అమెరికా వెళ్లే భారత విద్యార్థుల్లో అయోమయం! | students need not worry, come with proper documentation, say universities | Sakshi
Sakshi News home page

అమెరికా వెళ్లే భారత విద్యార్థుల్లో అయోమయం!

Published Mon, Dec 21 2015 10:58 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికా వెళ్లే భారత విద్యార్థుల్లో అయోమయం! - Sakshi

అమెరికా వెళ్లే భారత విద్యార్థుల్లో అయోమయం!

పారిస్ ఉగ్రవాదదాడి అనంతరం అమెరికా కస్టమ్స్, సరిహద్దు రక్షణ దళం భద్రత నిబంధనలను కఠినతరం చేసింది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండు యూనివర్సిటీలను బ్లాక్‌లిస్టులో పెట్టారని, అందువల్ల వాళ్లకు అమెరికా ప్రవేశం దుర్లభం అవుతోందని గత రెండు రోజులుగా దుమారం రేగుతోంది. కానీ, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ రెండూ మాత్రం.. తమ వర్సిటీలు బ్లాక్‌లిస్టులో లేవని స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని రెండు యూనివర్సిటీలు విడివిడిగా విడుదల చేసిన ప్రకటనలలో తెలిపాయి.

అవసరమైతే తమను నేరుగా ఈ మెయిల్ ద్వారా సంప్రదించాలని యూనివర్సిటీలలో చేరేందుకు ఇప్పటికే బయల్దేరిన, బయల్దేరుతున్న విద్యార్థులకు తెలిపాయి. కొత్తగా వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా ఈ కింది జాబితాలోని పత్రాల అసలు కాపీలను వెంట ఉంచుకోవాలని, అలా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెబుతున్నాయి. బ్లాక్ లిస్ట్ లో తమ యూనివర్సిటీలు లేవని వాటి యజమాన్యాలు పేర్కొంటుండగా, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తరాదనే భావనతోనే ఎయిర్ ఇండియా వారి ప్రయాణాన్ని రద్దు చేసినట్లు వెల్లడించింది. ఏది ఏమైతేనేం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలని కలలుకన్న భారత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తోంది.

అవసరమైన పత్రాలు

  • పాస్‌పోర్టు, వీసా
  • విద్యాసంస్థ జారీచేసిన ఐ-20
  • విద్యాసంస్థ ఇచ్చిన అడ్మిషన్ ప్యాకేజి
  • ఆర్థిక వెసులుబాటుకు సంబంధించిన ఆధారాలు
  • విద్యాసంస్థకు దరఖాస్తు చేసేటప్పుడు ఉపయోగించిన అధికారిక ట్రాన్స్‌స్క్రిప్ట్, సర్టిఫికెట్లు


ఇప్పటికే చదువుతున్న విద్యార్థులైతే..

  • అమెరికాలో చదువుతున్నట్లుగా రుజువుచేసే అధికారిక ట్రాన్స్‌స్క్రిప్ట్ లేదా డిగ్రీ సర్టిఫికెట్
  • విద్యాసంస్థ జారీచేసిన ట్రావెల్ డాక్యుమెంటు
  • ఆరోగ్య కారణాలతో సెలవు తీసుకుంటే.. దాన్ని రుజువు చేసే పత్రాలు


గత రెండు మూడు రోజులుగా అమెరికాలో చదివేందుకు వెళ్తున్న విద్యార్థులకు ఎయిరిండియా వర్గాల నుంచి కొంత చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన 19 మంది విద్యార్ధులు అక్కడికి చేరుకోవడానికి ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అయితే అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఈ రెండు యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్లో ఉంచారనే సాకుతో ఎయిర్ ఇండియా అధికారులు వీరికి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులకు వారి ప్రయాణ ఛార్జీలు తిరిగి చెల్లించినట్లు అధికారులు చెప్పారు.

తమకు అన్ని రకాల అనుమతులు సక్రమంగానే ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. తమకు అమెరికా కాన్సులేట్ వీసా జారీచేసిన తర్వాత ఎయిర్ పోర్టు అధికారులు ఇలాంటి సాకులు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎంట్రీ వీసాలు ఉన్నందున మరో విమానయాన సంస్థ ద్వారానైనా అక్కడకు చేరుకుంటామంటున్నారు. తాము అడ్మిషన్ పొందిన యూనివర్సిటీలకు అక్రిడిటేషన్ ఉండని, గతంలో కూడా ఎంతో మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీలకు ఉన్నత చదువులకు వెళ్లారని అంటున్నారు.

సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీలో చేరేందుకు వెళ్లే విద్యార్థులైతే admissions@svuca.edu అనే ఈ మెయిల్‌కు, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలో చేరేందుకు వెళ్లే విద్యార్థులైతే admissions@npu.edu అనే ఈ మెయిల్‌కు నేరుగా సంప్రదించాలని తెలిపారు.

అమెరికా క్లియరెన్స్ ఇవ్వగానే విద్యార్థులను అనుమతిస్తాం
హైదరాబాద్: విద్యార్థుల డబ్బు వృథా కాకూడదనే వాళ్లు అమెరికా వెళ్లకుండా ఆపినట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన 19 మందిని ఎయిర్ ఇండియా వర్గాలు శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ఆపేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. రెండు కాలిఫోర్నియా వర్సిటీలను పరిశీలనలో ఉంచినట్లు తమకు డిసెంబర్ 19న అమెరికా అధికారుల నుంచి సమాచారం వచ్చిందని తెలిపింది. అప్పటికే శాన్ఫ్రాన్సిస్కో చేరిన 14 మంది విద్యార్థులను కూడా వెనక్కి పంపేస్తున్నట్టు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.  

విద్యార్థుల డబ్బు వృథా కాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు ఎయిర్ ఇండియా పేర్కొంది. టిక్కెట్లు రద్దు చేసుకుంటే వారికి పూర్తిస్థాయిలో నగదు చెల్లింపులు ఉంటాయంది. ఒకవైపే టిక్కెట్ బుక్ చేసుకుని వెళ్లే.. తిరిగి రావడానికి ఎక్కువ డబ్బు పెట్టాల్సి ఉంటుందని చెప్పింది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యానే తాము వారికి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ఈ రెండు యూనివర్సిటీల గురించి అమెరికా క్లియరెన్స్ ఇవ్వగానే విద్యార్థులను అనుమతిస్తామని పేర్కొంది. అదనంగా వారి నుంచి డబ్బులు వసూలు చేయకుండా అక్కడకు తీసుకెళ్తామని ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది.

విదేశాంగ మంత్రితో చర్చిస్తా...
‘‘అమెరికాలో యూనివర్సిటీలకు చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులను వారి శ్రేయస్సు మేరకే ఆపుతాం. కొన్ని వర్సిటీలకు గుర్తింపు సమస్యలు ఉన్నాయని ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను అనుమతించడం లేదు. ఎయిర్ ఇండియా విమాన సంస్థ మాత్రమే. యూఎస్ వెళ్లి.. అక్కడ అనుమతి లభించని విద్యార్థులు సొంత ఖర్చులతో తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై విదేశాంగ మంత్రితో చర్చిస్తాం.’’  
- కేంద్ర పౌర విమాన యాన మంత్రి అశోక్‌గజపతి రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement