మీరు జారీ చేసిన వీసాలే! | United States of America to the State Department appeal | Sakshi
Sakshi News home page

మీరు జారీ చేసిన వీసాలే!

Published Thu, Dec 31 2015 1:08 AM | Last Updated on Sun, Sep 2 2018 4:12 PM

United States of America to the State Department appeal

వాటిని గౌరవించాలంటూ అమెరికాకు విదేశాంగ శాఖ విజ్ఞపి
 
 సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులను వెనక్కి పంపుతుండడంపై బుధవారం భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘వారికి వీసాలను జారీ చేసింది మీ కాన్సులేట్లు, ఎంబసీలే.. ఆ వీసాలను గౌరవించాలి’ అని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులకు విజ్ఞప్తి చేసింది. వ్యాపార, పర్యాటక, పని వీసాలపై వెళ్తున్నవారినీ వెనక్కి పంపుతున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. సిలికాన్ వ్యాలీ యూనివర్శిటీ, నార్త్‌వెస్ట్రన్ పాలిటెక్నిక్ వర్సిటీల్లోనే కాకుండా ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులనూ వెనక్కి పంపుతున్నారంది.

అలాగే, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్తున్న విద్యార్థులు అవసరమైన అన్ని అధికారిక ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్లాలని సూచిస్తూ బుధవారం మరో ప్రకటన జారీ చేసింది. కాగా, కాలిఫోర్నియాలోని రెండు వర్సిటీలను నిషేధిత జాబితాలో ఉంచడంతో వాటిలో చేరిన భారతీయ విద్యార్థులను మాత్రమే వెనక్కుపంపడం లేదని అమెరికా భారత్‌కు స్పష్టం చేసింది. ఇమిగ్రేషన్ విచారణలో.. వీసాల్లో ఉన్న వివరాలకు, విద్యార్థులు ఇస్తున్న సమాచారానికి పొంతన లేనట్లుగా తేలుతున్నందువల్లనే వారిని దేశంలోకి అనుమతించడం లేదని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు భారత విదేశాంగ కార్యాలయానికి  తెలిపారు.

ఈ నేపథ్యంలో.. అమెరికా విద్యాసంస్థల్లో  అడ్మిషన్లు తీసుకోవాలనుకునే విద్యార్ధులు అన్ని విషయాలన లోతుగా అధ్యయనం చేశాకే ముందుకు వెళ్లాలని విదేశాంగ శాఖ సూచించింది. స్టడీ ప్లాన్, వసతి, ఆర్ధిక సహాయం తదితర అంశాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తమ వెంట తీసుకెళ్లాలని, ఇంటర్వ్యూ సమయంలో ఈ పత్రాల్ని ఇమిగ్రేషన్ అధికారులకు అందచేయాలని సూచించింది. అలాగే, ఇతర వీసాలపై అమెరికా వెళ్తున్నవారు కూడా యూఎస్‌లో ఎక్కడ ఉండబోతున్నారు?, స్పాన్సర్‌షిప్, ఆర్థికపరమైన మద్దతు. తదితర వివరాలున్న డాక్యుమెంట్స్‌ను విధిగా వెంట తీసుకువెళ్లాలని సూచించింది.
 
 భారత్ విజ్ఞప్తి..
 ‘మా విద్యార్థులకు వీసాలను జారీ చేసింది మీ కాన్సులేట్లు, ఎంబసీలే.. ఆ వీసాలను గౌరవించాల్సిన అవసరముంది. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులనే కాకుండా వేరే యూనివర్సిటీల్లో చేరిన వారిని కూడా వెనక్కు పంపుతున్నట్లు మా దృష్టికి వచ్చింది.  వ్యాపార, పర్యాటక, పని వీసాలపై వెళ్తున్నవారిని సైతం వెనక్కి పంపుతున్నారు’.
 
 అమెరికా వివరణ..
 ‘కాలిఫోర్నియాలోని రెండు యూనివర్సిటీలను నిషేధిత జాబితా(బ్లాక్ లిస్ట్)లో పెట్టిన కారణంగా.. వాటిలో చేరిన భారతీయ విద్యార్థులను మాత్రమే వెనక్కుపంపడం లేదు. ఇమిగ్రేషన్ విచారణ సందర్భంగా వీసాలో ఉన్న వివరాలకు, విద్యార్థులు ఇస్తున్న సమాచారానికి పొంతన లేనట్లుగా తేలుతున్నందువల్లనే వారిని దేశంలోకి అనుమతించడం లేదు’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement