యూకే అంటే ఓకే... | UK looks like ... | Sakshi
Sakshi News home page

యూకే అంటే ఓకే...

Published Sun, Feb 23 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

యూకే అంటే ఓకే...

యూకే అంటే ఓకే...

  • చక్కని ప్లానింగ్ ఉంటే విదేశీ  విద్య సాధ్యమే
  • యూకేలో విద్యార్థులకు ఎన్నో అవకాశాలు
  • డిగ్రీ, పీజీల్లో   వైవిధ్యకోర్సులు
  •  విదేశాలలో ఉన్నత విద్య అంటే.... ప్రమాణాలతో కూడిన ప్రత్యక్ష శిక్షణ.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా బోధన.. మధ్యతరగతి విద్యార్థులు సైతం చేరుకునే విధంగా కోర్సుల ఫీజులు. పైగా భారతీయ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్న విదేశీ విశ్వవిద్యాలయాలు. ఇదీ మన విద్యార్థులకు కలసి వస్తున్న అంశాలు. అందుకే చక్కని ప్లానింగ్ ఉంటే తక్కువ ఖర్చుతోనే ఉన్నత విద్యను పూర్తిచేయడం సాధ్యపడుతుందంటున్నారు నిపుణులు. ఆంధ్రవిశ్వవిద్యాలయానికి వచ్చిన పెర్త్ వర్సిటీ బృందం ప్రత్యేకంగా ‘న్యూస్‌లైన్’తో ముచ్చటించి పలు అంశాలను వివరించింది. యూకేలో ఉన్నత విద్యావకాశాలపై ప్రత్యేక కథనం....    
     
     120 వర్సిటీలు...
     ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తన్ ఐర్లాండ్ ఈ నాలుగు  కంట్రీస్‌ని యునెటైడ్ కింగ్‌డమ్‌గా పరిగణిస్తారు. ఇక్కడ మొత్తం 120 వరకు వర్సిటీలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి సెయింట్ ఆండ్రోస్, ఎడిన్‌బర్గ్, గ్లాగోవ్, అబెడిన్ వర్సిటీలు ప్రధానమైనవి. ప్రభుత్వ పర్యవేక్షణలోనే వర్సిటీలు నిర్వహిస్తారు. ఇంగ్లాండ్ విద్యావిధానం శతాబ్దాల చరిత్రను కలిగి ఉంది. స్కాంట్‌లాండ్ విద్యావిధానాన్ని ప్రపంచదేశాలు అనుసరించడం జరుగుతోంది. ఇక్కడ కేవలం 17 వర్సిటీలే ఉన్నప్పటికీ ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. రాజకుటుంబ వారసులు స్కాట్‌లాండ్‌లోని వర్సిటీలలో విద్యాభ్యాసం చేస్తారు. ఐదారు వందల సంవత్సరాల పూర్వం ఏర్పడిన వర్సిటీలు నేటికీ ఇక్కడ మనకు కనిపిస్తాయి.
     
     కాలానుగుణంగా కోర్సులు...

     ఇంజినీరింగ్ అనేది అన్ని దేశాల్లో ప్రాధాన్యం కలిగిన కోర్సు. దీనితో పాటు కాలానుగుణంగా కోర్సులలో మార్పులు వస్తున్నాయి. ఆర్ట్స్ సైన్స్‌ల సమ్మేళనంలో సైతం కోర్సులు అందించడం జరుగుతుంది. గోల్ఫ్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌పోర్టుల నిర్వహణకు ఉపకరించే ఎంబీ ఏ ఏవియేషన్ వంటి కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లండ్‌లో గోల్ఫ్ ప్రధాన క్రీడగా ఉంటోంది. దీని నిర్వహణ తది తర అంశాలతో ఈ కోర్సును అందిస్తారు. విద్యార్థి ఆసక్తి, ఉపాధి అవకాశాలు ఆధారంగా కోర్సులను ఎంపిక చేసుకోవాలి.
     
     విద్యార్థి కేంద్రంగా బోధన...
     ఇక్కడి విద్యావిధానం అంతా విద్యార్థి కేంద్రంగా ఉంటుంది. ప్రత్యక్షంగా విద్యార్థులు అనేక విషయాలు అన్వేషించి అధ్యయనం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వర్సిటీ ఆచార్యులు సంబంధిత అంశాలలో ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించి, మార్గదర్శకంగా నిలుస్తారు. విద్యార్థులకు అవసరమైన సలహాలు అందిస్తూ వారిని స్వీయ అభ్యాసకులుగా తీర్చిదిద్దుతారు.
     
     వెబ్‌సైట్‌లో సీట్ల వివరాలు
     యూకేలో ప్రతి సంవత్సరం వివిధ సంస్థలలో ఉండే ఖాళీల వివరాలను యూకేబిఏ వెబ్‌సైట్‌లో ఉంచడం జరుగుతుంది. వీటి ఆధారంగా ఖాళీలకు అనుగుణంగా విద్యార్థులు కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కోర్సు పూర్తిచేసిన తరువాత విద్యార్థి సంబంధిత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని పొందే అవకాశం ఉంది.
     
     నేర్చుకోవాలనే తపన ఉండాలి...

     విద్యార్థులు తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. స్వతంత్రంగా నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలి. సహనం ఉండాలి. కేవలం సంపాదన కోసం చదువుతున్నామనే భావన సరికాదు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ప్రపంచం ఎల్లవేళలా అవకాశాలు అందిస్తుంది. గోల్ఫ్ మేనేజ్‌మెంట్, ఫారెస్ట్రీ, ఎనర్జీ ఇంజినీరింగ్ వంటి కోర్సులు నేడు విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నాయి. సరిగ్గా ప్లానింగ్ చేసుకుంటే యూకేలో ఉన్నత విద్య అంత కష్టమైన విషయం కాదు.
     - హితేంద్ర చీటిరాల, అసిస్టెంట్ డెరైక్టర్ ఇంటర్నేషనల్, యూహెచ్‌ఐ పెర్త్ కళాశాల
     
     ఏయూతో కలసి పనిచేస్తాం

     ఆంధ్ర విశ్వవిద్యాలయంతో బి.ఏ టూరిజం, హాస్పటాలిటీ మేనేజ్‌మెంట్ కోర్సుపై చర్చిస్తున్నాం. ఒక ఏడాది భారత్‌లోను. మిగిలిన కోర్సు పెర్త్ కళాశాలలో పూర్తి చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 2014 నుంచి కోర్సును ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం. అదే విధంగా ఎంబీఏ ఏవియేషన్‌పై కూడా వర్సిటీ అధికారులతో చర్చిండం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కోర్సులను ప్రారంభించే అవకాశం ఉంది.  - డాన్ హాడ్కిన్‌సన్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ డెరైక్టర్
     
     ఏటా 40 వేల మంది విద్యార్థులు
     ప్రతి సంవత్సరం యూకేకు భారత్‌నుంచి 40 వేలమంది వరకు విద్యార్థులు వస్తుంటారు. యూనివర్సిటీ ఆఫ్ హైలాండ్స్, ఐలాండ్స్‌లో ప్రస్తుతం 40 వేలమంది వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. భద్రత పరంగా కూడా యూకే ఎంతో ఉన్నతంగా ఉంటోంది.  నాలుగేళ్లలో ఏవియేషన్ ఇంజినీరింగ్ కోర్సుకు వంద మంది విద్యార్థులు వచ్చారు.
     
     పనిచేస్తూ... చదువుకోవచ్చు...
     యూకేలో యూజీ కోర్సులకు ఏడాదికి రూ.15 లక్షల వరకు, పీజీ కోర్సులకు రూ.14 లక్షల వరకు, ఎంబీఏకు రూ.25 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రధాన నగరాల్లో అక్కడి జీవన పరిస్థితులు కారణంగా ఖర్చు అధికంగా ఉంటుంది. పీజీ ఇక్కడ కేవలం ఒక సంవత్సరంలోనే పూర్తి చేసే అవకాశం ఉంది. భారతీయ విద్యార్థులకు అనేక వర్సిటీలు ప్రత్యేక రాయితీతో, సగం ఫీజుతో చదువుకునే అవకాశం కల్పిస్తున్నాయి. వర్సిటీ విద్యార్థులు వారానికి గరిష్టంగా 20 గంటలు పనిచేసి 600 పౌండ్‌లు సంపాదించే వీలుంది.
     
     ఏడాదికి 7 వేల పౌండ్‌లు అవసరం...

     ఇక్కడ ఒక్కో విద్యార్థికి ఏడాదికి ఏడు నుంచి తొమ్మిది వేల పౌండ్లు వరకు ఖర్చు అవుతుంది. చిన్న నగరాల్లో 5 వేల పౌండ్లు సరిపోతుంది. దీనిలో విద్యార్థి హాస్టల్ వసతికి మూడు వేల పౌండ్లు, ఇతర ఖర్చులకు రెండు వేల పౌండ్లు సరిపోతాయి. వర్సిటీ హాస్టల్స్‌లో వసతి కోసం ముందుగానే తెలియజేయాలి. లేని పక్షంలో స్నేహితులతో కలసి ఉండే వీలుంటుంది.
     
     20 లక్షల మంది భారతీయులు...
     మనం ఎంపిక చేసుకున్న వర్సిటీ ద్వారా వీసా పొందే వీలుంటుంది. ప్రభుత్వ వర్సిటీలకు ప్రత్యేకంగా లెసైన్స్ ఉంటుంది. వర్సిటీకి అనుబంధంగా ఉన్న స్థానిక ఏజెంట్‌లు వీసా పొందడంలో పూర్తి సహకారం అందిస్తారు. దీనికి ఎటువంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. యూకేలో 20 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అందువల్ల వేరే దేశంలో ఉన్నామన్న భావనే విద్యార్థికి అంతగా కలగదు.
     
     స్కాలర్‌షిప్‌లు అందిస్తాయి....
     అనేక వర్సిటీలు విదేశీ విద్యార్థులకు ప్రత్యేకంగా స్కాలర్‌షిప్‌లు అందించడం జరుగుతుంది. కొన్ని విద్యార్థి చేరగానే అందించగా మరికొన్ని విద్యార్థి ప్రతిభ మార్కుల ఆధారంగా అందిస్తాయి. బ్రిటిష్ కౌన్సిల్ సైతం స్కాలర్‌షిప్‌లు అందిస్తుంది. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే ఫీజు భారం తప్పుతుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement