►చదువు, ఉద్యోగాలకు అగ్రరాజ్యానికే ప్రాధాన్యం
►చివరి స్థానాల్లో ఆఫ్రికా దేశాలు
♦ఉపకారవేతన సౌకర్యం..
♦నాణ్యమైన విద్య.. కుదిరితే అక్కడే
♦కొలువు.. మంచి పని అనుభవం..
♦రూ.లక్షల్లో వేతనం.. విదేశీ చదువుపై
♦సగటు భారతీయుల ఆలోచనిది..
♦దీనికి తగ్గట్లే బ్యాచిలర్ స్థాయిలోనే అడుగులు..
♦మరి వీరందరి ప్రధాన గమ్యం ఏమిటంటే..
భారత యువత చాలామంది నేడు బీటెక్, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేషన్ విదేశాల్లో పూర్తిచేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇలా పయనమవుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం.. మనవాళ్లు ఎక్కువగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, చైనా, యూకేలకు వెళ్తున్నారు. దీంతోపాటు తక్కువ ఖర్చుతో చదువు పూర్తవడంతోపాటు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసేందుకు అవకాశాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో.. అటు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
5.53 లక్షల మంది
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం దాదాపు 5.53 లక్షల మంది భారతీయ విద్యార్థులు 86 దేశాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. విదేశీ విద్య, ఉద్యోగాల కోసం ప్రతిఒక్కరి చూపు అమెరికా వైపే ఉండటంతో ఈ దేశానికి అత్యధికంగా 2,06,708 మంది వెళ్లారు. కెనడాలో లక్ష మంది, ఆస్ట్రేలియాలో 63,283 మంది విద్య నభ్యసిస్తున్నారు. చైనా (18,171), యూకే (14,830), జర్మనీ (13,740), ఫిలిప్పీన్స్ (8,500), రష్యాలో (8,000), ఉక్రెయిన్ (8,000), ఫ్రాన్స్ (5000) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నేపాల్, ఒమన్ (5వేలు) ఆఖరున నిలుస్తున్నాయి.
మొత్తం 86 దేశాల్లో..
మన విద్యార్థులు దాదాపు 86 దేశాలకు వెళ్తుండగా.. ఇందులో ఆసియా 36, యూరప్ 32, ఆఫ్రికా 8, దక్షిణ అమెరికా 6, ఉత్తర అమెరికా 2, ఆస్ట్రేలియా దేశాలు 2 ఉన్నాయి. శాతం ప్రకారం చూస్తే.. 50 శాతం మందిపైగా ఉత్తర అమెరికాలోనే చదువుతున్నారు. ఆసియా ఖండంలో 98,955 మంది; ఆస్ట్రేలియా ఖండంలో 93,283 మంది; యూరప్ దేశాల్లో 52,116 మంది విద్యనభ్యసిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. దాదాపు 26 దేశాల్లో విద్యార్థుల సంఖ్య 100 కంటే తక్కువగా ఉంది. మరో 20 దేశాల్లో 100–500 మధ్య ఉండటం గమనార్హం.
అమెరికా అనుకూలత
వాతావరణ పరిస్థితులు, స్థానిక అనుకూలతలు, ఉద్యోగావకాశాల నేపథ్యంలో యూఎస్‌లోని తూర్పు, పశ్చిమ, మధ్య తూర్పు ప్రాంతాలపై భారత విద్యార్థులు అత్యధికంగా దృష్టి పెడుతున్నారు. అన్ని రాష్ట్రాల కంటే కాలిఫోర్నియా పట్ల ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. ప్రపంచంలోనే సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులకు మూల కేంద్రమైన సిలికాన్ వ్యాలీ ఇందుకు ముఖ్య కారణం.
పైగా అక్కడ పేరున్న విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాల సంఖ్య పరిమితమే అయినప్పటికీ.. తక్కువ ఫీజు, మిత జీవన వ్యయం రీత్యా టెక్సాస్‌లోనూ భారతీయులు ఎక్కువ. తర్వాత న్యూయార్క్, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ, బోస్టన్ తదితర రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థులు అధికం. సరైన విద్యా సంస్థలు, జీవన ప్రమాణాలు, వాతావరణ పరిస్థితులు లేని కారణంగా ఆఫ్రికా దేశాల పట్ల భారతీయ విద్యార్థులు పెద్దగా మొగ్గు చూపడం లేదు.
దేశాలు.. టెస్టులు
ఉన్నత చదువుకు విదేశాలకు వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థులు రాయాల్సిన పరీక్షలు దేశాలవారీగా..
♦ యూఎస్‌ఏ: జీఆర్‌ఈ/ జీమ్యాట్/ టోఫెల్/ ఐఈఎల్‌టీఎస్/ పీటీఈ
♦ యూకే: టోఫెల్/ ఐఈఎల్‌టీఎస్
♦ ఆస్ట్రేలియా: టోఫెల్/ ఐఈఎల్‌టీఎస్/ పీటీఈ
♦ కెనడా: ఐఈఎల్‌టీఎస్/జీఆర్‌ఈ
♦ న్యూజిలాండ్: ఐఈఎల్‌టీఎస్
♦ టోఫెల్/ఐఈఎల్‌టీఎస్/పీటీఈ: అంతర్జాతీయ విద్యార్థులందరికీ అవసరమైన ఇంగ్లిష్ ప్రావీణ్యాన్ని అంచనా వేస్తాయి.
♦ జీఆర్‌ఈ/జీమ్యాట్: క్వాంటిటేటివ్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీని పరీక్షిస్తాయి.
♦ మనది ఆంగ్లం మాతృభాష కాని దేశం కాబట్టి టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, పీటీఈ వంటి ఇంగ్లిష్ పరీక్షల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.
ఇవి తప్పనిసరి
►విదేశీ విద్యకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ముఖ్యంగా కొన్ని ప్రాథమిక విషయాలను తెలుసుకోవాలి...
►విదేశాల్లో అకడమిక్ పరంగా ముఖ్యమైన విశ్వవిద్యాలయాలు, వాటిలో ప్రవేశాలకు రాయాల్సిన పరీక్షలు.
►యూనివర్సిటీ ఎంపిక తర్వాత జీఆర్‌ఈ, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, ట్రాన్స్‌స్క్రిప్ట్స్, రెకమండేషన్ లెటర్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్.
♦దరఖాస్తుకు ముందుగా కొన్ని విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే.. దరఖాస్తు చేసుకున్న అన్నింటిలోనూ ప్రవేశాలు రావాలనేమీ లేదు. ఖరారైన అడ్మిషన్లు ఒకటికి మించి చేతిలో ఉండటం ఎప్పుడూ మేలే.
♦ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం నింపడం, అవసరమైన డాక్యుమెంట్లను విశ్వవిద్యాలయాలకు పంపడం చేయాలి. దరఖాస్తు నుంచి ప్రవేశ నిర్ణయం తీసుకోవడం వరకు విశ్వవిద్యాలయ ర్యాంకింగ్‌ను బట్టి 2 నుంచి 4 నెలల సమయం పడుతుంది.
♦వీటన్నిటి సన్నద్ధత ప్రభావం మార్కులు, ర్యాంకుపై పడకుండా జాగ్రత్త వహించాలి.