వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల దరఖాస్తు ప్రక్రియను మరింత కఠినం చేస్తూ అమెరికాలో ట్రంప్ సర్కారు కొత్త ప్రతిపాదనలు తెచ్చింది. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు అవకాశం కల్పించడం, వారికి అత్యధిక వేతనాలు పొందేలా చూడటమే ఈ ప్రతిపాదనల లక్ష్యమని ప్రభుత్వం తన తాజా నోటీసుల పేర్కొంది. తాజా సవరణల కారణంగా అమెరికాలో ఉన్నత విద్యార్హతలు సాధించిన విదేశీయులు ఎక్కువ మందికి హెచ్1బీ వీసాలొస్తాయని ట్రంప్ సర్కారు చెబుతోంది. హెచ్1బీ వీసాపై విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే కంపెనీలు తమ దరఖాస్తులను ముందుగానే ఎలక్ట్రానిక్ విధానంలో నమోదు చేసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనను ప్రతిపాదించింది.
భారతీయ ఐటీ కంపెనీలు, వృత్తి నిపుణులు ఎక్కువగా ఆశించే హెచ్1బీ వీసా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. ఈ వీసా కింద సాంకేతిక నైపుణ్యం అవసరమైన ప్రత్యేక ఉద్యోగాలకు విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అక్కడి ప్రభుత్వం అనుమతినిస్తోంది. భారత్, చైనా తదితర దేశాలకు చెందిన నిపుణులను అమెరికాలోని ఐటీ కంపెనీలు హెచ్1బీ వీసాలపైనే ఉద్యోగులుగా నియమిస్తున్నాయి. అయితే, తమ ఉద్యోగులుగా నియమించనున్న విదేశీ నిపుణుల తరఫున కంపెనీలు దరఖాస్తులను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)లో ఎలక్ట్రానిక్ విధానంలో నమోదు చేయించుకోవాలనే కొత్త నిబంధన ప్రభుత్వం ప్రతిపాదించింది. నిర్దేశించిన గడువులోపే ఎలక్ట్రానిక్ నమోదు పూర్తవ్వాలని పేర్కొంది.
65వేల హెచ్1బీ వీసాలు
ప్రస్తుత విధానం ప్రకారం అమెరికా ఏటా 65,000 సాధారణ హెచ్1బీ వీసాలు, 20,000 అధిక విద్యార్హతల వీసాలు మంజూరు చేస్తోంది. అధిక విద్యార్హతలున్న వారు 20,000 కంటే ఎక్కువుంటే కంప్యూటర్ లాటరీ ద్వారా 20వేల మందినే ఎంపిక చేస్తోంది. మిగిలిన వారిని సాధారణ దరఖాస్తుదారులతో కలిపేసి వారిలోంచి 65,000 మందిని ఎంపిక చేస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం మొదట పరిమితి మేరకు 65,000 మందిని ఎంపిక చేస్తారు. వీరిలో అధిక విద్యార్హతలున్న వారూ కొంత మంది ఎంపికవుతారు. ఎంపికకాని అధిక విద్యార్హతలున్న వారందరినీ ప్రత్యేక కోటాలో చేర్చి వారిలోంచి 20,000 మందిని ఎంపిక చేస్తారు. అంటే, కోటా కింద ఎంపికయ్యే 20వేల మంది కాక, సాధారణ కోటాలో ఎంపికయ్యే వారిలోనూ అధిక విద్యార్హతలున్నవారు ఉండే అవకాశం ఉంది.
నిబంధనల మార్పు కారణంగా మొత్తం వీసాలు పొందిన వారిలో అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన వారు 16శాతం వరకు (5,340 మంది) పెరుగుతారని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) వివరించింది. తాజా ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా అక్కడి పౌరులను డీహెచ్‌ఎస్ కోరింది. జనవరి 2లోగా అభిప్రాయాలు సమర్పించాలని సూచించింది. ఎలక్ట్రానిక్ నమోదు ప్రక్రియతో ఉద్యోగుల కోసం సంస్థలు చేసే దరఖాస్తుల ఖర్చు తగ్గుతుందని, ఎంపిక ప్రక్రియ సమర్థవంతంగా పూర్తవుతుందని యుఎస్‌సీఐఎస్ తెలిపింది. వేల దరఖాస్తులను, ధ్రువీకరణ పత్రాలను ఒక్కొక్కటిగా పరిశీలించే శ్రమ తగ్గుతుందని, తుదిజాబితా కోసం ఎక్కువ కాలం వేచిచూడాల్సిన అవసరం ఉండదని పేర్కొంది. అమెరికన్ల ప్రయోజనాల కోసం వీసా నిబంధనలను మార్చాలని గత ఏడాది డీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment