
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పౌరసత్వం విషయంలో ట్రంప్ కొత్త ప్లాన్ రూపొందించారు. పెట్టుబడిదారుల పౌరసత్వానికి ‘గోల్డ్ కార్డ్’ వీసాను తీసుకొస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో ఐదు మిలియన్ డాలర్ల(భారత కరెన్సీ ప్రకారం దాదాపు 44కోట్లు) పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేస్తామని ట్రంప్ తెలిపారు.
అమెరికాలో పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన వీసా(ఈబీ-5 వీసా) పాలసీని మార్చే యోచనలో ఉన్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేస్తామన్నారు. ఈ వీసాను ఐదు మిలియన్ డాలర్లను వెచ్చించి పొందాల్సి ఉంటుందన్నారు. ఈ వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో ధనవంతులై ప్రభుత్వానికి పన్నులు చెల్లించే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు. ఇది గ్రీన్ కార్డు తరహా సౌలభ్యాలను ఇస్తుందని, ఇది అమెరికన్ పౌరసత్వానికి ఒక మార్గం కాబోతుందన్నారు. ఈ కార్డును కొనుగోలు చేయడం ద్వారా సంపన్నులు తన దేశంలోకి వస్తారని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను మరో రెండు వారాల్లో వెల్లడిస్తామని తెలిపారు. ఈ మేరకు తాజాగా అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సమక్షంలో ఓవల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకం చేశారు.
కాగా.. ఈ తరహా ‘గోల్డెన్ వీసా’లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. తాజాగా ట్రంప్ కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేయనున్నారు.
BREAKING:
Trump announces USA will start selling gold cards in 2 weeks.
“We're gonna put a price on that card of about $5 million and that's going to give you green card privileges plus.
It's going to be a route to citizenship and wealthy people will come to our country” pic.twitter.com/OJnhFLeWAL— Visegrád 24 (@visegrad24) February 25, 2025
ఈబీ-5 వీసా అంటే?
యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెబ్‌సైట్ ప్రకారం, ఈబీ-5 వీసా విధానాన్ని.. ఉద్యోగ కల్పన-విదేశీ పెట్టుబడిదారుల మూలధన పెట్టుబడుల ద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 1990లో కాంగ్రెస్ ఆమోదించింది. 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబరు 30వ తేదీ వరకు దాదాపు 8వేల మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. ఈబీ-5 ద్వారా పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వాములు.. 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అవివాహిత పిల్లలు నాన్-టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (టీఈఏ) ప్రాజెక్టులో 1.8 మిలియన్ డాలర్లు లేదా టీఈఏ ప్రాజెక్టులో కనీసం 800,000 డాలర్లు పెట్టుబడి పెడితే శాశ్వత నివాసానికి అర్హులు. అయితే, ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని అధికారులు గుర్తించారు.
జన్మతః పౌరసత్వం రద్దు..
అంతకుముందు.. రెండోసారి అమెరికా అధ్యక్షుడి ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత జన్మతః పౌరసత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment