వాషింగ్టన్: భారతీయ ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై పెను ప్రతికూల ప్రభావం చూపేలా హెచ్1–బీ వీసాల జారీలో అమెరికా భారీ మార్పులు చేసింది. విదేశీ కంపెనీల తరఫున అమెరికాలోని ‘థర్డ్ పార్టీ వర్క్ సైట్ల’లో పనిచేసేవారికి హెచ్–1బీ వీసాల జారీని కఠినంచేస్తూ కొత్త పాలసీ తెచ్చింది.
ఫిబ్రవరి 22 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త పాలసీ ప్రకారం థర్డ్ పార్టీ వర్క్‌సైట్‌లో హెచ్–1బీ వీసా కోరుతున్న ఉద్యోగి పనిచేయాల్సిన అవసరాన్ని, వారి నైపుణ్యాల్ని కంపెనీలు నిరూపించాలి. హెచ్–1బీ వీసాదారు వర్క్ కాంట్రాక్ట్ ఎంతకాలముంటే అంత కాలానికే వీసాలు జారీ చేస్తామని, ఒకవేళ వీసాల్ని పొడిగించుకోవాలనుకుంటే తాజా నిబంధనల్ని పాటించాల్సిందేనని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపింది. ఉద్యోగి తరఫున వీసా దరఖాస్తు సమయంలోనే ఆ వివరాల్ని సమర్పించాలని సూచించింది. భారతీయ కంపెనీల తరఫున హెచ్–1బీ వీసాదారులు పనిచేసే కంపెనీలను ‘థర్డ్ పార్టీ వర్క్‌సైట్లు’ అంటారు.
పని ఉన్నంత కాలానికే..
అమెరికన్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) గురువారం జారీ చేసిన ఏడు పేజీల తాజా పాలసీ ప్రకారం థర్డ్ పార్టీ వర్క్‌సైట్‌లో ఎంత కాలం పనుంటే అంత కాలానికే హెచ్–1బీ వీసాలు జారీ చేస్తారు. ఇప్పటిదాకా మూడేళ్ల కాలానికి హెచ్–1బీ వీసాల్ని జారీచేస్తుండగా... ఇక నుంచి అంతకంటే తక్కువ కాలానికే జారీ చేయనున్నారు. 2019 ఆర్థిక సంవత్సరానికి హెచ్–1బీ వీసా దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుందన్న వార్తల నేపథ్యంలో ఈ పాలసీని కొత్తగా అమెరికా తెరపైకి తెచ్చింది.
యజమాని–ఉద్యోగి బంధం కొనసాగించాలి
ఈ పాలసీ ప్రకారం ‘థర్డ్ పార్టీ వర్క్‌సైట్‌లో ఉద్యోగి పనిచేస్తున్నంతకాలం చట్టబద్ధమైన యజమాని–ఉద్యోగి సంబంధం కొనసాగేలా కంపెనీ చూసుకోవాలి. అలాగే ఉద్యోగి ప్రత్యేక నైపుణ్యమున్న వృత్తిలోనే పనిచేస్తాడని నిరూపించాల్సి ఉంటుంది. ఉద్యోగి చేయాల్సిన ప్రత్యేకమైన పని.. ఎంత కాలం పనిచేస్తాడు.. అందుకు సరిపడా నైపుణ్యం ఉందా? మొదలైన వివరాల్ని వీసా దరఖాస్తు సమయంలోనే కంపెనీలు వెల్లడించాలి. హెచ్–1బీ వీసాను గరిష్టంగా మూడేళ్ల వరకూ జారీచేయవచ్చని, అయితే ఆ నిర్ణయం తన విచక్షాణాధికారంపైనే ఆధారపడి ఉంటుందని, అయితే దరఖాస్తు సమయంలో కంపెనీ పేర్కొన్న కాలానికే వీసా జారీ చేస్తామని యూఎస్‌సీఐఎస్ తెలిపింది. అయితే వీసా కోసం దరఖాస్తు చేసిన కంపెనీ.. యజమాని–ఉద్యోగి సంబంధాన్ని తప్పకుండా కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
వీసా పొడిగింపునకు తాజా నిబంధనలే హెచ్–1బీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేస్తే తాజా నిబంధనల మేరకు అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని యూఎస్‌సీఐఎస్ తెలిపింది. ‘తాము సూచించిన నిబంధనల్ని పాటించకపోయినా.. నియమాలకు అనుగుణంగా వీసా పిటిషన్ లేకపోయినా తగిన చర్యలు తీసుకునేందుకు అధికారం ఉంటుంది’ అని స్పష్టం చేసింది. కొన్నిసార్లు అమెరికన్ కంపెనీలు ఉద్యోగితో కాంట్రాక్టును అర్థాంతరంగా రద్దు చేసుకుంటాయి. ఆ సమయంలో ఉద్యోగులకు తాత్కాలికంగా ఎలాంటి పని ఉండదు. బెంచ్ పిరియడ్‌గా పేర్కొనే ఆ సమయంలో కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు చెల్లించవు. అయితే అలా చేయడం చట్ట విరుద్ధమని, వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.
భారతీయ కంపెనీలకు ఇబ్బందే..
తాజా నిబంధనల నేపథ్యంలో హెచ్–1బీ ఉద్యోగుల్ని అమెరికాకు పంపే కంపెనీలు వీసా దరఖాస్తులు సమర్పించేందుకు మరింత ఎక్కువ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. వీసా దరఖాస్తు లేఖతో పాటు.. ఉద్యోగికి కేటాయించే పని వివరాలు, ఆ పని చేసేందుకు అవసరమయ్యే నైపుణ్యం, విద్యార్హతలు, పని ఎంతకాలం ఉంటుంది, వేతనం, పనిగంటలు, ఇతర ప్రయోజనాల్ని జతపరచాలి.
Comments
Please login to add a commentAdd a comment