
ట్రంప్ రాకతో ప్రతికూల పరిస్థితులు
వర్సిటీలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోతలు
విదేశీ విద్యార్థులకు ఇకపై మరిన్ని కష్టాలు
ఉన్నత విద్య కోసం అమెరికాకు రాకపోవడమే మంచిదంటున్న నిపుణులు
అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది విద్యార్థులు ఆరాటపడుతుంటారు. అక్కడ నాణ్యమైన విద్య లభిస్తుందన్న నమ్మకమే ఇందుకు కారణం. అత్యాధునిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఆవిష్కరణలు, పరిశోధనలకు అవసరమైన పూర్తి సౌకర్యాలతో అమెరికా వర్సిటీలు ఆకట్టుకున్నాయి. అయితే, ఈ ఏడాది పరిస్థితిలో చాలావరకు మార్పులు విచ్చనట్లు నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలో రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత యూనివర్సిటీలు కష్టకాలం మొదలైందని అంటున్నారు. అందుకే ఉన్నత విద్య కోసం అమెరికా వర్సిటీలను ఎంచుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. వర్సిటీలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోత విధిస్తూ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆంక్షలు సైతం పెంచారు. అమెరికా వర్సిటీల్లో విద్యాభ్యాసం గతంలో ఉన్నట్లు ఇకపై సులభంగా ఉండబోదు. ముఖ్యంగా విదేశీ విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇక్కడ చదువుకోడానికి సిద్ధపడితే భారీగా ఖర్చు చేయాల్సి రావొచ్చు.
పరిశోధనలకు నిధులు కట్
అమెరికాలో ఉన్నత విద్య ప్రధానంగా ప్రభుత్వ మద్దతుపై ఆధారపడిందే. ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే వర్సిటీలు చాలావరకు మనుగడ సాగిస్తుంటాయి. మెడిసిన్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేస్తూ ఉంటుంది. ఇలాంటి గ్రాంట్లలో ట్రంప్ భారీగా కోతలు విధించారు. దీనివల్ల పరిశోధన కార్యక్రమాలు, శాస్త్రీయ ఆవిష్కరణలకు ఆటంకాలు తలెత్తబోతున్నాయి. నిధుల కొరత వల్ల పరిశోధనలు పూర్తిగా ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. విదేశీ విద్యార్థులకు ఆర్థికంగా సహకరించే పరిస్థితి ఉండబోదు. వారికి రీసెర్చ్ అసిస్టెంట్‌షిప్స్, స్కాలర్‌షిప్స్ అందించే అవకాశాలు కుదించుకుపోతున్నాయి.
ఒకవైపు వనరులు కరిగిపోతే మరోవైపు సౌకర్యాలు తగ్గిపోతాయనడంలో ఆశ్చర్యం లేదు. నిత్యం భయం భయంగానే అమెరికా విశ్వవిద్యాలయాల్లో స్వేచ్ఛాయుత వాతావరణం ఉండేది. విద్యార్థులు నిర్భయంగా రాజకీయ చర్చలు జరిపేవారు. తమకు నచ్చిన సంస్థలకు మద్దతు ప్రకటించేవారు. వర్సిటీల ప్రాంగణాల్లో ఆందోళనలు, నిరసనలకు ఎలాంటి ఆటంకాలు ఉండేవి కావు. ట్రంప్ వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలకు మద్దతు ప్రకటించినట్లు అనుమానం వస్తే చాలు వర్సిటీల నుంచి బహిష్కరిస్తున్నారు. విదేశీ విద్యార్థులకు బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. కొందరిపై కేసులు సైతం నమోదు చేస్తున్నారు. యూనివర్సిటీల్లో భయంభయంగా గడపాల్సి వస్తోందని విదేశీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై ఎన్నో రకాల ఆంక్షలు అమల్లోకి వచ్చాయని చెబుతున్నారు.
ఇతర దేశాల్లో మెరుగైన అవకాశాలు
అమెరికా వర్సిటీల్లో నెలకొన్న ప్రతికూల పరిణామాలను చైనా వర్సిటీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. విదేశీ విద్యార్థులను ఆకర్శించడానికి ప్రయత్నిస్తున్నాయి. రీసెర్చ్ అండ్ టెక్నాలజీకి నిధుల కేటాయింపులు భారీగా పెంచబోతున్నట్లు చైనా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇన్నోవేషన్‌లో అమెరికాను వెనక్కి నెట్టేసి గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు కెనడా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వర్సిటీలు సైతం అంతర్జాతీయ విద్యార్థులపై వల విసురుతున్నాయి. అమెరికా కంటే మెరుగైన వసతులు, నిధులు, స్వేచ్ఛ అందుబాటులో ఉన్నప్పుడు మరో దేశాన్ని ఎంచుకుంటే తప్పేం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment