ఇంగ్లిష్‌ మాధ్యమమే భేష్‌ | NRI students in America Comments With Sakshi | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ మాధ్యమమే భేష్‌

Published Tue, Apr 28 2020 3:27 AM | Last Updated on Tue, Apr 28 2020 8:20 AM

NRI students in America Comments With Sakshi

సాక్షి, అమరావతి: ‘చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌ మీడియంలో మాధ్యమంలో బోధన ఉంటేనే మంచిది. దానివల్ల పెద్దయ్యేకొద్దీ ఆంగ్ల ప్రావీణ్యం సులభంగా అలవడుతుంది. మాతృ భాష సహజంగా అలవడుతుంది. కానీ ఇంగ్లిష్‌ అలా కాదు. చిన్నప్పటి నుంచీ ఇంగ్లిష్‌ మీడియం ఉంటేనే తెలుగు మాదిరిగా ఆంగ్ల ప్రావీణ్యం లభిస్తుంది. కొన్ని సార్లు తప్పు చేసినా.. పై తరగతుల్లో వాటిని సరి చేసుకుని ఆంగ్ల  ప్రావీణ్యం పెంచుకునే వీలుంటుంది. మేము చిన్నప్పుడు తెలుగు మీడియం, తర్వాత ఇంగ్లిష్‌ మీడియంలో చదివాం. దీంతో ఇంగ్లిష్‌ ఫ్లూయన్సీ లేక మొదట్లో ఇక్కడ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇతర దేశాల్లోనే కాదు మన దేశంలో సైతం ఇంగ్లిష్‌ నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకుని పిల్లలు, తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే ఇంగ్లిష్‌ ఉండేలా చూసుకోవాలి’
► అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న, ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసాంధ్రులు ‘సాక్షి’తో పంచుకున్న  అభిప్రాయాలు. ప్రస్తుతం ఇంగ్లిష్‌ మీడియం, ఇంగ్లిష్‌ భాష నైపుణ్యం వల్ల కలిగే ప్రయోజనాలపై పలువులు ప్రవాసాంధ్ర విద్యార్థులు, ఉద్యోగుల అనుభవాలు వివరించారు. అవేంటో వారి మాటల్లోనే.. 

భవిష్యత్తుకు బలమైన పునాది ‘ఇంగ్లిష్‌’
చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్‌ మీడియం. నా స్నేహితులు కొంతమంది తెలుగు మీడియంలో చదవడం వల్ల బీటెక్‌లో ఇబ్బంది పడ్డారు. సబ్జెక్ట్‌ నైపుణ్యం ఉన్నా.. ఇంగ్లిష్‌ ఇబ్బంది వల్ల తమ ఆలోచనల్ని వ్యక్తపరిచే వాళ్లు కాదు. ఈ కారణంతోనే నాతో పాటు ఉన్నత విద్యకు అమెరికా రాలేక పోయారు. చిన్నప్పుడు మాతృ భాష అలవడుతుంది. స్కూల్లోనూ సబ్జెక్టుగా తెలుగు ఉంటుంది. పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్‌ ఉంటే మనకు భవిష్యత్తుకు అవసరమైన ఆంగ్ల పరిజ్ఞానానికి బలమైన పునాది పడుతుంది. ఇంగ్లిష్‌ మీడియంలో అభ్యసిస్తేనే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటాం.     
–వరుణ్, ఎమ్మెస్, పోర్ట్‌ల్యాండ్‌ స్టేట్‌ యూనివర్సిటీ

ఆత్మ స్థైర్యం కోల్పోయాను
తెలుగు మీడియంలో చదివి.. పై చదువులకు ఇంగ్లిష్‌ మీడియంలోకి మారాను. ఇంగ్లిష్‌ నైపుణ్యం లేకపోవడం వల్ల ఉన్నత చదువులకు అవసరమైన ప్రక్రియల విషయంలో చాలా మంది విద్యార్థులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. తెలుగు మీడియం వారు ఉన్నత విద్య, ఉద్యోగ ఇంటర్వ్యూల సమయంలో ఇంగ్లిష్‌ మీడియం వారితో పోటీ పడలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రతీదీ ఇంగ్లిష్‌తో ముడిపడింది. వాటిని అందుకోవాలంటే ఇంగ్లిష్‌ నైపుణ్యం పెంచుకోవాల్సిందే. ఇందుకోసం చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకోవాలి.    
–ఎ.రాజేశ్, ఎమ్మెస్,     కాలిఫోర్నియా ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్స్, వర్జీనియా

ఇంగ్లిష్‌ నైపుణ్యం లేక అవకాశాలు పోయాయి
నేను చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదవడంతో అమెరికా వచ్చిన తొలి రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డాను. సబ్జెక్ట్‌ నైపుణ్యం ఉన్నా భావ వ్యక్తీకరణ ఇబ్బంది ఎదురయ్యేది. దీని వల్ల అవకాశాలు కూడా కోల్పోయాను. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కింది తరగతుల నుంచే ఇంగ్లిష్‌లో బోధన ఉండేలా చేయాలి. 
–సుధాకర్‌ గౌతమ్, ఎమ్మెస్, యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిడ్జిపోర్టు

ప్రపంచంతో పోటీపడవచ్చు
ఇంగ్లిష్‌పై పట్టు లేక.. మంచి ఉద్యోగాలు రాక ఇక్కడ మన వాళ్లు చాలా కష్టపడుతుంటారు. ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడలేక చాలా మంచి అవకాశాలు కోల్పోతుంటారు. ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుంటే ప్రపంచంతో పోటీపడవచ్చు. ప్రీ ప్రైమరీ నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో చదివించే అవకాశం  వదులుకోవద్దు. తల్లిదండ్రులు దీనిపై దృష్టి పెట్టాలి. కార్పొరేట్‌ స్కూళ్లలో చదువుకునే అవకాశం అందరికీ ఉండదు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం. రాబోయే తరాలకు ఇది మంచి అవకాశం.   
 – పి. దుర్గాచరణ్, ఫుల్‌స్టాక్‌ డెవలపర్, అమెరిహెల్త్‌ కారిటాస్, ఫిలడెల్ఫియా

పొరపాట్లు దొర్లినా సరిదిద్దుకునే అవకాశం
చిన్నప్పటి నుండే ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ఉంటేనే విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఒక్కసారిగా పై తరగతుల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశ పెడితే... ఇటు సబ్జెక్ట్‌ అటు ఇంగ్లిష్‌ రెండూ రాక చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు. దేశంలో లక్షల మందికి అవకాశాలు లేకపోవడానికి ఇదే కారణం. ఇంగ్లిష్‌ ప్రావీణ్య కోర్సులు ప్రవేశ పెట్టినంత మాత్రానా ఆ భాషపై పట్టు లభించదు. 
– జి.నాగశ్రీనివాసులు, సేక్రెడ్‌ హార్ట్‌ యూనివర్సిటీ, కనెక్టికట్‌

చిన్నప్పుడైతేనే సులభంగా గ్రహించగలరు
ఇంగ్లిష్‌ మీడియం బోధన చిన్నప్పటి నుంచే మొదలవ్వాలి. చిన్నతనంలోనే ఏదైనా సులభంగా నేర్చుకుని, గ్రహించగలిగి, ఆకళింపు చేసుకుంటారనేది వాస్తవం. ఇంగ్లిష్‌ రాక పోవడం వల్ల ఇంజనీరింగ్, ఇతర ఉన్నత విద్య కోర్సుల్లో ఎంతో మంది వెనుకబడి పోతున్నారు. సబ్జెక్ట్‌ ఉన్నా వ్యక్తీకరించలేక అవకాశాలు కోల్పోతున్నారు. తల్లితండ్రులు  ఇంగ్లిష్‌ మీడియం బోధన ఉండేలా చూసుకోవాలి. 
– నాగసాయి శశాంక్, ఎమ్మెస్, విల్మింగ్‌టన్‌ యూనివర్సిటీ, న్యూక్యాజిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement