అమెరికా వెళ్లేందుకు అడ్డదారులు
బంజారాహిల్స్: అడ్డదారుల్లో అమెరికాకు వెళ్లేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..వరంగల్‌కు చెందిన వడ్డె విద్యాసాగర్ వీసా ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్, మాదిరెడ్డి హర్షవర్దన్‌రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు అమెరికాకు వెళ్లేందుకు వీసా కోసం అతనితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకుగాను రూ.30 వేలు ప్రాసెసింగ్ ఫీజుగా తీసుకున్న విద్యాసాగర్ మిగతా రూ. 1.50 లక్షలు వీసా వచ్చిన తర్వాత ఇవ్వాలని సూచించాడు.
అమెరికాలో జరిగే నాటా, ఆటా, తదితర సమావేశాలు, వివిధ కార్యక్రమాలకు వెళ్లేవారిలో కొందరు జర్నలిస్టులను కూడా పంపిస్తుంటారు. దీనిని అనుకూలంగా మార్చుకున్న విద్యాసాగర్ ఓ టీవీ చానెల్ ప్రతినిధులుగా వారి పేర్లపై సిఫారసు లేఖలను తయారు చేయించి వీసాకు దరఖాస్తు చేశారు. స్టాంపింగ్‌కు వెళ్లిన దరఖాస్తులను పరిశీలించిన ఎంబసీ అధికారులు సదరు చానల్‌ను ఫోన్ చేసి ఆరా తీయడంతో గుట్టురట్టయింది. దీంతో అనిల్‌కుమార్, హర్షవర్ధన్‌రెడ్డితో పాటు విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ చీటింగ్‌లో మరొకరు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.