పౌరసత్వం లేకుంటే అమెరికా నుంచి పంపేస్తా: ట్రంప్
తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వాళ్లను దేశం నుంచి పంపేస్తానని రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పారు. అరిజోనాలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ ఆయనీ విషయం తెలిపారు. ఇప్పటికి దాదాపు కోటి మందికి పైగా అక్రమంగా అమెరికాలో ప్రవేశించారని, వాళ్లంతా తమ తమ దేశాలకు వెళ్లిపోయి, మళ్లీ వీసాకు దరఖాస్తు చేసుకుని రావాల్సిందేనని అన్నారు. అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించి ఆ తర్వాత పౌరసత్వం పొందాలనుకుంటే కుదరదని స్పష్టం చేశారు. ఎలాగోలా అమెరికా వచ్చేసి, ఇక్కడ సెటిలైపోయి, తర్వాత చట్టబద్ధత పొందాలనుకుంటున్నారని విమర్శించారు.
మెక్సికో - అమెరికాల మధ్య సరిహద్దు గోడకు తాము నయాపైస కూడా చెల్లించబోమని మెక్సికన్ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో స్పష్టంగా చెప్పినా.. ట్రంప్ మాత్రం ఈ సభలో ఆ సరిహద్దు గోడకు మెక్సికోయే డబ్బు చెల్లిస్తుందని అన్నారు. దక్షిణ సరిహద్దులో తాము ఓ పెద్ద గోడ నిర్మిస్తామని, దానికి మెక్సికో నూరుశాతం చెల్లిస్తుందని చెప్పారు. సరైన పత్రాలు లేని వాళ్లను అమెరికా నుంచి పంపేయడమే తన తొలి ప్రాధాన్యమని మరీ మరీ నొక్కిచెప్పారు.