అమెరికాలో సైన్స్ – టెక్నాలజీ – ఇంజనీరింగ్ – మేధమెటిక్స్ (స్టెమ్) కోర్సులు చేస్తున్న భారతీయ విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రాములో చేరేందుకు భారీగా అనుమతులు పొందారు. యూఎస్‌లో చదువుకునే విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక, అక్కడే వుండి ఉద్యోగం చేయాలనుకుంటే ఓపీటీ వర్క్ ఆథరైజేషన్ తప్పనిసరి. యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం – సెప్టెంబరు 30తో ముగిసిన 2017 ఆర్థిక సంవత్సరంలో – మొత్తం విదేశాలకు చెందిన 89,839 మంది ‘స్టెమ్’ విద్యార్థులు ఓపీటీ వర్క్ ఆథరైజేషన్ పొందారు. ఇందులో అత్యధికులు ( 50,507 మంది / 56శాతం) భారతీయులే. 21,705 (24శాతం) ఓపీటీ అనుమతులతో చైనా విద్యార్థులు ఆ తర్వాత స్థానంలో వున్నారు.
స్టెమ్ – ఓపీటీ విద్యార్థులకు భారీగా ఉద్యోగాలిచ్చిన సంస్థల్లో అమెజాన్ (2,393) ముందుంది. గూగుల్ (1,142) ఇంటెల్ (1,139) మైక్రోసాఫ్ట్ (893) ఇంటెగ్రా టెక్నాలజీస్ (512) మొదలైనవి ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. ఎఫ్ –1 స్టడీ వీసాలపై అమెరికా వెళ్లిన విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కాలంలో లేదా ఆ తర్వాత ఓపీటీ కింద 12 మాసాలు పని చేసేందుకు వీలుంటుంది. స్టెమ్ డిగ్రీలు చేసేవారు ఓపీటీ ఆథరైజేషన్‌ను మరో 24 మాసాల కాలం పొడిగించుకునేందుకు అవకాశముంటుంది. ఓపీటీ అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి పరిమితులూ వుండవు.
2,49,763 భారతీయ విద్యార్థులు
స్టూడెంట్ అండ్ ఎక్సే్చంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సెవిస్) విడుదల చేసిన నివేదిక ప్రకారం – 2017 నాటికి అమెరికాలో మొత్తం 15.90 లక్షల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చైనా విద్యార్థులే (4,81,106) ఎక్కువ. 2,49,763 మందికి పైగా విద్యార్థులతో భారత్ రెండో స్థానంలో వుండగా.. దక్షిణ కొరియా (95,701) సౌదీ అరేబియా (72,358) జపాన్ (41,862) ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. విదేశీ విద్యార్థుల సమాచారం విషయమై మరింత పారదర్శకత ఇచ్చేందుకు ఈ నివేదికను విడుదల చేసినట్టు సెవిస్ పేర్కొంది.
విదేశీయుల్ని ఆకర్షిస్తోన్న వర్సిటీలివే..
విదేశీ విద్యార్థులను అత్యధికంగా ఆకర్షిస్తున్న అమెరికన్ యూనివర్సిటీల్లో న్యూయార్క్ వర్సిటీ (22,238 మంది) ముందుంది. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (18,786) కొలంబియా యూనివర్సిటీ ఇన్ న్యూయార్క్ సిటీ (18,332) నార్త్ ఈస్టర్న్ వర్సిటీ (17,304) యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయస్ (14,735) ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment