
వందలాది మంది విదేశీ విద్యార్థులకు ఈ మెయిళ్లు
పాలస్తీనియన్లకు, అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు పలికినందుకు ట్రంప్ సర్కార్ ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక విధానాలను సమరి్థంచే వాళ్లెవరూ ఇక్కడ ఉండొద్దని, తక్షణం వెళ్లిపోవాలంటూ వందలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా ప్రభుత్వం హఠాత్తుగా రద్దుచేసింది. వీసా రద్దయిన నేపథ్యంలో కస్టమ్స్, అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) యాప్ లో నమోదుచేసుకుని స్వీయబహిష్కరణ ద్వారా అమెరికాను వదిలివెళ్లాలంటూ ఆయా వి ద్యార్థులకు ఈ–మెయిళ్లు, టెక్ట్స్ సందేశాలను పంపించింది. ఇలా బహిష్కరణ సందేశాలను అందుకున్న వారిలో భారతీయ విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో అక్కడ విద్యనభ్యసిస్తున్న లక్షలాది భారతీయ విద్యార్థుల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగాయి. గాజా యుద్ధంలో హమాస్‌కు, పాలస్తీనియన్లకు మద్దతు పలకడం, ఇజ్రాయెల్‌ను విమర్శించడం, యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ సంబంధిత సోషల్ మీడియా పోస్ట్‌లను సోషల్ మీడియా ఖాతాల్లో లైక్ చేయడం, షేర్ చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారి వీసాలను రద్దుచేశామని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్(డీఓఎస్) ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్–1 వీసాను రద్దుచేస్తూ సంబంధిత విద్యార్థులకు ఈమెయిల్ పంపించింది.
ఈ సందర్బంగా ‘‘అమెరికా శరణార్థి, జాతీయత చట్టంలోని సెక్షన్ 221(ఐ) ప్రకారం మీ ఎఫ్–1 వీసా గడువును తక్షణం ముగిస్తున్నాం. అమెరికాను వీడటానికి ముందు కచ్చితతంగా అమెరికా ఎంబసీ/కాన్సులేట్‌లో మీ పాస్‌పోర్ట్‌ను చూపించండి. వాళ్లు మీ వీసాను స్వయంగా రద్దు చేస్తారు. ఆ తర్వాత సీబీపీ యాప్ సాయంతో స్వీయబహిష్కరణ విధానాన్ని వాడుకుని అమెరికాను వీడండి. అలా వెళ్లకపోతే మీమే మిమ్మల్ని బలవంతంగా బహిష్కరిస్తాం. మేం పంపితే మీ స్వదేశానికే పంపకపోవచ్చు. మా వీలును బట్టి మాకు అనువైన మరేదైనా దేశానికి తరలించే వీలుంది’’ అని ఈ–మెయిల్ సందేశంలో ప్రభుత్వం పేర్కొంది. 2023–24 ఏడాదికి విదేశీ విద్యార్థులకు సంబంధించిన ‘ఓపెన్ డోర్స్’నివేదిక ప్రకారం అమెరికాలో 11 లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారు. వారిలో 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులే.
