Elizabeth Holmes: Theranos founder Rise And Fall Story Detail In Telugu - Sakshi
Sakshi News home page

19 ఏళ్లకే సిలికాన్‌ వ్యాలీ స్టార్‌.. రెప్పవాల్చని అందం.. ముప్పై ఏళ్లకే బిలియనీర్‌! ఘరానా మోసం

Published Tue, Jan 4 2022 1:35 PM | Last Updated on Tue, Jan 4 2022 7:25 PM

Theranos founder Elizabeth Holmes Rise And Fall Story Telugu - Sakshi

అబద్ధపు పునాదుల మీద నిర్మించిన వ్యాపార సామ్రాజ్యం ఎంతో కాలం నిలవదు.. ఇందుకు సరైన ఉదాహరణ.. ఎలిజబెత్‌ హోమ్స్‌ ఉదంతం. 19 ఏళ్లకే స్టార్టప్‌ రంగంలో సంచలనం సృష్టించిన ఎలిజబెత్‌.. అదనంగా తన మాటల్ని-అందాన్ని ఎరగా వేసి పెట్టుబడిదారులను ఆకర్షించింది. ఆ దెబ్బకి మూడు పదుల వయసుకి చేరగానే బిలియనీర్‌గా అవతరించింది. ఇన్నేళ్లకు.. విఫలమైన తన ఆవిష్కరణ మోసం బయటపడడంతో కటకటాల వైపు అడుగులు వేస్తోంది. 


దాదాపు దశాబ్దం కిందట.. ఎలిజబెత్‌ హోమ్స్‌ అనే 19 ఏళ్ల అమ్మాయి చేసిన ఓ ప్రకటన రోగనిర్ధారణ పరీక్షల రంగంలో సంచలనం సృష్టించింది. డయాగ్నోస్టిక్స్‌ ఫీల్డ్‌లో సరికొత్త విప్లవానికి నాంది పలికిందని ప్రపంచమంతా ఆమెను తెగ పొగిడేశారు.  ఆమె విజన్‌ ఎంతో మంది మేధావుల్ని ఆకర్షించింది. బడా బడా కంపెనీలు సైతం ఆమె ఆవిష్కరణలో పెట్టుబడుల కోసం ఎగబడ్డారు. టెక్‌ కంపెనీలకు అడ్డా అయిన సిలికాన్‌ వ్యాలీ నుంచి సెల్ప్‌ మేడ్‌ సూపర్‌ స్టార్‌గా ప్రపంచం మొత్తం ఆమెను కొనియాడింది. కానీ, రోజులు ఒకేలా ఉండవుగా.. ఆమె మోసం కొన్నేళ్లకైనా బయటపడింది. 

 

ఒక్క రక్తపు చుక్కతో.. 
థెరానోస్.. ఎలిజబెత్‌ హోమ్స్‌ బీజం వేసిన స్టార్టప్‌ పేరు. ప్రజలకు ఏదైనా సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో తాను ఈ స్టార్టప్‌ ప్రారంభించినట్లు ప్రకటించుకుంది. కేవలం ఒక్క రక్తపు చుక్కతో బ్లడ్‌ టెస్ట్‌ నిర్వహించుకునే సెల్ఫ్‌ సర్వీస్‌ మెషిన్లను రూపొందించినట్లు ప్రకటించుకుంది ఎలిజబెత్‌. సెల్ఫ్‌ సర్వీస్‌ మెషిన్‌లతో.. కొద్ది చుక్కల రక్తంతో ఫలితాన్ని రాబట్టే టూల్స్‌ అవి.  దీంతో ఈ విప్లవాత్మక పరీక్షా వ్యవస్థ గురించి ప్రపంచమంతా చర్చ నడిచింది. 

ఆమె బ్రెయిన్‌కు.. ఆ ఆవిష్కరణకు ఎంతో మంది మేధావులు ఫిదా అయ్యారు. అన్నింటికి మించి ఆమె అందం, గలగలా మాట్లాడేతత్వం, గొంతు.. ఇన్వెస్టర్లను అమితంగా ఆకర్షించేది. దీంతో నాలుగేళ్లు కూడా తిరగకుండానే ఆ స్టార్టప్‌ కాస్త..  హెల్త్ టెక్నాలజీ కంపెనీగా రిజిస్ట్రర్‌ అయ్యింది. ఫైజర్‌, షెరింగ్‌ ప్లౌ కంపెనీలు సైతం ఇన్‌వాల్వ్‌ కావడంతో థెరానోస్‌ మీద పెద్దగా దృషి, నిఘా పెట్టలేకపోయాయి ప్రభుత్వ వర్గాలు. ఫోర్బ్స్‌ తో పాటు పలు పాపులర్‌ మ్యాగజీన్‌ల మీద కూడా ఆమె ముఖచిత్రం దర్శనమిచ్చింది.



ఆ ఒక్క కథనంతో.. 
థెరానోస్‌ బ్లడ్‌ టెస్టింగ్‌ టెక్నాలజీ కంపెనీగా ఎదిగాక.. 2015లో వెలువడ్డ ఓ కథనం ఆ కంపెనీ రాతనే మార్చేసింది. ఆ కంపెనీ అందిస్తున్న పరికరాలు సరిగా పని చేయడం లేదని, ఫలితాలు పారదర్శకతతో లేవని, తప్పుడు ఫలితాలు చూపుతున్నాయని  వాల్ స్ట్రీట్ జర్నల్ వరుస కథనాలు ప్రచురించింది. ఇది యావత్‌ సిలికాన్‌ వ్యాలీని కుదిపేసింది. అప్పటికే కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఆర్డర్లు అందుకోని వాళ్లంతా ఒక్కసారిగా ఆమెకు ఎదురు తిరిగారు.  అమెరికా సెక్యురిటీ ఎక్సేంజ్ కమిషన్, స్టేట్ హెల్త్ డిపార్ట్ మెంట్స్, మెడికేర్, మెడికైడ్ సెంటర్లు, యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ లు  హోమ్స్ కంపెనీపై విచారణ కొనసాగించాయి. ఆపై వ్యవహారమంతా కోర్టుకు చేరింది. దీంతో ఒక హై ప్రొఫైల్‌ కేసుగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ వ్యవహారం. అప్పటి నుంచి థెరానోస్‌ పతనం మొదలైంది.


భర్త బిల్లీ ఎవాన్స్‌తో..

ఎంత శిక్ష అంటే.. 
థెరానోస్‌ వ్యవహారంలో సంక్లిష్టమైన, సుదీర్ఘమైన విచారణ జరిగింది. మొత్తం 11 అభియోగాలు ఎలిజబెత్‌ హోమ్స్‌కు వ్యతిరేకంగా దాఖలయ్యాయి. 11 వారాల ప్రాసిక్యూషన్‌, 24 మంది ప్రత్యక్ష సాక్షుల విచారణతో సాగింది. ఆ మెషిన్లు పని చేయవనే విషయం ఆమెకూ తెలుసని, అయినా ఇన్వెస్టర్లను, పేషెంట్లను తప్పుదోవ పట్టించిందని  కోర్టు నిర్ధారించుకుంది.పెట్టుబడిదారులను దారుణంగా మోసగించిన ఆ అభియోగాల్లో.. కేవలం నాలిగింటిని మాత్రమే కోర్టు అంగీకరించింది. హోమ్స్‌ను దోషిగా గుర్తించింది. కానీ, శిక్ష కాలం ఎంతో వెల్లడించలేదు. నేరం తీవ్రత ఆధారంగా ఒక్కో అభియోగంపై 20 ఏళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడే అవకాశం ఉంది. అలా 37 ఏళ్ల ఎలిజబెత్‌ బయోటెక్‌ స్టార్‌ నుంచి ఒక మోసగత్తే ట్యాగ్‌ తగిలించుకుని కటకటాల వైపు అడుగులు వేస్తోంది. అయితే ఈ శిక్షపై అప్పీల్‌కు వెళ్లే అవకాశమూ కోర్టు ఎలిజబెత్‌కు కల్పించింది కూడా.  


రమేష్ "సన్నీ" బల్వానీ

పనిలో పనిగా.. 
థెరానోస్‌ వ్యవహారాలను చూసుకునేందుకు రమేష్ "సన్నీ" బల్వానీని నియమించుకుంది హోమ్స్. అతను ఆమె కంటే వయసులో ఇరవై ఏళ్లు పెద్ద. అయినా ఇద్దరూ డేటింగ్‌ చేశారు. అయితే ఎప్పుడైతే ఆమె మోసం బయటపడిందో..  బల్వానీ సైతం ఇరికించాలని ఆమె ప్రయత్నించింది. బాల్వానీ పెద్ద మోసగాడని, తనను టార్చర్‌ చేసేవాడని, లైంగిక దాడికి సైతం ప్రయత్నించేవాడని జ్యూరీ ఎదుట కన్నీళ్లు పెట్టుకుంది. కానీ, కోర్టు మాత్రం ఆ కన్నీళ్లను నమ్మలేదు. పక్కా విచారణ తర్వాతే బల్వానీని నిర్దోషిగా తేల్చింది. అయితే థెరానోస్‌ తర్వాతి కష్టకాలం నుంచి.. ఇప్పుడు కోర్టు హాజరుదాకా ప్రతి క్షణం ఆమెకు అండగా ఉంటూ వస్తున్నాడు భర్త బిల్లీ ఎవాన్స్‌( హోటళ్ల నిర్వాహకుడు).    

స్టీవ్‌ జాబ్స్‌ను బోల్తా కొట్టించింది
అందం మాత్రమే కాదు.. తేనేలూరే మాటలతో ఎదుటివాళ్లను ఆకట్టుకునేది ఎలిజబెత్‌ హోమ్స్‌.  అంతెందుకు యాపిల్‌ ఫౌండర్‌, మాజీ సీఈవో స్టీవ్‌ జాబ్స్‌ సైతం ఆమె ఉపన్యాసాలకు ఫిదా అయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు.. ఆమె ఎంత మాటకారి అన్నది. అయితే ఇన్వెస్టర్లను ఎట్రాక్ట్‌ చేయడానికి ఎలిజబెత్‌ హోమ్స్‌ ‘వాయిస్‌ ట్రిక్స్‌’ ఉపయోగించేదన్న ఆరోపణ కూడా ఉంది. అయితే ఇప్పుడు విస్తృతంగా నడుస్తున్న చర్చ ఏంటంటే.. ఇన్నేళ్లపాటు అంతేసి మందిని ఎలిజబెత్‌ ఎలా బురిడీ కొట్టించగలిగిందనే!!. 

-సాక్షి, వెబ్‌స్పెషల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement