Foreign Studies
-
Foreign Students: వుయ్ ఆర్ విదేశీ
భాగ్యనగరం.. రోజూ వేలాది మంది నగరానికి వస్తుంటారు. వారందరికీ హైదరాబాద్ పట్నం.. ఓ కల్పతరువులా మారుతోంది. ఎవరు వచి్చనా అందరినీ ఆదుకుంటుంది.. ఆదరిస్తుంటుంది. ఇలా రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, వేరే రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తుంటారు. వారందరినీ హైదరాబాద్ అక్కున చేర్చుకుంటోంది.. వ్యాపారం, పర్యాటకం కోసమే కాకుండా పై చదువుల కోసం కూడా ఇక్కడికి వస్తున్నారు. వీరందరినీ అమ్మలా ఆదరిస్తోంది భాగ్యనగరం.. వారంతా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, భాషపై ఎంతో మక్కువ చూపిస్తున్నారు. మన సంస్కృతిని అలవర్చుకుంటున్నారు. ఇక్కడి వారితో స్నేహం చేస్తూ.. కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. వేర్వేరు దేశాల నుంచి.. వేర్వేరు సంస్కృతుల నుంచి తమ కలలను సాకారం చేసుకునేందుకు ఎల్లలు దాటి ఇక్కడికి వచ్చిన కొందరు విదేశీ విద్యార్థుల మనోగతం తెలుసుకుందాం.. దేశం కాని, దేశం.. భాష కాని భాష.. అనుకోకుండా కొందరు.. ఇష్టంతో కొందరు ఇలా ఎంతో మంది భాగ్యనగరం గడ్డపై అడుగుపెట్టారు. కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త ఆహారం ఇక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయం.. అనుమానం.. వాటన్నింటినీ భాగ్యనగరం ప్రజలు, వాతావరణం పటాపంచలు చేశాయి. కొత్త, వింత అనుకున్న సంస్కృతి, సంప్రదాయమే ఇప్పుడు వారికి ఎంతో ఇష్టంగా మారిపోయింది. ఈ సంస్కృతిలో భాగమవుతున్నారు. ఎలాంటి భయం లేకుండా మాతృభూమిపై ఉన్నట్టుగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. తెలుగుతో పాటు ఉర్దూ భాషలపై మమకారం పెంచుకుని వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూసి మురిసిపోతున్నారు. ఎంతోమంది స్నేహితులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజీల్లో విదేశీ విద్యార్థులకు డిగ్రీ, పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరేందుకు వేలాది మంది ఇక్కడికి వచ్చి కాలేజీల్లో చేరుతున్నారు. నిజాం కాలేజీలోనే దాదాపు 300 మంది విద్యార్థులు ఏటా వస్తున్నారని చెబుతున్నారు. ఇక, వేరే కాలేజీలు, యూనివర్సిటీలు కలిపి 2 వేలకు పైగా విద్యార్థులు ఏటా వస్తున్నారు. నిబద్ధతతో నేర్చుకుంటారు.. ఇక్కడికి వచ్చే విదేశీ విద్యార్థులు పాఠాలను ఎంతో నిబద్ధతతో నేర్చుకుంటారు. ఏటా వందలాది మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి వస్తుంటారు. ఇక్కడ చదువుకుని వెళ్లిన వారు వారి బంధువులకు కూడా ఈ కాలేజీ గురించి చెప్పి ఇక్కడికి పంపిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారు మంచి ఉద్యోగాలు సాధించామని ఫోన్ చేసి చెబుతుంటారు. ఇక్కడి పిల్లలతో కలిసిపోతుంటారు. విదేశీ విద్యార్థులకు కాలేజీలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా మేం చూసుకుంటాం. – ప్రొ.మహ్మద్ అబ్దుల్ అలీ, విదేశీ విద్యార్థలు కో–ఆర్డినేటర్, నిజాం కాలేజీ ఫీజులు కాస్త తక్కువ.. తమ దేశాలతో పోలిస్తే ఇక్కడ ఫీజులు కాస్త తక్కువగా ఉండటమే కాకుండా, చదువు కూడా క్వాలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. సుడాన్, తుర్కెమెనిస్తాన్, యెమెన్, సోమాలియా వంటి దేశాల నుంచి ఎక్కువగా వస్తుంటారని నిజాం కాలేజీ విదేశీ విద్యార్థుల కో–ఆర్డినేటర్ మహ్మద్ అబ్దుల్ అలీ తెలిపారు. స్థానిక విద్యార్థులు కూడా విదేశీ విద్యార్థులతో కలివిడిగా ఉంటూ, వారికి ఏ అవసరం ఉన్నా కూడా సాయపడుతున్నారు. భాష సమస్య ఉన్నా కూడా అందరూ కలిసిమెలిసి ఉంటామని, ఇంగ్లి‹Ùలో కమ్యూనికేట్ అవుతుంటామని నిజాం కాలేజీలోని పలువురు విదేశీ విద్యార్థులు పేర్కొన్నారు. తమకు ఇక్కడి వారు చాలా మంది స్నేహితులు ఉన్నారని, సెలవులు ఉన్నప్పుడు వారితో హైదరాబాద్‌లోని సందర్శనీయ ప్రదేశాలకు వెళ్లి వస్తుంటామని వివరించారు.సంస్కృతి చాలా ఇష్టం..హైదరాబాద్ సంస్కృతి అంటే చాలా ఇష్టం. మట్టిగాజులు, మెహందీ మా దేశంలో ఎవరూ వేసుకోరు. కానీ నాకు వాటిపై ఎంతో ఇష్టం పెరిగింది. అందుకే ఎప్పుడూ మెహందీ పెట్టుకుంటాను. గాజులు వేసుకుంటాను. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల గురించి ఫ్రెండ్స్‌ను అప్పుడప్పుడూ అడిగి తెలుసుకుంటాను. భారత్‌కు ముఖ్యంగా హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉంది. – దుర్సుంజెమల్ ఇమ్రుజకోవా, బీఏ ఫస్ట్ ఇయర్, నిజాం కాలేజీ, తుర్క్మెనిస్తాన్సొంతూర్లో ఉన్నట్టే.. ఇక్కడ చదువుకున్న ఓ బంధువు నిజాం కాలేజీ గురించి చెబితే ఇక్కడ చేరాను. మొదట్లో ఇక్కడి వాతావరణం, ఆహరంతో కాస్త ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇప్పుడు అలవాటైంది. స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్‌లో ఉంటాం. మా వంట మేమే చేసుకుంటాం. అప్పుడప్పుడూ ఇక్కడి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి.. హైదరాబాద్ రుచులను ఆస్వాదిస్తుంటాం. చారి్మనార్, గోల్కొండ కోట వంటి ప్రదేశాలకు చాలాసార్లు వెళ్లాం. – మహ్రీ అమన్దుర్దీయువా, బీఏ థర్డ్ ఇయర్, నిజాం కాలేజీ, తుర్క్మెనిస్తాన్చాలా సంతోషంగా ఉంది.. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా.. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. ఇక్కడి వారితో పాటు మా దేశం నుంచి వచి్చన ఫ్రెండ్స్‌తో టైం పాస్ చేస్తుంటాం. ఇక్కడి ఫుడ్, కల్చర్ చాలా నచి్చంది. – అనస్, బీఏ ఫస్ట్ ఇయర్, సూడాన్ -
టోఫెల్ అర్హతతో కెనడాలోనూ చదవొచ్చు
న్యూఢిల్లీ: టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్) స్కోరు ఆధారంగా విదేశీ విద్యార్థులు కెనడాలోనూ ఉన్నత విద్యనభ్యసించవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) తెలిపింది. కెనడా ప్రభుత్వ ‘స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్డీఎస్)’పథకంలో భాగంగా ఉన్నత విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులకు ఇకపై టోఫెల్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొంది. ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా(ఐఆర్సీసీ) ఇందుకు ఆమోదం తెలిపిందని వెల్లడించింది. ఇప్పటి వరకు ఎస్డీఎస్లో ఇంగ్లిష్ అర్హత పరీక్షగా ఐఈఎల్‌టీఎస్‌కు మాత్రమే ఆప్షన్ ఉండేది. ఈ ఏడాది ఆగస్ట్ 10వ తేదీ నుంచి ఎస్డీఎస్కు దరఖాస్తు చేసుకునేవారు టోఫెల్ స్కోరును కూడా జత చేసుకోవచ్చని వివరించింది. ఎస్డీఎస్ దరఖాస్తుల పరిశీలన దాదాపు 20 రోజుల్లోనే పూర్తవుతుందని ఈటీఎస్ పేర్కొంది. కాగా, టోఫెల్‌ను అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర 160కి పైగా దేశాలకు చెందిన 12 వేల సంస్థలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. -
విదేశాలకు వెళ్లాలనుకునే వారికి గుడ్‌న్యూస్..ఇకపై రెండు గంటల్లోనే ‘టోఫెల్’
న్యూఢిల్లీ: విదేశీ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఉపకరించే ‘టోఫెల్’ పరీక్ష ఇకపై రెండు గంటలలోపే ముగియనుంది. ప్రస్తుతం ఈ పరీక్షను మూడు గంటలపాటు నిర్వహిస్తున్నారు. అధికారిక స్కోర్‌ను విడుదల చేసే తేదీని టోఫెల్ పూర్తికాగానే అభ్యర్థులు తెలుసుకోవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఈటీఎస్) వెల్లడించింది. టోఫెల్ ఒక గంట 56 నిమిషాల పాటు ఉంటుందని పేర్కొంది. టోఫెల్లో చేస్తున్న మార్పులు ఈ ఏడాది జూలై 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. టోఫెల్ స్కోర్‌ను 160కిపైగా దేశాల్లో 11,500కిపైగా యూనివర్సిటీలు అంగీకరిస్తున్నాయి. ఇందులో అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని వర్సిటీలు ఉన్నాయి. టోఫెల్ రిజి్రస్టేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నట్లు ఈటీఎస్ సీఈవో అమిత్ సేవక్ తెలిపారు. టెస్టు ఫీజును భారతీయ రూపాయల్లో చెల్లించవచ్చని సూచించారు. టోఫెల్ ప్రక్రియలో తీసుకొస్తున్న మార్పులతో లక్షలాది మంది భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అసోసియేషన ఆఫ్ ఆ్రస్టేలియన్ ఎడ్యుకేషన్ రిప్రజంటేటివ్స్ ఇన్ ఇండియా అధ్యక్షుడు నిశిధర్‌రెడ్డి బొర్రా వివరించారు. చదవండి: పోతపోసిన పోస్టాఫీస్...! -
ఆన్లైన్ ఎంచుకుంటే అమెరికా రావద్దు
వాషింగ్టన్: వీసా విధానంలో రోజుకో మార్పు తీసుకువస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థుల అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా విద్యా సంస్థల్లో ఆన్లైన్ మాధ్యమంలో బోధనను ఎంపిక చేసుకునే కొత్త విద్యార్థులెవరినీ దేశంలోకి రానివ్వకూడదని ఆయన నిర్ణయించారు. ఈ సెప్టెంబర్ నుంచి మొదలయ్యే సెమిస్టర్లో ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులెవరూ దేశంలోకి అడుగు పెట్టకూడదని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ (ఐసీఈ) ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికి కటాఫ్ తేదీని మార్చి 9గా నిర్ణయించింది. ఆ తేదీ తర్వాత కొత్త విద్యార్థులెవరైనా ఆన్లైన్ బోధనా పద్ధతుల్ని ఎంపిక చేసుకుంటే అమెరికా రావడానికి వీల్లేదని ఐసీఈ స్పష్టం చేసింది. కొత్తగా జాయిన్ అయిన విదేశీ విద్యార్థులెవరికీ ఫారమ్ 1–20 జారీ చేయవద్దంటూ దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను హోంల్యాండ్ సెక్యూరిటీలోని స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్ఈవీపీ) ఆదేశించింది. స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆ ఫారమ్స్ అత్యంత కీలకం. ఈ విద్యా సంవత్సరంలో భారత్‌కు చెందిన విద్యార్థులకే అత్యధికంగా అమెరికా విద్యాసంస్థల్లో సీటు వచ్చింది. కొత్తగా సీటు వచ్చిన భారతీయ విద్యార్థులు దాదాపుగా 2 లక్షల మంది వరకు ఉండవచ్చునని ఒక అంచనా. అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశీయ, విదేశీ విద్యార్థులు ఎక్కువ మంది ఆన్లైన్ బోధనా పద్ధతుల్ని ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికాలో ఉంటూ ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు ఇచ్చి సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో తన నిర్ణయాన్ని ట్రంప్ సర్కార్ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. విద్యా సంస్థల్ని బలవంతంగానైనా తెరిపించడానికే ట్రంప్ ఇలా రోజుకో వివాదాస్పద నిర్ణయం తీసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. డీఏసీఏ దరఖాస్తులూ పెండింగ్‌లో చిన్నతనంలో అమెరికాకి వచ్చి, యుక్త వయసు వచ్చాక ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) దరఖాస్తులని సర్కార్ పెండింగ్‌లో ఉంచింది. గత నెలలో సుప్రీం కోర్టు డీఏసీఏని ఆపేయడం సరికాదని వ్యాఖ్యానించినప్పటికీ సర్కార్ పెడచెవిన పెట్టింది. మేరీల్యాండ్‌లో అమెరికా జిల్లా కోర్టు డీఏసీఏని తిరిగి పాత పద్ధతిలోకి తీసుకురావాలని ఆదేశించిన నేపథ్యంలో ఆ దరఖాస్తులన్నీ పెండింగ్‌లో ఉన్నట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్క్ పర్మిట్లలోనూ జాప్యం అమెరికాలో హెచ్4 వీసాలపై ఉన్న జీవిత భాగస్వాములకు పని చేయడానికి వీలుగా జారీ చేసే వర్క్ పర్మిట్లలోనూ∙జాప్యం జరుగుతోంది. ఈ మేరకు భారత్‌కు చెందిన మహిళ రంజిత సుబ్రహ్మణ్యం ఓహియో ఫెడరల్ కోర్టుకెక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న తనకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)కి ఆమోదించినప్పటికీ ఇప్పటివరకు తనకు అది అందలేదని ఆమె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అంతకు ముందు ఉన్న ఈఏడీ గడువు జూన్‌లో ముగిసిపోవడం, కొత్తది అం దకపోవడంతో తాను ఉద్యోగాన్ని కోల్పోయానని తెలిపారు. సాధారణంగా వర్క్ పర్మిట్‌కు అనుమతి వచ్చిన రెండు రోజుల్లోనే ఈఏడీ కార్డుని వారికి పం పాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 75 వేల కార్డులు ప్రింట్ కాకుండా పెండింగ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. -
యూఎస్.. ప్లాన్ రివర్స్
సాక్షి, సిటీబ్యూరో: అమెరికా విద్యాలయాల్లో ఆన్లైన్ క్లాసులు హాజరవుతున్న గ్రేటర్ విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. సెప్టెంబరు–డిసెంబరు సెమిస్టర్‌ను ఆన్లైన్లో చదవాలనుకుంటున్న విద్యార్థులు సొంత దేశం వెళ్లాలని తాజాగా ట్రంప్ సర్కారు హుకుం జారీచేయడం ఈ ఆందోళనకు కారణమైంది. తాజా నిర్ణయంతో అమెరికాలో విద్యనభ్యసిస్తున్న సుమారు 25 వేల మంది విద్యార్థులకు పిడుగుపాటులా మారింది. దేశం విడిచి వెళ్లకుంటే.. క్యాంపస్‌లో తరగతులు బోధించే విద్యాలయాలకు బదిలీ కావాలని ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. తక్షణం బదిలీ కావడం కత్తిమీద సాములా మారుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆన్లైన్లో క్లాసులు హాజరయ్యే విద్యార్థులకు విదేశాంగ శాఖ సైతం వీసాలను మంజూరు చేయదని ఐసీఈ పేర్కొనడం గమనార్హం.(అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ప్రభుత్వ అండ) వేలాది మంది విద్యార్థులపై పిడుగు.. అమెరికాలో సుమారు 12 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు 8,700 విద్యాలయాల్లో చదువుతున్నారు. వీరిలో భారతీయ విద్యార్థులు సుమారు 3.60 లక్షలమంది ఉండగా.. రెండు రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులు సుమారు 60 వేలు.. అందులో హెచ్ఎండీఏ పరిధిలోని విద్యార్థులు సుమారు 25 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా.. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఈ విద్యార్థులు ఒకవేళ స్వస్థలాలకు తిరిగి వస్తే తిరిగి అమెరికా వెళ్లడం కష్టసాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా రాయబార కార్యాలయాల్లో అమెరికా వీసా ప్రక్రియను నిలిపివేయడం తెలిసిందే. ఇక ఆన్లైన్లో బోధించే విద్యాలయాలు పాక్షికంగానైనా తరగతి గదుల్లో బోధనకు శ్రీకారం చుడితే మన సిటీ విద్యార్థులు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. భారంకానున్న విద్యారుణాలు.. అమెరికాలో విద్యాభ్యాసం చేసేందుకు నగరానికి చెందిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పలు వాణిజ్య, ప్రైవేటు బ్యాంకుల నుంచి తమ శక్తికి మించి రూ.25 నుంచి రూ.50 లక్షల దాకా విద్యా రుణాలు తీసుకున్నారు. వీరిలో మధ్యతరగతి వేతన జీవులే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తమ పిల్లలు సొంతగూటికి తిరిగి వస్తే వారి కోర్సులు పూర్తయినా.. అమెరికాకు తిరిగి వెళ్లడం.. అమెరికాలో ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండని కారణంగా విద్యారుణాలు తీర్చడం కష్టసాధ్యమవుతుందని పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసులు నిర్వహించే విద్యాలయాలు తక్షణం తరగతి గదుల్లో బోధన ప్రారంభించాలని కోరుతున్నారు. ఈమేరకు ఆయా విద్యాలయాలకు ఈమెయిల్స్ పంపినట్లు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ‘సాక్షి’కి తెలిపారు. -
అక్కడ చదివొచ్చి.. ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు..!
సాక్షి, హైదరాబాద్: విదేశీ వైద్య విద్య స్వదేశంలో నిలబడ లేకపోతోంది. వివిధ దేశాల్లో ఎంబీబీఎస్ చదివిన చాలా మంది భారతీయులు ఇక్కడ లైసెన్స్ పొందడంలో విఫలమవుతున్నారు. విదేశీ ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్న దాదాపు 85 శాతం మంది విద్యార్థులు దేశంలో ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ ఇచ్చే పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమయ్యారని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక తెలిపింది. 2015 నుంచి 2018 మధ్య నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) కోసం సుమారు 61,500 మంది విదేశీ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు హాజరయ్యారు. వీరిలో కేవలం 8,700 మంది మాత్రమే అర్హత సాధించగలిగారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. వీరిలో ఎక్కువ మంది స్వదేశంలో సీటు పొందడంలో విఫలమైన తరువాత ఎంబీబీఎస్ చదవడానికి విదేశాలకు వెళ్లిన విద్యార్థులేనని నివేదిక పేర్కొంది. అమెరికా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మినహా ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు దేశంలో ప్రాక్టీస్ చేయడానికి, ఏదైనా ఆసుపత్రిలో పని చేయడానికి ఎఫ్ఎంజీఈ పరీక్ష పాస్ అవ్వాలనేది నిబంధన. గత ఆరేళ్లలో ఎఫ్ఎంజీఈని క్లియర్ చేసిన విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 2012–13లో 28.29 నుంచి 2016–17లో 9.44 కనిష్టానికి చేరుకుందని ఆ నివేదిక పేర్కొంది. వాస్తవానికి అఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, జర్మనీ, హైతీ, హంగరీ, థాయ్‌లాండ్, జాంబియా తదితర దేశాల్లో చదివిన ఏ ఒక్క ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ కూడా ఈ పరీక్షను క్లియర్ చేయలేకపోయారని కేంద్రం ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో మెడికల్ కాలేజీలలో తక్కువ సంఖ్యలో సీట్లు అందు బాటులో ఉన్నందున పెద్ద ఎత్తున భారతీయ విద్యార్థులు ఏటా విదేశాలకు మెడిసిన్ చదువు కోసం వెళ్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. -
విదేశీ నోట గ్రేటర్ మాట
సాక్షి,సిటీబ్యూరో: మహానగరానికి విదేశీ విద్యార్థులు వెల్లువెత్తుతున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం అనేక దశాబ్దాలుగా నగరానికి పలు దేశాల నుంచి వలస వస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఏటా సుమారు పదివేల మంది విదేశీ విద్యార్థులు నగరంలోని ఉస్మానియా, జేఎన్టీయూ విశ్వవిద్యాలయ కళాశాలలు, అనుబంధ కాలేజీల్లో చేరుతుండడం విశేషం. ఇలా సుమారు 63 దేశాలకు చెందిన విద్యార్థులు నగరంలో విద్యనభ్యసిస్తున్న వారిలో ఉన్నారంటే ఇక్కడి చదువుపై వారికున్న మక్కువను అర్థం చేసుకోవచ్చు. వీరిలో అత్యధికులు ఆఫ్రికా ఖండానికి చెందిన 50కి పైగా దేశాల వారే కావడం విశేషం. ఇక అమెరికా, కెనడా, యూకే, చైనాకుచెందిన విద్యార్థులు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ కోర్సులకు డిమాండ్ అధికం ఇక్కడి ఉస్మానియా, జేఎన్టీయూ పరిధిలోని క్యాంపస్ కళాశాలలతో పాటు అనుబంధ కళాశాలలు, డీమ్డ్ వర్సిటీలు విదేశీ విద్యాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ఉద్యోగ అవకాశాలున్న ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తి చేసుకున్నవారికి వెంటనే జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో తేలికగా ఉద్యోగవకాశాలు లభిస్తుండడంతో పలువురు విదేశీ విద్యార్థులు ఈ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా ఎమ్మెస్సీ, ఎంటెక్, బీబీఏ, బీసీఏ, ఇంజినీరింగ్, బీఎస్సీ కోర్సుల్లో ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు కూడా ఈ కోర్సులు బాట వేస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో నగరంలోని పలు కళాశాలలు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండే ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. విదేశీ విద్యార్థుల సంఖ్య ఇలా.. గతేడాది వివిధ కోర్సులు అభ్యసించేందుకు నగరానికి వలస వచ్చినవారిలో అత్యధికంగా సోమాలియా దేశానికి చెందిన విద్యార్థులే ఉన్నారు. ఆ దేశం నుంచి 430 మంది విద్యార్థులు నగరంలోని పలు కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సీట్లు పొందారు. ఇక ఆఫ్గనిస్తాన్‌కు చెందిన 182 మంది, యెమన్ నుంచి 168 మంది, సూడాన్‌కు చెందిన 131 మంది, ఇరాక్ నుంచి 107 మంది, జిబుటీకి చెందిన 59 మంది, అమెరికా నుంచి 14 మంది, యూకే నుంచి ముగ్గురు, కెనడా నుంచి ఐదుగురు, చైనాకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు నగరంలో చదువుకొనేందుకు రావడం గమనార్హం. తక్కువ ఖర్చే కారణం దక్కన్ పీఠభూమిలో అత్యతంత అనుకూల భౌగోళిక, శీతోష్ణస్థితులున్న గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యనభ్యసించేందుకు విదేశీ విద్యార్థులు అత్యధికంగా మక్కువ చూపుతున్నారు. అంతర్జాతీయంగా పలు దేశాలతో పాటు.. మన దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడి కళాశాలల్లో ఫీజులు, జీవనవ్యయం మధ్యతరగతి వారికి సైతం అత్యంత అందుబాటులో ఉన్నాయి. దీంతో పలువురు నగరానికి వలస వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అత్యధికంగా ఉండే ఇంటిగ్రేటెడ్ కోర్సులు మరిన్ని అందుబాటులోకి వస్తే విదేశీ విద్యార్థులు నగరానికి క్యూ కడతారని అంచనా వేస్తున్నారు. -
‘స్టెమ్’లో ఇండియన్ జమ్స్..
అమెరికాలో సైన్స్ – టెక్నాలజీ – ఇంజనీరింగ్ – మేధమెటిక్స్ (స్టెమ్) కోర్సులు చేస్తున్న భారతీయ విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రాములో చేరేందుకు భారీగా అనుమతులు పొందారు. యూఎస్‌లో చదువుకునే విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక, అక్కడే వుండి ఉద్యోగం చేయాలనుకుంటే ఓపీటీ వర్క్ ఆథరైజేషన్ తప్పనిసరి. యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం – సెప్టెంబరు 30తో ముగిసిన 2017 ఆర్థిక సంవత్సరంలో – మొత్తం విదేశాలకు చెందిన 89,839 మంది ‘స్టెమ్’ విద్యార్థులు ఓపీటీ వర్క్ ఆథరైజేషన్ పొందారు. ఇందులో అత్యధికులు ( 50,507 మంది / 56శాతం) భారతీయులే. 21,705 (24శాతం) ఓపీటీ అనుమతులతో చైనా విద్యార్థులు ఆ తర్వాత స్థానంలో వున్నారు. స్టెమ్ – ఓపీటీ విద్యార్థులకు భారీగా ఉద్యోగాలిచ్చిన సంస్థల్లో అమెజాన్ (2,393) ముందుంది. గూగుల్ (1,142) ఇంటెల్ (1,139) మైక్రోసాఫ్ట్ (893) ఇంటెగ్రా టెక్నాలజీస్ (512) మొదలైనవి ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. ఎఫ్ –1 స్టడీ వీసాలపై అమెరికా వెళ్లిన విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కాలంలో లేదా ఆ తర్వాత ఓపీటీ కింద 12 మాసాలు పని చేసేందుకు వీలుంటుంది. స్టెమ్ డిగ్రీలు చేసేవారు ఓపీటీ ఆథరైజేషన్‌ను మరో 24 మాసాల కాలం పొడిగించుకునేందుకు అవకాశముంటుంది. ఓపీటీ అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి పరిమితులూ వుండవు. 2,49,763 భారతీయ విద్యార్థులు స్టూడెంట్ అండ్ ఎక్సే్చంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సెవిస్) విడుదల చేసిన నివేదిక ప్రకారం – 2017 నాటికి అమెరికాలో మొత్తం 15.90 లక్షల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చైనా విద్యార్థులే (4,81,106) ఎక్కువ. 2,49,763 మందికి పైగా విద్యార్థులతో భారత్ రెండో స్థానంలో వుండగా.. దక్షిణ కొరియా (95,701) సౌదీ అరేబియా (72,358) జపాన్ (41,862) ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. విదేశీ విద్యార్థుల సమాచారం విషయమై మరింత పారదర్శకత ఇచ్చేందుకు ఈ నివేదికను విడుదల చేసినట్టు సెవిస్ పేర్కొంది. విదేశీయుల్ని ఆకర్షిస్తోన్న వర్సిటీలివే.. విదేశీ విద్యార్థులను అత్యధికంగా ఆకర్షిస్తున్న అమెరికన్ యూనివర్సిటీల్లో న్యూయార్క్ వర్సిటీ (22,238 మంది) ముందుంది. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (18,786) కొలంబియా యూనివర్సిటీ ఇన్ న్యూయార్క్ సిటీ (18,332) నార్త్ ఈస్టర్న్ వర్సిటీ (17,304) యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయస్ (14,735) ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. -
మన మెరికలు.. అమెరికాకే..
►చదువు, ఉద్యోగాలకు అగ్రరాజ్యానికే ప్రాధాన్యం ►చివరి స్థానాల్లో ఆఫ్రికా దేశాలు ♦ఉపకారవేతన సౌకర్యం.. ♦నాణ్యమైన విద్య.. కుదిరితే అక్కడే ♦కొలువు.. మంచి పని అనుభవం.. ♦రూ.లక్షల్లో వేతనం.. విదేశీ చదువుపై ♦సగటు భారతీయుల ఆలోచనిది.. ♦దీనికి తగ్గట్లే బ్యాచిలర్ స్థాయిలోనే అడుగులు.. ♦మరి వీరందరి ప్రధాన గమ్యం ఏమిటంటే.. భారత యువత చాలామంది నేడు బీటెక్, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేషన్ విదేశాల్లో పూర్తిచేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇలా పయనమవుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం.. మనవాళ్లు ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, చైనా, యూకేలకు వెళ్తున్నారు. దీంతోపాటు తక్కువ ఖర్చుతో చదువు పూర్తవడంతోపాటు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసేందుకు అవకాశాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో.. అటు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 5.53 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం దాదాపు 5.53 లక్షల మంది భారతీయ విద్యార్థులు 86 దేశాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. విదేశీ విద్య, ఉద్యోగాల కోసం ప్రతిఒక్కరి చూపు అమెరికా వైపే ఉండటంతో ఈ దేశానికి అత్యధికంగా 2,06,708 మంది వెళ్లారు. కెనడాలో లక్ష మంది, ఆస్ట్రేలియాలో 63,283 మంది విద్య నభ్యసిస్తున్నారు. చైనా (18,171), యూకే (14,830), జర్మనీ (13,740), ఫిలిప్పీన్స్ (8,500), రష్యాలో (8,000), ఉక్రెయిన్ (8,000), ఫ్రాన్స్ (5000) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నేపాల్, ఒమన్ (5వేలు) ఆఖరున నిలుస్తున్నాయి. మొత్తం 86 దేశాల్లో.. మన విద్యార్థులు దాదాపు 86 దేశాలకు వెళ్తుండగా.. ఇందులో ఆసియా 36, యూరప్ 32, ఆఫ్రికా 8, దక్షిణ అమెరికా 6, ఉత్తర అమెరికా 2, ఆస్ట్రేలియా దేశాలు 2 ఉన్నాయి. శాతం ప్రకారం చూస్తే.. 50 శాతం మందిపైగా ఉత్తర అమెరికాలోనే చదువుతున్నారు. ఆసియా ఖండంలో 98,955 మంది; ఆస్ట్రేలియా ఖండంలో 93,283 మంది; యూరప్ దేశాల్లో 52,116 మంది విద్యనభ్యసిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. దాదాపు 26 దేశాల్లో విద్యార్థుల సంఖ్య 100 కంటే తక్కువగా ఉంది. మరో 20 దేశాల్లో 100–500 మధ్య ఉండటం గమనార్హం. అమెరికా అనుకూలత వాతావరణ పరిస్థితులు, స్థానిక అనుకూలతలు, ఉద్యోగావకాశాల నేపథ్యంలో యూఎస్‌లోని తూర్పు, పశ్చిమ, మధ్య తూర్పు ప్రాంతాలపై భారత విద్యార్థులు అత్యధికంగా దృష్టి పెడుతున్నారు. అన్ని రాష్ట్రాల కంటే కాలిఫోర్నియా పట్ల ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు మూల కేంద్రమైన సిలికాన్ వ్యాలీ ఇందుకు ముఖ్య కారణం. పైగా అక్కడ పేరున్న విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాల సంఖ్య పరిమితమే అయినప్పటికీ.. తక్కువ ఫీజు, మిత జీవన వ్యయం రీత్యా టెక్సాస్‌లోనూ భారతీయులు ఎక్కువ. తర్వాత న్యూయార్క్, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ, బోస్టన్ తదితర రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులు అధికం. సరైన విద్యా సంస్థలు, జీవన ప్రమాణాలు, వాతావరణ పరిస్థితులు లేని కారణంగా ఆఫ్రికా దేశాల పట్ల భారతీయ విద్యార్థులు పెద్దగా మొగ్గు చూపడం లేదు. దేశాలు.. టెస్టులు ఉన్నత చదువుకు విదేశాలకు వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థులు రాయాల్సిన పరీక్షలు దేశాలవారీగా.. ♦ యూఎస్ఏ: జీఆర్ఈ/ జీమ్యాట్/ టోఫెల్/ ఐఈఎల్టీఎస్/ పీటీఈ ♦ యూకే: టోఫెల్/ ఐఈఎల్టీఎస్ ♦ ఆస్ట్రేలియా: టోఫెల్/ ఐఈఎల్టీఎస్/ పీటీఈ ♦ కెనడా: ఐఈఎల్టీఎస్/జీఆర్ఈ ♦ న్యూజిలాండ్: ఐఈఎల్టీఎస్ ♦ టోఫెల్/ఐఈఎల్టీఎస్/పీటీఈ: అంతర్జాతీయ విద్యార్థులందరికీ అవసరమైన ఇంగ్లిష్ ప్రావీణ్యాన్ని అంచనా వేస్తాయి. ♦ జీఆర్ఈ/జీమ్యాట్: క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీని పరీక్షిస్తాయి. ♦ మనది ఆంగ్లం మాతృభాష కాని దేశం కాబట్టి టోఫెల్, ఐఈఎల్టీఎస్, పీటీఈ వంటి ఇంగ్లిష్ పరీక్షల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఇవి తప్పనిసరి ►విదేశీ విద్యకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ముఖ్యంగా కొన్ని ప్రాథమిక విషయాలను తెలుసుకోవాలి... ►విదేశాల్లో అకడమిక్ పరంగా ముఖ్యమైన విశ్వవిద్యాలయాలు, వాటిలో ప్రవేశాలకు రాయాల్సిన పరీక్షలు. ►యూనివర్సిటీ ఎంపిక తర్వాత జీఆర్ఈ, టోఫెల్, ఐఈఎల్టీఎస్, ట్రాన్స్‌స్క్రిప్ట్స్, రెకమండేషన్ లెటర్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. ♦దరఖాస్తుకు ముందుగా కొన్ని విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే.. దరఖాస్తు చేసుకున్న అన్నింటిలోనూ ప్రవేశాలు రావాలనేమీ లేదు. ఖరారైన అడ్మిషన్లు ఒకటికి మించి చేతిలో ఉండటం ఎప్పుడూ మేలే. ♦ఆన్లైన్ దరఖాస్తు ఫారం నింపడం, అవసరమైన డాక్యుమెంట్లను విశ్వవిద్యాలయాలకు పంపడం చేయాలి. దరఖాస్తు నుంచి ప్రవేశ నిర్ణయం తీసుకోవడం వరకు విశ్వవిద్యాలయ ర్యాంకింగ్‌ను బట్టి 2 నుంచి 4 నెలల సమయం పడుతుంది. ♦వీటన్నిటి సన్నద్ధత ప్రభావం మార్కులు, ర్యాంకుపై పడకుండా జాగ్రత్త వహించాలి. -
విద్యార్థులూ.. ప్రయాణాలు వాయిదా వేసుకోండి
సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలలో చదవాలనుకునే విద్యార్థులు.. సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. ఇటీవలి కాలంలో అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు భారతీయ విద్యార్థులకు అనుమతి నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా శాన్ జోస్‌లోని సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, ఫ్రెమాంట్లోని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలకు వెళ్లే పిల్లలకు ఈ తరహా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. తగిన వీసా, ఇతర పత్రాలు ఉన్నా భారతీయ విద్యార్థులను ఎందుకు అనుమతించడం లేదని విదేశాంగ శాఖ అమెరికా అధికారులను వివరణ కోరింది. దీనికి అమెరికా ప్రభుత్వం నుంచి ఇంకా సమాధానం రావాల్సి ఉంది. ఈ సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యేవరకు ఈ రెండు సంస్థలలో చదవాలనుకునే విద్యార్థులు తమ అమెరికా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విదేశాంగ శాఖ సూచించింది. అమెరికా విద్యా సంస్థలలో చదువుకోడానికి వెళ్లే విద్యార్థులు ముందుగానే ఆయా సంస్థలకు తగిన గుర్తింపు ఉందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలని తెలిపింది. పాస్‌పోర్టు, వీసాలతో పాటు తమ చదువుకు సంబంధించిన పత్రాలు, నివాసం ఉండే ప్రాంతానికి సంబంధించిన పత్రాలు, ఆర్థిక సామర్థ్యం, ఆరోగ్య రక్షణ ఏర్పాట్లు.. ఇలాంటి అన్ని పత్రాలను తీసుకెళ్లాలని చెబుతున్నారు. దాంతోపాటు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్వహించే ఇంటర్వ్యూకు కూడా తగిన విధంగా ప్రిపేర్ అయి ఉండాలని చెప్పారు. -
విదేశీ చదువుల కోసం కారు చోరీ!
అల్వాల్ : విలాసాలు, విదేశీ చదువుల కోసం దొంగతనానికి పాల్పడి ఐదుగురు యువకులు పోలీసులకు చిక్కారు. అల్వాల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ కథనం ప్రకారం....వెంకటాపురంలో నివసించే గుజ్జల వెంకటరాంరెడ్డి ఈనెల 17న ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అల్వాల్ పోలీసులు దమ్మాయిగూడలోని ఓ అపార్ట్మెంట్ వద్ద కారును పట్టుకున్నారు. పోలీసులు మరింత లోతుగా విచారించి నిందితులను అరెస్టు చేశారు. కాప్రా జేజేకాలనీకి చెందిన వడ్డమాని మనోజ్‌కుమార్ (21), వడ్లమాని వెంకటసాయి వినయ్‌కుమార్ (24), వెస్ట్ వెంకటాపురానికి చెందిన వి.సంతోస్ (20), తాళ్ల ప్రేమ్‌కుమార్ (20) బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నారు. వీరికి కుషాయిగూడలో నివసించే జండాల ధర్మతేజ (21)తో పరిచయమైంది. ఐదుగురూ కలిసి విలాసాలకు, భవిష్యత్తులో విదేశీ చదువులకు డబ్బు అవసరం అవుతుందని చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఈనెల 17న వెస్ట్ వెంకటాపురంలో గుజ్జల వెంకటరాంరెడ్డికి చెందిన కొత్త ఇన్నోవా కారును ఎత్తుకెళ్లారు. దమ్మాయిగూడలోని అపార్ట్మెంట్ వద్ద కారును విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు దొరికారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య: కిశోర్ బాబు
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను త్వరలోనే ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఇందుకు ఆర్హులైన విద్యార్థులను గుర్తిస్తామని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన ఖర్చులన్నింటినీ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల నుంచే ఖర్చు చేయనున్నట్లు మంత్రి కిశోర్ బాబు చెప్పారు. ఈ ఏడాది సుమారు వెయ్యిమంది విద్యార్థులను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపాలని యోచిస్తున్నట్లు మంత్రి వివరించారు. -
యూకే అంటే ఓకే...
చక్కని ప్లానింగ్ ఉంటే విదేశీ విద్య సాధ్యమే యూకేలో విద్యార్థులకు ఎన్నో అవకాశాలు డిగ్రీ, పీజీల్లో వైవిధ్యకోర్సులు విదేశాలలో ఉన్నత విద్య అంటే.... ప్రమాణాలతో కూడిన ప్రత్యక్ష శిక్షణ.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా బోధన.. మధ్యతరగతి విద్యార్థులు సైతం చేరుకునే విధంగా కోర్సుల ఫీజులు. పైగా భారతీయ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్న విదేశీ విశ్వవిద్యాలయాలు. ఇదీ మన విద్యార్థులకు కలసి వస్తున్న అంశాలు. అందుకే చక్కని ప్లానింగ్ ఉంటే తక్కువ ఖర్చుతోనే ఉన్నత విద్యను పూర్తిచేయడం సాధ్యపడుతుందంటున్నారు నిపుణులు. ఆంధ్రవిశ్వవిద్యాలయానికి వచ్చిన పెర్త్ వర్సిటీ బృందం ప్రత్యేకంగా ‘న్యూస్‌లైన్’తో ముచ్చటించి పలు అంశాలను వివరించింది. యూకేలో ఉన్నత విద్యావకాశాలపై ప్రత్యేక కథనం.... 120 వర్సిటీలు... ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తన్ ఐర్లాండ్ ఈ నాలుగు కంట్రీస్‌ని యునెటైడ్ కింగ్డమ్గా పరిగణిస్తారు. ఇక్కడ మొత్తం 120 వరకు వర్సిటీలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి సెయింట్ ఆండ్రోస్, ఎడిన్బర్గ్, గ్లాగోవ్, అబెడిన్ వర్సిటీలు ప్రధానమైనవి. ప్రభుత్వ పర్యవేక్షణలోనే వర్సిటీలు నిర్వహిస్తారు. ఇంగ్లాండ్ విద్యావిధానం శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది. స్కాంట్లాండ్ విద్యావిధానాన్ని ప్రపంచదేశాలు అనుసరించడం జరుగుతోంది. ఇక్కడ కేవలం 17 వర్సిటీలే ఉన్నప్పటికీ ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. రాజకుటుంబ వారసులు స్కాట్లాండ్లోని వర్సిటీలలో విద్యాభ్యాసం చేస్తారు. ఐదారు వందల సంవత్సరాల పూర్వం ఏర్పడిన వర్సిటీలు నేటికీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. కాలానుగుణంగా కోర్సులు... ఇంజినీరింగ్ అనేది అన్ని దేశాల్లో ప్రాధాన్యం కలిగిన కోర్సు. దీనితో పాటు కాలానుగుణంగా కోర్సులలో మార్పులు వస్తున్నాయి. ఆర్ట్స్ సైన్స్‌ల సమ్మేళనంలో సైతం కోర్సులు అందించడం జరుగుతుంది. గోల్ఫ్ మేనేజ్మెంట్, ఎయిర్‌పోర్టుల నిర్వహణకు ఉపకరించే ఎంబీ ఏ ఏవియేషన్ వంటి కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లండ్‌లో గోల్ఫ్ ప్రధాన క్రీడగా ఉంటోంది. దీని నిర్వహణ తది తర అంశాలతో ఈ కోర్సును అందిస్తారు. విద్యార్థి ఆసక్తి, ఉపాధి అవకాశాలు ఆధారంగా కోర్సులను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థి కేంద్రంగా బోధన... ఇక్కడి విద్యావిధానం అంతా విద్యార్థి కేంద్రంగా ఉంటుంది. ప్రత్యక్షంగా విద్యార్థులు అనేక విషయాలు అన్వేషించి అధ్యయనం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వర్సిటీ ఆచార్యులు సంబంధిత అంశాలలో ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించి, మార్గదర్శకంగా నిలుస్తారు. విద్యార్థులకు అవసరమైన సలహాలు అందిస్తూ వారిని స్వీయ అభ్యాసకులుగా తీర్చిదిద్దుతారు. వెబ్సైట్లో సీట్ల వివరాలు యూకేలో ప్రతి సంవత్సరం వివిధ సంస్థలలో ఉండే ఖాళీల వివరాలను యూకేబిఏ వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. వీటి ఆధారంగా ఖాళీలకు అనుగుణంగా విద్యార్థులు కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కోర్సు పూర్తిచేసిన తరువాత విద్యార్థి సంబంధిత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని పొందే అవకాశం ఉంది. నేర్చుకోవాలనే తపన ఉండాలి... విద్యార్థులు తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. స్వతంత్రంగా నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలి. సహనం ఉండాలి. కేవలం సంపాదన కోసం చదువుతున్నామనే భావన సరికాదు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ప్రపంచం ఎల్లవేళలా అవకాశాలు అందిస్తుంది. గోల్ఫ్ మేనేజ్మెంట్, ఫారెస్ట్రీ, ఎనర్జీ ఇంజినీరింగ్ వంటి కోర్సులు నేడు విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నాయి. సరిగ్గా ప్లానింగ్ చేసుకుంటే యూకేలో ఉన్నత విద్య అంత కష్టమైన విషయం కాదు. - హితేంద్ర చీటిరాల, అసిస్టెంట్ డెరైక్టర్ ఇంటర్నేషనల్, యూహెచ్ఐ పెర్త్ కళాశాల ఏయూతో కలసి పనిచేస్తాం ఆంధ్ర విశ్వవిద్యాలయంతో బి.ఏ టూరిజం, హాస్పటాలిటీ మేనేజ్మెంట్ కోర్సుపై చర్చిస్తున్నాం. ఒక ఏడాది భారత్‌లోను. మిగిలిన కోర్సు పెర్త్ కళాశాలలో పూర్తి చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 2014 నుంచి కోర్సును ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం. అదే విధంగా ఎంబీఏ ఏవియేషన్‌పై కూడా వర్సిటీ అధికారులతో చర్చిండం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కోర్సులను ప్రారంభించే అవకాశం ఉంది. - డాన్ హాడ్కిన్సన్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ డెరైక్టర్ ఏటా 40 వేల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం యూకేకు భారత్‌నుంచి 40 వేలమంది వరకు విద్యార్థులు వస్తుంటారు. యూనివర్సిటీ ఆఫ్ హైలాండ్స్, ఐలాండ్స్‌లో ప్రస్తుతం 40 వేలమంది వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. భద్రత పరంగా కూడా యూకే ఎంతో ఉన్నతంగా ఉంటోంది. నాలుగేళ్లలో ఏవియేషన్ ఇంజినీరింగ్ కోర్సుకు వంద మంది విద్యార్థులు వచ్చారు. పనిచేస్తూ... చదువుకోవచ్చు... యూకేలో యూజీ కోర్సులకు ఏడాదికి రూ.15 లక్షల వరకు, పీజీ కోర్సులకు రూ.14 లక్షల వరకు, ఎంబీఏకు రూ.25 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రధాన నగరాల్లో అక్కడి జీవన పరిస్థితులు కారణంగా ఖర్చు అధికంగా ఉంటుంది. పీజీ ఇక్కడ కేవలం ఒక సంవత్సరంలోనే పూర్తి చేసే అవకాశం ఉంది. భారతీయ విద్యార్థులకు అనేక వర్సిటీలు ప్రత్యేక రాయితీతో, సగం ఫీజుతో చదువుకునే అవకాశం కల్పిస్తున్నాయి. వర్సిటీ విద్యార్థులు వారానికి గరిష్టంగా 20 గంటలు పనిచేసి 600 పౌండ్లు సంపాదించే వీలుంది. ఏడాదికి 7 వేల పౌండ్లు అవసరం... ఇక్కడ ఒక్కో విద్యార్థికి ఏడాదికి ఏడు నుంచి తొమ్మిది వేల పౌండ్లు వరకు ఖర్చు అవుతుంది. చిన్న నగరాల్లో 5 వేల పౌండ్లు సరిపోతుంది. దీనిలో విద్యార్థి హాస్టల్ వసతికి మూడు వేల పౌండ్లు, ఇతర ఖర్చులకు రెండు వేల పౌండ్లు సరిపోతాయి. వర్సిటీ హాస్టల్స్‌లో వసతి కోసం ముందుగానే తెలియజేయాలి. లేని పక్షంలో స్నేహితులతో కలసి ఉండే వీలుంటుంది. 20 లక్షల మంది భారతీయులు... మనం ఎంపిక చేసుకున్న వర్సిటీ ద్వారా వీసా పొందే వీలుంటుంది. ప్రభుత్వ వర్సిటీలకు ప్రత్యేకంగా లెసైన్స్ ఉంటుంది. వర్సిటీకి అనుబంధంగా ఉన్న స్థానిక ఏజెంట్లు వీసా పొందడంలో పూర్తి సహకారం అందిస్తారు. దీనికి ఎటువంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. యూకేలో 20 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అందువల్ల వేరే దేశంలో ఉన్నామన్న భావనే విద్యార్థికి అంతగా కలగదు. స్కాలర్షిప్లు అందిస్తాయి.... అనేక వర్సిటీలు విదేశీ విద్యార్థులకు ప్రత్యేకంగా స్కాలర్షిప్లు అందించడం జరుగుతుంది. కొన్ని విద్యార్థి చేరగానే అందించగా మరికొన్ని విద్యార్థి ప్రతిభ మార్కుల ఆధారంగా అందిస్తాయి. బ్రిటిష్ కౌన్సిల్ సైతం స్కాలర్షిప్లు అందిస్తుంది. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే ఫీజు భారం తప్పుతుంది.