొగుడు అని ఎందుకు చెప్పుకుంటుంది? నీ గురించి మాట్లాడినప్పుడు హస్బెండ్.. హస్బెండ్ అని ఎందుకు చెప్తోంది.. నామా: అది ఎవరో నాకు తెలియదు. దాంతో నువ్వు (బూతు మాట)... ఆ సంగతులు నాతో మాట్లాడకు. నువ్వు తప్పుడు (బూతు మాట) కాబట్టి అలా చేస్తున్నావు. సుజాత: అవును.. మరి నువ్వేంటి... నువ్వేంటి? నామా: అది చిల్లర (బూతు మాట) కాబట్టి నాకు సంబం«ధం లేని విషయం అది సుజాత: అంటే అది నిన్ను మొగుడని చెప్పుకోవచ్చా? నామా: ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం సుజాత: ఏంటి బ్లాక్మెయిల్.... నువ్వు ఏమీ చేయనప్పుడు బ్లాక్మెయిల్ ఎందుకవుతుంది? నువ్వు ఏం తప్పు చేయనప్పుడు నీకు ఎందుకంత కోపం వస్తోంది? నామా: మెస్సేజ్‌లు పెడతావు...బ్లాక్మెయిల్ చేస్తావు... సుజాత: ఏం చేశాను.. ఏం ఫోటోలు పంపించాను.. ఏం పంపించాను నామా: నా మాట మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు నాతో మాట్లాడకు. ఒకటే మాట. సుజాత: అంటే నువ్వు దాంతో...? నామా: ఏయ్.. పో... (బూతు మాట) సుజాత: ఇవాళ మధ్యాహ్నం కూడా దానితో మాట్లాడావు. నామా: నీ... (బూతు మాట) నాకు సంబంధం లేదని చెప్తున్నా.. పద్ధతిగా మాట్లాడు. సుజాత: నేను ప్రూవ్ చేస్తే ఏం చేస్తావు ఇప్పుడు. ఇంతకుముందు ఒకసారి ఒప్పుకున్నావా లేదా దాంతో నీకుందని ఒప్పుకున్నావా లేదా? నామా: నువ్వొక... చూడు... ఇక మొదలుపెట్టానంటే... నువ్వు తలెత్తుకోకుండా చేస్తా.. నువ్వు మాట్లాడుతున్నావు చెప్తున్నా.. సుజాత: ఓకే... నామా: చిల్లర మాటలు మాట్లాడకు.. చెప్తున్నా.. సుజాత: ఓకే చెయ్యి.. నామా: ఏమనుకుంటున్నావో నువ్వు... సుజాత: ఏం చేస్తావు... నన్ను తలెత్తుకోకుండా చేస్తానన్నావు.. ఏం చేస్తావు. రెండో ఆడియో టేపులోని సంభాషణలు.. నామా: నీకు నమ్మకం ఉంటే చెయ్యి... లేకపోతే లేదు. సుజాత: నాకు నమ్మకం ఎలా ఉంటుంది... నీ మీద నామా: పెట్టు సుజాత: నువ్వు వాళ్లతో ఆడే డ్రామాలు వాళ్లతో ఆడుతున్నావ్... వాళ్లకేమో నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నావ్. నామా: నువ్వు ఇదే మాట్లాడుతున్నావ్ సుజాత: సరే...నరేంద్ర నీకు తెలుసని ప్రూవ్ చేస్తే ఏం చేస్తావ్... జూలై నెలలో వాడు నీకు కాల్స్ చేశాడు.. నీవ్వు వాడితో మాట్లాడావని ప్రూవ్ చేస్తే ఏం చేస్తావ్? నామా: తప్పు మాట్లాడుతున్నావ్. తప్పు మాట్లాడుతున్నావ్. సుజాత: 2014 నీ కాల్స్ లిస్టు నా దగ్గర ఉందని నీకు తెలుసు కదా. నామా: నువ్వు మొదలుపెట్టిందే మాట్లాడుతు న్నావ్.. ఇక దయచేసి నాకు ఫోన్ చెయ్యకు సుజాత: ఓకే సరే అయితే నామా: నువ్వు మారిపోతానంటే... సుజాత: నువ్వు మారవా... నామా: నువ్వు తప్పు మాట్లాడుతున్నావ్. వాళ్లతో మాట్లాడావ్, వీళ్లతో మాట్లాడావ్.. నాకు ఎవ్వరితో మాట్లాడే అవసరం లేదు. సుజాత: అవునా... నువ్వు టీఆర్ఎస్లో చేరుతున్నావ్. నీ పొలిటికల్ కెరియర్ కోసం నన్ను విత్‌డ్రా చేసుకోమంటున్నావ్. అంతేగానీ.. నామా: నా పొలిటికల్ కెరీర్ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పొలిటికల్ కెరీర్ గురించి నువ్వు అడగొద్దు. నా పొలిటికల్ కెరీర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. అర్థమైందా..? సుజాత: నా పర్సనల్ లైఫ్ గురించి మాత్రం నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు నామా: తప్పులు మాట్లాడుతున్నావ్.. ఛండాలంగా మాట్లాడుతున్నావ్ సుజాత: అవునా... నామా: కావాలని మాట్లాడుతున్నావ్... కావాలని చేస్తున్నావ్.. సమస్యే లేదు. ఇలాంటి చిల్లర పనులు నేను చెయ్యను. చేయబోను. కేసు విత్‌డ్రా చేసుకుని తర్వాత మాట్లాడు. (ఇంతలోనే ఫోన్ కట్ అయిపోయింది) -
కోర్టును ఆశ్రయించిన టాలీవుడ్ నిర్మాత
స్థలాన్ని కాజేస్తున్నారంటూ సినీ సి. కల్యాణ్ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ సొసైటీ పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 5లో ఉన్న ప్లాట్ నం. 31/బిలో డాక్టర్ టి. శ్రీనివాసులు, టి.విమలాదేవిలకు చెందిన 1182 గజాల స్థలాన్ని జ్యోతి కన్స్ట్రక్షన్స్కు 1998లో డెవలప్మెంట్ నిమిత్తం ఇచ్చారు. అయితే జీహెచ్ఎంసీ అనుమతితో 11 ప్లాట్లు నిర్మించి విమల్ బిల్డింగ్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్‌కు చెందిన 11 మందికి విక్రయించారు. అనంతరం ఆ కాంట్రాక్టర్ నిర్మాణానంతరం మిగిలిపోయిన 389 గజాల కామన్ ప్రాపర్టీని కాజేసేందుకు యత్నిస్తున్నారంటూ ప్రముఖ సినీ నిర్మాత సి. కల్యాణ్ కోర్టును ఆశ్రయించారు. స్థల యజమానులు శ్రీనివాసులు, విమలాదేవితో పాటు బిల్డర్ ఎంవీఎస్. శేషగిరిరావులపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 66 కు చెందిన డాక్టర్ టి.శ్రీనివాసులు, విమలాదేవిలకు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 5లో 1188 గజాల స్థలం ఉండగా ఈ స్థలంలో అపార్ట్మెంట్ నిర్మించేందుకు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 17కు చెందిన జ్యోతి కన్స్ట్రక్షన్స్ అధినేత ఎం.వీ.ఎస్ శేషగిరిరావుకు అప్పగించారు. 11 ప్లాట్లు విక్రయించగా 2015లో రోడ్డు విస్తరణలో అపార్ట్‌మెంట్‌కు చెందిన 202 గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీ సేకరించింది. అపార్ట్మెంట్ నిర్మాణం తర్వాత మిగిలి ఉన్న 380 గజాల స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ కల్యాణ్ కోర్టును ఆశ్రయించారు. జీహెచ్ఎంసీ అనుమతుల్లో చూపించిన స్థలాన్ని పూర్తిగా ప్లాట్దారు లకే పంచాల్సి ఉండగా ఈ ముగ్గురూ పథకం ప్రకారం కాజేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మొత్తం 18,790 చదరపు అడుగుల స్థలాన్ని 11 మంది ప్లాట్ ఓనర్లకు పంచుతూ విడివిడిగా ఒప్పందం చేశారని ఇప్పుడు మిగులు స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మొబైల్ నంబర్ కొట్టేశారు..!
- ఫోర్జరీ పత్రాలతో ఫ్యాన్సీ నంబర్ తస్కరణ - జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు హైదరాబాద్: నగలు, నగదు, బైక్‌లు, కార్లు, ఫోన్లు ఇప్పటివరకూ ఇలాంటి దొంగతనాలను ఎన్నోచూసే ఉంటారు. ఇకపై ఇలాంటి వాటినే కాదు మీ మొబైల్ ఫోన్ నంబర్‌ను సైతం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఓ ఫ్యాన్సీ మొబైల్ ఫోన్ నంబర్ తస్కరణకు గురైంది మరి. తన ఫోన్ నంబర్ చోరీకి గురైందంటూ శుక్రవారం ఓ వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో నివసించే రాకేష్‌చంద్ర గౌరిశెట్టి(28) మూడేళ్ల క్రితం ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ నుంచి ఓ ఫ్యాన్సీ నంబర్ తీసుకున్నాడు. గతనెల 17న థాయ్‌లాండ్‌కు వెళ్లిన రాకేష్ తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశాడు. అనంతరం 21వ తేదీన నగరానికి వచ్చిన అతను ఫోన్‌ను ఆన్ చేసి చూడగా నో సర్వీస్ అని వచ్చింది. దీంతో వొడాఫోన్ స్టోర్‌కి వెళ్లాడు. డాక్యుమెంట్లు ఇస్తే కొత్త నంబర్ ఇస్తామని వారు చెప్పడంతో పత్రాలన్నీ ఇచ్చి 3 రోజుల తర్వాత వెళ్లి నంబర్ తీసుకున్నాడు. అయితే ఆ నంబరూ నో సర్వీస్ అనే వచ్చింది. దీంతో వొడాఫోన్ నోడల్ ఆఫీస్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. ఒడిశాలోని వొడాఫోన్ స్టోర్‌లో నంబర్‌ను రీప్లేస్మెం ట్ చేసుకోవాలని చెప్పారు. అతని పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు ఫోర్జరీ చేసి నంబర్ దొంగిలించారని, అందువల్ల అక్కడికే వెళ్లి రీప్లేస్ చేసుకోవాలని సూచించారు. దీంతో తన పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు ఫోర్జరీ చేసి తన ప్రమేయం లేకుండానే తన ఫ్యాన్సీ నంబర్‌ను తస్కరించారని రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు ఐపీసీ సెక్షన్లు 420, 468, 471 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నటుడు చలపతిరావు కేసు బదిలీ..
బంజారాహిల్స్: మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన సినీనటుడు చలపతిరావు కేసును చాదర్‌ఘాట్ పోలీసులు శనివారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. గత మే నెల 18వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నెం2లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో పాల్గొన్న చలపతిరావు ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చే క్రమంలో మహిళలను కించపరిచేలా మాట్లాడారు. ఈ సంఘటనపై అదే రోజు చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది. దీంతో చాదర్‌ఘాట్ పోలీసులు కేసును జూబ్లీహిల్స్‌కు బదిలీ చేశారు. జూబ్లీహిల్స్‌పోలీసులు విచారణ ప్రారంభించారు. -
కదులుతున్న ‘గంజాయి’ డొంక!
⇒ ‘సాక్షి’ కథనంతో కదిలిన పోలీసులు ⇒ బెంజ్ కారు నడిపింది సాత్విక్‌రెడ్డిగా గుర్తింపు హైదరాబాద్: కేబీఆర్ పార్క్ గేట్ వద్ద శనివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం డొంక కదులుతోంది. ఈ ఉదంతంపై ‘‘బెంజ్‌లో గం‘జాయ్’’పేరుతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పోలీసు విభాగం స్పందించింది. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది జడ్జర్లకు చెందిన రియల్టర్ కుమారుడిగా గుర్తించి ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో మాదకద్రవ్య నిరోధక చట్టంతో పాటు ఇతర సెక్షన్లనూ జోడించారు. (చదవండి: బెంజ్‌లో గం‘జాయ్’!) జూబ్లీహిల్స్ రోడ్ నెం.31కు చెందిన ఎం.