సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలలో చదవాలనుకునే విద్యార్థులు.. సమస్య పరిష్కారం అయ్యేవరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. ఇటీవలి కాలంలో అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు భారతీయ విద్యార్థులకు అనుమతి నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా శాన్ జోస్‌లోని సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, ఫ్రెమాంట్‌లోని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలకు వెళ్లే పిల్లలకు ఈ తరహా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. తగిన వీసా, ఇతర పత్రాలు ఉన్నా భారతీయ విద్యార్థులను ఎందుకు అనుమతించడం లేదని విదేశాంగ శాఖ అమెరికా అధికారులను వివరణ కోరింది. దీనికి అమెరికా ప్రభుత్వం నుంచి ఇంకా సమాధానం రావాల్సి ఉంది.
ఈ సమస్య సానుకూలంగా పరిష్కారం అయ్యేవరకు ఈ రెండు సంస్థలలో చదవాలనుకునే విద్యార్థులు తమ అమెరికా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విదేశాంగ శాఖ సూచించింది. అమెరికా విద్యా సంస్థలలో చదువుకోడానికి వెళ్లే విద్యార్థులు ముందుగానే ఆయా సంస్థలకు తగిన గుర్తింపు ఉందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలని తెలిపింది. పాస్‌పోర్టు, వీసాలతో పాటు తమ చదువుకు సంబంధించిన పత్రాలు, నివాసం ఉండే ప్రాంతానికి సంబంధించిన పత్రాలు, ఆర్థిక సామర్థ్యం, ఆరోగ్య రక్షణ ఏర్పాట్లు.. ఇలాంటి అన్ని పత్రాలను తీసుకెళ్లాలని చెబుతున్నారు. దాంతోపాటు అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్వహించే ఇంటర్వ్యూకు కూడా తగిన విధంగా ప్రిపేర్ అయి ఉండాలని చెప్పారు.
విద్యార్థులూ.. ప్రయాణాలు వాయిదా వేసుకోండి
Published Wed, Dec 23 2015 5:50 PM | Last Updated on Sun, Sep 2 2018 4:12 PM
Advertisement
Advertisement