NRI students
-
ఇంగ్లిష్ మాధ్యమమే భేష్
సాక్షి, అమరావతి: ‘చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్ మీడియంలో మాధ్యమంలో బోధన ఉంటేనే మంచిది. దానివల్ల పెద్దయ్యేకొద్దీ ఆంగ్ల ప్రావీణ్యం సులభంగా అలవడుతుంది. మాతృ భాష సహజంగా అలవడుతుంది. కానీ ఇంగ్లిష్ అలా కాదు. చిన్నప్పటి నుంచీ ఇంగ్లిష్ మీడియం ఉంటేనే తెలుగు మాదిరిగా ఆంగ్ల ప్రావీణ్యం లభిస్తుంది. కొన్ని సార్లు తప్పు చేసినా.. పై తరగతుల్లో వాటిని సరి చేసుకుని ఆంగ్ల ప్రావీణ్యం పెంచుకునే వీలుంటుంది. మేము చిన్నప్పుడు తెలుగు మీడియం, తర్వాత ఇంగ్లిష్ మీడియంలో చదివాం. దీంతో ఇంగ్లిష్ ఫ్లూయన్సీ లేక మొదట్లో ఇక్కడ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇతర దేశాల్లోనే కాదు మన దేశంలో సైతం ఇంగ్లిష్ నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకుని పిల్లలు, తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే ఇంగ్లిష్ ఉండేలా చూసుకోవాలి’ ► అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న, ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసాంధ్రులు ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు. ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియం, ఇంగ్లిష్ భాష నైపుణ్యం వల్ల కలిగే ప్రయోజనాలపై పలువులు ప్రవాసాంధ్ర విద్యార్థులు, ఉద్యోగుల అనుభవాలు వివరించారు. అవేంటో వారి మాటల్లోనే.. భవిష్యత్తుకు బలమైన పునాది ‘ఇంగ్లిష్’ చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియం. నా స్నేహితులు కొంతమంది తెలుగు మీడియంలో చదవడం వల్ల బీటెక్‌లో ఇబ్బంది పడ్డారు. సబ్జెక్ట్ నైపుణ్యం ఉన్నా.. ఇంగ్లిష్ ఇబ్బంది వల్ల తమ ఆలోచనల్ని వ్యక్తపరిచే వాళ్లు కాదు. ఈ కారణంతోనే నాతో పాటు ఉన్నత విద్యకు అమెరికా రాలేక పోయారు. చిన్నప్పుడు మాతృ భాష అలవడుతుంది. స్కూల్లోనూ సబ్జెక్టుగా తెలుగు ఉంటుంది. పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్ ఉంటే మనకు భవిష్యత్తుకు అవసరమైన ఆంగ్ల పరిజ్ఞానానికి బలమైన పునాది పడుతుంది. ఇంగ్లిష్ మీడియంలో అభ్యసిస్తేనే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటాం. –వరుణ్, ఎమ్మెస్, పోర్ట్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ ఆత్మ స్థైర్యం కోల్పోయాను తెలుగు మీడియంలో చదివి.. పై చదువులకు ఇంగ్లిష్ మీడియంలోకి మారాను. ఇంగ్లిష్ నైపుణ్యం లేకపోవడం వల్ల ఉన్నత చదువులకు అవసరమైన ప్రక్రియల విషయంలో చాలా మంది విద్యార్థులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. తెలుగు మీడియం వారు ఉన్నత విద్య, ఉద్యోగ ఇంటర్వ్యూల సమయంలో ఇంగ్లిష్ మీడియం వారితో పోటీ పడలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రతీదీ ఇంగ్లిష్తో ముడిపడింది. వాటిని అందుకోవాలంటే ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకోవాల్సిందే. ఇందుకోసం చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలి. –ఎ.రాజేశ్, ఎమ్మెస్, కాలిఫోర్నియా ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్, వర్జీనియా ఇంగ్లిష్ నైపుణ్యం లేక అవకాశాలు పోయాయి నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదవడంతో అమెరికా వచ్చిన తొలి రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డాను. సబ్జెక్ట్ నైపుణ్యం ఉన్నా భావ వ్యక్తీకరణ ఇబ్బంది ఎదురయ్యేది. దీని వల్ల అవకాశాలు కూడా కోల్పోయాను. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కింది తరగతుల నుంచే ఇంగ్లిష్‌లో బోధన ఉండేలా చేయాలి. –సుధాకర్ గౌతమ్, ఎమ్మెస్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జిపోర్టు ప్రపంచంతో పోటీపడవచ్చు ఇంగ్లిష్‌పై పట్టు లేక.. మంచి ఉద్యోగాలు రాక ఇక్కడ మన వాళ్లు చాలా కష్టపడుతుంటారు. ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడలేక చాలా మంచి అవకాశాలు కోల్పోతుంటారు. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే ప్రపంచంతో పోటీపడవచ్చు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివించే అవకాశం వదులుకోవద్దు. తల్లిదండ్రులు దీనిపై దృష్టి పెట్టాలి. కార్పొరేట్ స్కూళ్లలో చదువుకునే అవకాశం అందరికీ ఉండదు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం. రాబోయే తరాలకు ఇది మంచి అవకాశం. – పి. దుర్గాచరణ్, ఫుల్‌స్టాక్ డెవలపర్, అమెరిహెల్త్ కారిటాస్, ఫిలడెల్ఫియా పొరపాట్లు దొర్లినా సరిదిద్దుకునే అవకాశం చిన్నప్పటి నుండే ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటేనే విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఒక్కసారిగా పై తరగతుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడితే... ఇటు సబ్జెక్ట్ అటు ఇంగ్లిష్ రెండూ రాక చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు. దేశంలో లక్షల మందికి అవకాశాలు లేకపోవడానికి ఇదే కారణం. ఇంగ్లిష్ ప్రావీణ్య కోర్సులు ప్రవేశ పెట్టినంత మాత్రానా ఆ భాషపై పట్టు లభించదు. – జి.నాగశ్రీనివాసులు, సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీ, కనెక్టికట్ చిన్నప్పుడైతేనే సులభంగా గ్రహించగలరు ఇంగ్లిష్ మీడియం బోధన చిన్నప్పటి నుంచే మొదలవ్వాలి. చిన్నతనంలోనే ఏదైనా సులభంగా నేర్చుకుని, గ్రహించగలిగి, ఆకళింపు చేసుకుంటారనేది వాస్తవం. ఇంగ్లిష్ రాక పోవడం వల్ల ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్య కోర్సుల్లో ఎంతో మంది వెనుకబడి పోతున్నారు. సబ్జెక్ట్ ఉన్నా వ్యక్తీకరించలేక అవకాశాలు కోల్పోతున్నారు. తల్లితండ్రులు ఇంగ్లిష్ మీడియం బోధన ఉండేలా చూసుకోవాలి. – నాగసాయి శశాంక్, ఎమ్మెస్, విల్మింగ్టన్ యూనివర్సిటీ, న్యూక్యాజిల్ -
తెలుగువారికి అండగా..
సాక్షి, అమరావతి: అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో అక్కడ చిక్కుకుపోయిన వేలాది తెలుగు విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అక్కడి విద్యార్థులకు ఆర్థిక, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురుకాకుండా చూసేందుకు జాగ్రత్తలు తీసుకుంది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్స్ (ఆపి), నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) తదితర సంస్థల ద్వారా విద్యార్థులకు సహకారం అందేలా చర్యలు చేపట్టింది వర్సిటీలతో సంప్రదింపులు ► తెలుగు విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉన్న అమెరికా యూనివర్సిటీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ► యూటీ డల్లాస్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ – డెంటాన్, టెక్సాస్ ఏ అండ్ ఎం కాలేజ్ స్టేషన్, జార్జియా టెక్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, లూసియానా స్టేట్ యూనివర్సిటీ, టెక్సాస్ ఏ అండ్ ఎం కార్పస్ క్రిస్టి, సదరన్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ, క్రిస్టియన్ బ్రదర్స్ యూనివర్సిటీ, టెన్నెస్సీ టెక్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, టల్ లహస్సీ తదితర వర్సిటీల్లో మన తెలుగు విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉన్నారు. ► విద్యార్థులకు ఏ సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికాలోని ఏపీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు ‘సాక్షి’కి చెప్పారు. ► విద్యార్థుల్ని ఫ్లాట్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ వస్తున్న ప్రచారం వాస్తవం కాదని.. ఏ విద్యార్థికీ ఇలాంటి ఇబ్బంది వస్తే వెంటనే ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐఎస్ఏ)ను నేరుగా సంప్రదించవచ్చన్నారు. విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రతి వర్సిటీలో కో–ఆర్డినేటర్లు ఉన్నారన్నారు. ► యూనివర్సిటీలు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయని, విద్యార్థులు వర్సిటీ క్యాంపస్‌లను వినియోగించనందున స్టైఫండ్ రూపంలో కొంత మొత్తం తిరిగి చెల్లిస్తున్నాయన్నారు. భయమొద్దు.. మేమున్నాం తెలుగు విద్యార్థుల యోగక్షేమాల గురించి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదు. సీఎం జగన్ సూచనల మేరకు విద్యార్థులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. – డాక్టర్ కుమార్ అన్నవరపు, అట్లాంటా, యూఎస్ఏ email: saikumarannavarapu@gmail. com (+16786407682) ‘ఆపి’ ఆపన్న హస్తం అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్స్ (ఆపి) ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థుల సంరక్షణ, సహాయం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశాం. ‘ఆపి’ వైద్యులు సదా అందుబాటులో ఉంటారు. – డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ, ‘ఆపి’ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జాగ్రత్తలు తీసుకున్నాం లూసియానాలోని సదరన్ వర్సిటీతో పాటు ఇతర వర్సిటీల్లోని విద్యార్థులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనవాళ్లెవరూ కరోనా బారినపడలేదు. –శ్రీనివాసరెడ్డి గవిని, సదరన్ వర్సిటీ ప్లానింగ్ డైరెక్టర్, లూసియానా email: reddy& gavini@ subr.edu (225 771 2277) ‘నాటా’ బాసట నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ఆధ్వర్యంలో యూఎస్‌లోని తెలుగు విద్యార్థులకు సేవలు అందిస్తున్నాం. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. – డాక్టర్ రాఘవరెడ్డి, అధ్యక్షుడు, నాటా ఫెలోషిప్స్ ఆపలేదు అమెరికా వర్సిటీల్లో ఫెలోషిప్స్ ఆపేశారన్నది అవాస్తవం. విద్యార్థుల క్షేమంపై మేమంతా శ్రద్ధ వహించాం. ఎలాంటి ఇబ్బందుల్లేవు. – ప్రొఫెసర్ అప్పారావు, డైరెక్టర్, క్లెమ్సెన్ యూనివర్సిటీ email: arao@clemson.edu భద్రంగా ఉన్నారు మన విద్యార్థులు భద్రంగా ఉన్నారు. ఎటువంటి అవసరమొచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చు. – ప్రొఫెసర్ శ్రీనివాసరావు మెంట్రెడ్డి్డ, అలబామా ఏ అండ్ ఎం యూనివర్సిటీ email: srinivasa.mentreddy@aamu.edu మేమంతా క్షేమం తెలుగు విద్యార్థులకు ఎలాంటి భయం లేదు. మేమంతా ఇక్కడ క్షేమంగా ఉన్నాం. – రవితేజ పసుమర్తి, కెన్నెస్సీ స్టేట్ వర్సిటీ విద్యార్థి, అల్ఫారెటా -
ఎన్ఆర్ఐ విద్యార్థులకు ఎస్పీఎంవీవీ సర్టిఫికెట్లు
డల్లాస్: వంది మంది ఎన్ఆర్ఐ విద్యార్థులకు శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం(ఎస్పీఎంవీవీ) మ్యూజిక్ కోర్సు సర్టిఫికెట్లను ప్రదానం చేసింది. ఎస్పీఎంవీవీ సహకారంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో అమెరికాలో క్లాసికల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కోర్సులను గత సంవత్సరం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్, ప్రొఫెసర్ వి. దుర్గా భవానితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని టెక్సాస్‌లో ప్లానోలోని మినర్వా హోటల్లో తానా సభ్యులు నిర్వహించారు. సుస్వర మ్యూజిక్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఆలపించిన మధురమైన గీతాలు అందిరిని ఆకట్టుకున్నాయి. తానా, ఎస్పీఎంవీవీ సహాకారంతో అందిస్తున్న కల్చరల్ డ్యాన్స్, మ్యూజిక్ కోర్సులను నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను డా. ప్రసాద్ తోటకూర వివరించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ కోర్సులను విజయవంతంగా పూర్తిచేసిన 100 మంది విద్యార్థులకు ప్రొఫెసర్ భవాని సర్టిఫికేట్స్‌ను అందజేశారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, వారి తల్లీతండ్రులను ఉద్దేశించి భవాని మాట్లాడారు. విజయవంతంగా కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా డల్లాస్ ప్రాంతీయ ప్రతినిధి సుగన్ చాగర్లమూడి, తానా కల్చరల్ సర్వీసెస్ కోఆర్డినేటర్, తానా ఎస్పీఎంవీవీ డ్యాన్స్ కోర్సుల నేషనల్ కోఆర్డినేటర్ డా. రాజేష్ అడుసుమిల్లి, తానా-ఎస్పీఎంవీవీ మ్యూజిక్ కోర్సుల నేషనల్ కోఆర్డినేటర్ అనిపింది మీనాక్షి, తానా బోర్డ్ చైర్పర్సన్ చల కొండ్రకుంట, ప్రముఖ డ్యాన్స్ గురు కళారత్న సత్యనారాయణలు పాల్గొన్నారు. -
అమెరికాలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
వాషింగ్టన్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు వేడుకలను అమెరికాలోని ఎన్ఆర్ఐ విద్యార్థులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని అయోవా రాష్ట్రం డెస్ మోయినెస్ నగరంలో ఎన్ఆర్ఐ విద్యార్థులు కేసీఆర్ 63వ జన్మదినోత్సవాన్ని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, సుదీర్ఘకాలం సంతోషంగా జీవితం గడపాలని ఎన్ఆర్ఐ విద్యార్ధులు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో నవతేజ, ప్రదీప్ చంద్ర, రవి, సంతోష్, రాధాక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా వెళ్లే భారత విద్యార్థుల్లో అయోమయం!
పారిస్ ఉగ్రవాదదాడి అనంతరం అమెరికా కస్టమ్స్, సరిహద్దు రక్షణ దళం భద్రత నిబంధనలను కఠినతరం చేసింది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండు యూనివర్సిటీలను బ్లాక్‌లిస్టులో పెట్టారని, అందువల్ల వాళ్లకు అమెరికా ప్రవేశం దుర్లభం అవుతోందని గత రెండు రోజులుగా దుమారం రేగుతోంది. కానీ, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ రెండూ మాత్రం.. తమ వర్సిటీలు బ్లాక్‌లిస్టులో లేవని స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని రెండు యూనివర్సిటీలు విడివిడిగా విడుదల చేసిన ప్రకటనలలో తెలిపాయి. అవసరమైతే తమను నేరుగా ఈ మెయిల్ ద్వారా సంప్రదించాలని యూనివర్సిటీలలో చేరేందుకు ఇప్పటికే బయల్దేరిన, బయల్దేరుతున్న విద్యార్థులకు తెలిపాయి. కొత్తగా వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా ఈ కింది జాబితాలోని పత్రాల అసలు కాపీలను వెంట ఉంచుకోవాలని, అలా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెబుతున్నాయి. బ్లాక్ లిస్ట్ లో తమ యూనివర్సిటీలు లేవని వాటి యజమాన్యాలు పేర్కొంటుండగా, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తరాదనే భావనతోనే ఎయిర్ ఇండియా వారి ప్రయాణాన్ని రద్దు చేసినట్లు వెల్లడించింది. ఏది ఏమైతేనేం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలని కలలుకన్న భారత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అవసరమైన పత్రాలు పాస్‌పోర్టు, వీసా విద్యాసంస్థ జారీచేసిన ఐ-20 విద్యాసంస్థ ఇచ్చిన అడ్మిషన్ ప్యాకేజి ఆర్థిక వెసులుబాటుకు సంబంధించిన ఆధారాలు విద్యాసంస్థకు దరఖాస్తు చేసేటప్పుడు ఉపయోగించిన అధికారిక ట్రాన్స్‌స్క్రిప్ట్, సర్టిఫికెట్లు ఇప్పటికే చదువుతున్న విద్యార్థులైతే.. అమెరికాలో చదువుతున్నట్లుగా రుజువుచేసే అధికారిక ట్రాన్స్‌స్క్రిప్ట్ లేదా డిగ్రీ సర్టిఫికెట్ విద్యాసంస్థ జారీచేసిన ట్రావెల్ డాక్యుమెంటు ఆరోగ్య కారణాలతో సెలవు తీసుకుంటే.. దాన్ని రుజువు చేసే పత్రాలు గత రెండు మూడు రోజులుగా అమెరికాలో చదివేందుకు వెళ్తున్న విద్యార్థులకు ఎయిరిండియా వర్గాల నుంచి కొంత చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన 19 మంది విద్యార్ధులు అక్కడికి చేరుకోవడానికి ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అయితే అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఈ రెండు యూనివర్సిటీలను బ్లాక్ లిస్ట్‌లో ఉంచారనే సాకుతో ఎయిర్ ఇండియా అధికారులు వీరికి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులకు వారి ప్రయాణ ఛార్జీలు తిరిగి చెల్లించినట్లు అధికారులు చెప్పారు. తమకు అన్ని రకాల అనుమతులు సక్రమంగానే ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. తమకు అమెరికా కాన్సులేట్ వీసా జారీచేసిన తర్వాత ఎయిర్ పోర్టు అధికారులు ఇలాంటి సాకులు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎంట్రీ వీసాలు ఉన్నందున మరో విమానయాన సంస్థ ద్వారానైనా అక్కడకు చేరుకుంటామంటున్నారు. తాము అడ్మిషన్ పొందిన యూనివర్సిటీలకు అక్రిడిటేషన్ ఉండని, గతంలో కూడా ఎంతో మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీలకు ఉన్నత చదువులకు వెళ్లారని అంటున్నారు. సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీలో చేరేందుకు వెళ్లే విద్యార్థులైతే admissions@svuca.edu అనే ఈ మెయిల్‌కు, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలో చేరేందుకు వెళ్లే విద్యార్థులైతే admissions@npu.edu అనే ఈ మెయిల్‌కు నేరుగా సంప్రదించాలని తెలిపారు. అమెరికా క్లియరెన్స్ ఇవ్వగానే విద్యార్థులను అనుమతిస్తాం హైదరాబాద్: విద్యార్థుల డబ్బు వృథా కాకూడదనే వాళ్లు అమెరికా వెళ్లకుండా ఆపినట్లు ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన 19 మందిని ఎయిర్ ఇండియా వర్గాలు శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ఆపేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. రెండు కాలిఫోర్నియా వర్సిటీలను పరిశీలనలో ఉంచినట్లు తమకు డిసెంబర్ 19న అమెరికా అధికారుల నుంచి సమాచారం వచ్చిందని తెలిపింది. అప్పటికే శాన్ఫ్రాన్సిస్కో చేరిన 14 మంది విద్యార్థులను కూడా వెనక్కి పంపేస్తున్నట్టు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. విద్యార్థుల డబ్బు వృథా కాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు ఎయిర్ ఇండియా పేర్కొంది. టిక్కెట్లు రద్దు చేసుకుంటే వారికి పూర్తిస్థాయిలో నగదు చెల్లింపులు ఉంటాయంది. ఒకవైపే టిక్కెట్ బుక్ చేసుకుని వెళ్లే.. తిరిగి రావడానికి ఎక్కువ డబ్బు పెట్టాల్సి ఉంటుందని చెప్పింది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యానే తాము వారికి అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ఈ రెండు యూనివర్సిటీల గురించి అమెరికా క్లియరెన్స్ ఇవ్వగానే విద్యార్థులను అనుమతిస్తామని పేర్కొంది. అదనంగా వారి నుంచి డబ్బులు వసూలు చేయకుండా అక్కడకు తీసుకెళ్తామని ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది. విదేశాంగ మంత్రితో చర్చిస్తా... ‘‘అమెరికాలో యూనివర్సిటీలకు చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులను వారి శ్రేయస్సు మేరకే ఆపుతాం. కొన్ని వర్సిటీలకు గుర్తింపు సమస్యలు ఉన్నాయని ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను అనుమతించడం లేదు. ఎయిర్ ఇండియా విమాన సంస్థ మాత్రమే. యూఎస్ వెళ్లి.. అక్కడ అనుమతి లభించని విద్యార్థులు సొంత ఖర్చులతో తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై విదేశాంగ మంత్రితో చర్చిస్తాం.’’ - కేంద్ర పౌర విమాన యాన మంత్రి అశోక్‌గజపతి రాజు -
అమెరికాలో ఎన్నారై విద్యార్థులకు తీవ్రగాయాలు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ ట్రక్కును కారు ఢీకొనడంతో ఐదుగురు ఎన్నారై విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు న్యూ ఆర్లియాన్స్‌లో థాంక్స్‌గివింగ్ బ్రేక్‌కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. తాను వెళ్తున్న లేన్‌లోనే భారీ ట్రక్కు ఉండటంతో దాన్ని తప్పించడానికి డ్రైవర్ చాలా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గాయపడిన వాళ్లలో ప్రాణన్ కన్నన్ (22), అక్షయ్ జైన్ (22), చిరంజీవి బోరే (23), షచిత్ అయ్యర్ (23), కిషన్ బజాజ్ (24) ఉన్నారు. వీరందరినీ వెంటనే ఆస్పత్రులకు తరలించారు. వీరిలో అక్షయ్ జైన్, కిషన్ బజాజ్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో.. వాళ్లను హెలికాప్టర్లలో మెమోరియల్ హెర్మన్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యచికిత్సలు అందించేందుకు అమెరికాలో ఉన్న భారతీయులు విరాళాలు సేకరిస్తున్నారు. ట్రక్కు డ్రైవర్ క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
స్విమ్స్‌లో ఎన్ఆర్ఐ కోటా 15 శాతం సీట్లు
సాక్షి, హైదరాబాద్: తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఈ ఏడాది చేరగోరే ఎన్నారై విద్యార్థులకు 15 శాతం సీట్లు కేటాయించాలని స్విమ్స్ పాలకమండలి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ కళాశాలలో ఎన్ఆర్ఐ విద్యార్థులకు 20 వేల డాలర్లు ఫీజుగా పేర్కొన్నారు. రాష్ట్రేతర విద్యార్థులకు 15 శాతం సీట్లు, రూ.60 వేల ఫీజుగా నిర్ణయించారు. రాష్ట్ర వాసులకు రూ. 60 వేల ఫీజుతో మిగిలిన 70 శాతం సీట్లు కేటాయించారు. -
అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థుల అదృశ్యం
అమెరికాలోని న్యూయార్క్ నగరం నుంచి పది రోజుల క్రితం ఓ భారతీయ నర్సింగ్ విద్యార్థి అదృశ్యం అయ్యి, ఇంకా దొరక్కముందే ఫ్లోరిడాలో మరో భారతీయ విద్యార్థి అనుమానాస్పద రీతిలో అదృశ్యమయ్యాడు. పనామా సిటీ బీచ్‌కి శనివారం నాడు వచ్చిన రెనీ జోస్ అనే విద్యార్థి సోమవారం సాయంత్రం నుంచి అదృశ్యం అయినట్లు ఫ్లోరిడీ బే కౌంటీ షెరిఫ్ కార్యాలయం తెలిపింది. ఇంటి వెనుక ఉన్న చెత్తకుప్పలోమాత్రం అతడి దుస్తులు కనిపించాయి. అతడు చదువుతున్న రైస్ యూనివర్సిటీ కూడా అతడు అదృశ్యమైన విషయాన్ని నిర్ధారించింది. జోస్ ముందుగా లాథమ్లోని షకేర్ హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసి, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ కోసం రైస్ యూనివర్సిటీలో చేరినట్లు అతడి ఫేస్బుక్ పేజీ ద్వారా తెలిసింది. అతడి సోదరి రేష్మా తన సోదరుడి ఆచూకీ తెలుసుకోడానికి ఫేస్బుక్ పేజీ ఒకటి క్రియేట్ చేసింది. ఇంతకుముందు జాస్మిన్ వి. జోసెఫ్ (22) అనే విద్యార్థిని కూడా అదృశ్యం అయ్యింది. ఆమె ఆచూకీ తెలుసుకోడానికి స్థానికులు సాయం చేయాలని పోలీసులు కోరారు. తమ కుమార్తెకు న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరేందుకు ఫీజు కట్టినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతుండగా, యూనివర్సిటీ వాళ్లు మాత్రం ఆమె గత మే నెల నుంచి తమ వర్సిటీలో చేరలేదని అంటున్నారు. ఆమె క్లాసులకు వెళ్తోందో లేదో తల్లిదండ్రులకు తెలీదని, ఆమె మార్కులు కూడా వాళ్లెప్పుడూ చూడలేదని చెబుతున్నారు. తమ కుమార్తె ప్రవర్తన పట్ల కూడా వారికి ఎప్పుడూ అనుమానం రాలేదు. ఆమె ఆచూకీ తెలుసుకోడానికి వాళ్లిప్పుడు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.