అనిల్‌కుమార్‌రెడ్డి శనివారం ఉదయం కేబీఆర్ పార్క్‌కు వాకింగ్ కోసం వచ్చి గేట్ నెం.2 వద్ద తన బీఎండబ్ల్యూ కారును ఆపారు. అదే సమయంలో జూబ్లీహిల్స్ నుంచి ఫిల్మ్‌నగర్ వైపు వేగంగా దూసుకువచ్చిన బెంజ్ కారు ఈ వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టింది. బీఎండబ్ల్యూ బాగా దెబ్బతినగా... బెంజ్‌లో ఉన్న ముగ్గురు యువకుల్ని వెనుక వచ్చిన మరో కారులోని వారు ఎక్కించుకుని ఉడాయించారు. వాకింగ్ చేస్తున్నవాళ్లు బెంజ్ కారును పరిశీలించగా.. అందులో పొగతో పాటు మద్యం సీసాలు, గంజాయి కనిపించాయి. పోలీసుల్నీ తప్పుదోవ పట్టించారు... ఇదిలా ఉండగా... సదరు బెంజ్ కారులో ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, తాజా మంత్రి సంబంధీకులు ఇలా వీవీఐపీల బిడ్డలే ఉన్నారు. దీంతో కేసు నుంచి బయటపడటానికి వారు పోలీసుల్నీ తప్పుదోవ పట్టించారు. సైదాబాద్‌కు చెందిన రాఘవేంద్రరెడ్డి వీరిలో ఒకరి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీవీఐపీల బిడ్డలు అతడిని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌కు పంపి లొంగిపోయేలా చేశారు. అతడు మద్యం తాగినట్లు నిరూపితం కాకపోవడంతో ఈ కేసు సాధారణ ప్రమాదంగా నమోదైంది. అయితే ‘సాక్షి’కథనంతో రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ డీసీపీ ఎం.వెంకటేశ్వరరావు ఘటనాస్థలిని పరిశీలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా... ప్రమాదం జరిగిన సమయంలో సాత్విక్‌రెడ్డి అనే యువకుడు బెంజ్ కారు నడుపుతున్నట్లు గుర్తించారు. రియల్టర్ కుమారుడు అరెస్టు... జడ్జర్లకు చెందిన రియల్టర్ బాల్‌రెడ్డి కుమారుడైన సాత్విక్ అమెరికాలో బీబీఏ విద్యనభ్యసిస్తున్నాడు. ఇటీవల నగరానికి వచ్చిన ఇతడు తన స్నేహితులైన వీవీఐపీల బిడ్డలకు శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌లో పార్టీ ఇచ్చాడు. ఈ విందుకు మాజీ ముఖ్యమంత్రి కుమారుడితో పాటు తాజా, మాజీ మంత్రుల కుమారులు హాజరయ్యారు. శనివారం ఉదయం మద్యం, గంజాయి మత్తులో ఉన్న సాత్విక్ ఫిల్మ్‌నగర్‌కు చెందిన తన స్నేహితుడిని విడిచిపెట్టడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తేలింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం సాత్విక్‌ను అరెస్టు చేశారు. ఈ ఉదంతంలో రాఘవేంద్రరెడ్డి ప్రమేయం లేదని తేలింది. అదనపు సెక్షన్లు జోడింపు... ఈ కేసును ఆల్టర్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీలోని 279, ఎంవీ యాక్ట్‌లోని 185తో పాటు మాదకద్రవ్య నిరోధక చట్టం (ఎన్డీపీఎస్ యాక్ట్)లోని 20(బీ)(2)(ఎ) సెక్షన్‌ను అదనంగా జోడించారు. ఈ ఘటనకు కారకులైన వారు ఎంత ప్రముఖులైనా వదిలిపెట్టవద్దని డీసీపీ వెంకటేశ్వరరావు స్థానిక పోలీసులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ ఘటన పూర్వాపరాలపై లోతుగా దర్యాప్తు చేస్తామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లేందుకు అడ్డదారులు
బంజారాహిల్స్: అడ్డదారుల్లో అమెరికాకు వెళ్లేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..వరంగల్‌కు చెందిన వడ్డె విద్యాసాగర్ వీసా ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్, మాదిరెడ్డి హర్షవర్దన్‌రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు అమెరికాకు వెళ్లేందుకు వీసా కోసం అతనితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకుగాను రూ.30 వేలు ప్రాసెసింగ్ ఫీజుగా తీసుకున్న విద్యాసాగర్ మిగతా రూ. 1.50 లక్షలు వీసా వచ్చిన తర్వాత ఇవ్వాలని సూచించాడు. అమెరికాలో జరిగే నాటా, ఆటా, తదితర సమావేశాలు, వివిధ కార్యక్రమాలకు వెళ్లేవారిలో కొందరు జర్నలిస్టులను కూడా పంపిస్తుంటారు. దీనిని అనుకూలంగా మార్చుకున్న విద్యాసాగర్ ఓ టీవీ చానెల్ ప్రతినిధులుగా వారి పేర్లపై సిఫారసు లేఖలను తయారు చేయించి వీసాకు దరఖాస్తు చేశారు. స్టాంపింగ్‌కు వెళ్లిన దరఖాస్తులను పరిశీలించిన ఎంబసీ అధికారులు సదరు చానల్‌ను ఫోన్ చేసి ఆరా తీయడంతో గుట్టురట్టయింది. దీంతో అనిల్‌కుమార్, హర్షవర్ధన్‌రెడ్డితో పాటు విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ చీటింగ్‌లో మరొకరు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదు
నటి విజయనిర్మల ఫిర్యాదు రియల్ఎస్టేట్ సంస్థ నిర్వాహకులపై కేసు నమోదు బంజారాహిల్స్: వ్యాపారంలో ఇబ్బందులున్నాయని నమ్మించి కోటి రూపాయలు హ్యాండ్‌లోన్ తీసుకొని ముఖం చాటేసిన ఓ కన్‌స్టక్ష్రన్ కంపెనీ నిర్వాహకులపై సినీదర్శక నిర్మాత, నటి జి. విజయనిర్మల కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు వారిపై కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నారుు.. నానక్‌రాంగూడలో నివసించే నటుడు జిఎస్ఆర్ కృష్ణమూర్తి(కృష్ణ) సతీమణి విజయనిర్మలకు విజన్ మెడోస్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ ఆర్. శ్రీనివాసరాజు, ముదునూరి భద్రిరాజు, ముదునూరి సీతారామరాజులతో దాదాపు 20ఏళ్లుగా పరిచయం ఉంది. 2007లో తమకు వ్యాపారంలో కొంత ఇబ్బందులు వచ్చాయని ఇందుకు కోటి రూపాయలు హ్యాండ్లోన్గా కావాలని వారు విజయనిర్మలను కోరారు. ఇందుకు అంగీకరించిన ఆమె మూడు విడతలుగా ఫిలింనగర్‌లోని ఆంద్రాబ్యాంకు చెక్కుల ద్వారా డబ్బులు ఇచ్చారు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు కోరినా చెల్లించకుండా కాలయాపన చేశారు. వారు ఇచ్చిన చెక్కులను ఫిలింనగర్‌లోని ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేయగా అందులో డబ్బులు లేవంటూ బ్యాంకు ఆ చెక్కులను తిరస్కరించింది. ఈ విషయంలో వారిని ఎన్నిసార్లు ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కోర్టు కేసు నమోదు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. పోలీసులు సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరాజు, మదునూరి భద్రిరాజు, మదునూరి సీతారామరాజులపై ఐపీసీ సెక్షన్ 420, 406, 156(3) సీఆర్పీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ ఐఫోన్ల తయారీ ముఠా అరెస్టు
హైదరాబాద్ : నకిలీ ఐఫోన్ల తయారి చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాగుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం రట్టు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం ఢిల్లీకి చెందిన ప్రిన్స్ మల్హోత్రా అలియాస్ సోను (22), అమన్ నాగ్‌పాల్ అలియాస్ అర్మాన్ మాలిక్ (23), జితిన్ మున్ని, ధ్రువ్, నాకుల్, సత్యం తదితరులు ఏడుగురు నెలన్నరగా నగరంలోని మాదాపూర్‌లో నివసిస్తున్నారు. ఐఫోన్లను పోలిన నకిలీ ఫోన్లు తయారు చేస్తూ వాటికి పత్రాలు కూడా సృష్టించి వివిధ షాపులలో రీప్లేస్మెంట్ చేస్తూ కొత్త వాటిని తీసుకుని.... వాటిని కూడా విక్రయిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్- 45లోని ఆప్ట్రానిక్స్‌లో ఇటీవల ఓ నకిలీ ఐ ఫోన్‌ను రీప్లేస్ చేస్తూ సదరు వ్యక్తులు దొరికిపోయారు. షాపు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో... వారిని అదుపులోకి తీసుకుని ... పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పట్టుబడిన సోను, అమన్నాగ్పాల్ను విచారించగా తాము ఢిల్లీలోని జఫర్‌మార్కెట్ నుంచి వాటిని తీసుకొస్తున్నామని వెల్లడించారు. వారిద్దరి నుంచి దాదాపు 20 నకిలీ ఐఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా అయిదుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జూబ్లీహిల్స్‌లో బైక్ రేసింగ్‌లు అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో బైక్ రేసింగులు చేస్తున్న యువకులను ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో పోలీసులపై సదరు యువకులు చిందులు తొక్కారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు బైక్ రేసింగులకు పాల్పడుతున్న 16 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 16 బైకులతోపాటు రెండు కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని... పోలీస్ స్టేషన్‌కు తరించారు. యువకుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పోలీసులు పిలిపించారు. వారి సమక్షంలో యువకులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.