ట్రంప్ వలసల నిషేధంపై సిలికాన్ వ్యాలీ ఫైర్
వాషింగ్టన్ : ఏడు ఇస్లామిక్ దేశాల నుంచి అమెరికాలోకి వలసలను నిషేధిస్తూ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీచేయడంపై సిలికాన్ వ్యాలీలోని టెక్నాలజీ దిగ్గజాల సీఈఓలు విమర్శల గళం వినిపించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్లతోపాటు యాపిల్, నెట్‌ఫ్లిక్స్, టెస్లా, ఫేస్‌బుక్, ఉబెర్ తదితర టాప్ అమెరికా కంపెనీలు ట్రంప్ చర్యలను తీవ్రంగా ఖండించాయి. ‘ఒక వలసదారుడిగా, కంపెనీ సీఈఓగా మా కంపెనీపై అదేవిధంగా దేశానికి, ప్రపంచానికి వలసలవల్ల కలిగే సానుకూల ప్రభావాన్ని నేను ప్రత్యక్షంగా చూశా. వలసలకు మా మద్దతు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది’ అని సత్య నాదెళ్ల లింక్‌్డఇన్ లో తన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు.
ఇలాంటి చర్యలు అమెరికాలోకి నిపుణుల రాకకు అడ్డంకిగా మారుతాయని పిచాయ్ వ్యాఖ్యానించారు. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జకర్‌బర్గ్ స్పందిస్తూ.. ‘అమెరికాను సురక్షితంగా ఉంచడం అవసరమే. ఇందుకు ప్రధానంగా ఎవరినుంచి ముప్పుఉందోవారిపై దృష్టిపెట్టాలి. అంతేకానీ ఉగ్రవాదానికి కారకులు కానివారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడం అమెరికా పౌరులందరి భద్రతను తగ్గిస్తుంది. ఎందుకంటే ఇలాంటి చర్యలకు వనరులను మళ్లించాల్సి ఉంటుంది కాబట్టి’ అని పేర్కొన్నారు. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా నిషేధాన్ని తీవ్రంగా ఖండించారు. ‘వలసదారులవల్లే మా కంపెనీ ఇంత గొప్ప విజయాన్ని సాధించగలిగింది. ఎవరికీ సమ్మతం కాని పాలసీ ఇది’ అన్నారు.