ఆ వర్సిటీల్లో అంతా భారత విద్యార్థులే
కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ వర్సిటీ, నార్త్‌వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీల్లో చేరుతున్న వారిలో 90 శాతానికిపైగా భారత విద్యార్థులే. గత ఏడాది జూన్-ఆగస్టు మధ్య ఈ వర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల జీఆర్‌ఈ 275 లోపే. ఆంగ్ల భాషలో పట్టు తెలుసుకోవడానికి పెట్టే టోఫెల్ పరీక్షలో ఈ విద్యార్థుల స్కోర్ 60 లోపే. అంతేకాదు ఈ కాలేజీల్లో చేరిన భారత విద్యార్థుల్లో బ్యాక్‌లాగ్ (నాలుగేళ్ల బీటెక్ కోర్సులో ఫెయిలై మళ్లీ పరీక్ష రాసిన) లేకుండా ఉత్తీర్ణులైన వారు ఒక్కరు కూడా లేరు. ఈ రెండు విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులందరూ కనిష్టంగా 11, గరిష్టంగా 16 బ్యాక్‌లాగ్‌లు ఉన్నవారే. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఈ వర్సిటీల్లో చదువుతున్న 90 శాతం మంది భారత విద్యార్థుల్లో 67 శాతం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే.
అమెరికా వస్తే ఏదో ఒక ఉద్యోగం చేసి నాలుగు డాలర్లు వెనకేసుకోవచ్చన్నదే వీరి మొదటి ప్రాధాన్యత. అందువల్లే తరగతుల్లో చేరిన నాటి నుంచే వారి గ్రాడ్యుయేషన్ కంటే ముందే పార్ట్‌టైమ్ ఉద్యోగాల వెతుకులాట మొదలవుతుంది. ఆ ఉద్యోగం కాస్త బాగుండి నెలకు 2 వేల డాలర్లు వస్తాయనుకుంటే తరగతులకు కూ డా డుమ్మా కొడతారు. ఒక్క కాలిఫోర్నియాలోనే కాదు న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో వేల మంది భారత విద్యార్థులకు ‘ఐ20’ సమకూర్చే వర్సిటీలు ఎన్నో ఉన్నాయి.
కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో చదువుకునేందుకు వెళుతున్న వారిని అక్కడి సీబీటీ అధికారులు ప్రశ్నించి, అసలు కూపీ లాగుతున్నారు. విద్యార్థులు పొంతన లేని జవాబులు చెబితే ఇంటర్వ్యూ చివర్లో వీసా రద్దు చేస్తున్నామని, వెనక్కి పంపుతున్నామని చెప్పేస్తారు. అంతేకాదు పాస్‌పోర్టులో ఎఫ్-1 వీసా స్టాంపింగ్‌పై అడ్డంగా స్కెచ్‌పెన్నుతో గీతలు పెట్టి, ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తారు. పొంతన లేని జవాబులు చెప్పిన ఓ విద్యార్థినిని అలాగే వెనక్కి పంపేశారు.