వాషింగ్టన్: హెచ్–1బీ వీసా విధానంలో అగ్రరాజ్యం అమెరికా కీలక మార్పులు తీసుకొచ్చింది. హెచ్–1బీ వీసా పొడిగింపు దరఖాస్తు తిరస్కరణకు గురైనా, వీసాలో ఉన్న గడువు దాటిపోయి ఎక్కువకాలం అమెరికాలో ఉన్నా ఇకపై అలాంటివారు దేశ బహిష్కరణను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఉద్యోగం లేకపోయినప్పటికీ కేసుల విచారణకు హాజరవ్వాల్సి ఉన్నందున వెంటనే అమెరికాను వదిలి వేరే దేశం వెళ్లే అవకాశం ఉండకపోవడం మరింత ఆందోళన కలిగించే అంశం.
అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం గత నెల 28 నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలు హెచ్–1బీ వీసాదారులకు పీడకలలు తెప్పిస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి హెచ్–1బీ వీసా పొడిగింపునకు లేదా స్టేటస్ మార్పు కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైనా లేదా అతను వీసా గడువు తీరిపోయాక అమెరికాలో ఉన్నా అలాంటి వారికి అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) ‘నోటీస్ టు అప్పియర్’ (ఎన్టీయే)ను జారీ చేస్తుంది. దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియలో ఇదే తొలి చర్య. గతంలో ఈ ఎన్టీయేను నేరం చేసిన వాళ్లకు మాత్రమే జారీ చేసేవారు.
గతానికి, ఇప్పటికి తేడా ఏంటి?
గతంలో ఉన్న విధానం ప్రకారం ఉద్యోగి హెచ్–1బీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసినప్పుడు అది తిరస్కరణకు గురైతే సదరు ఉద్యోగి వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేస్తాడు. ఆ తర్వాత అతని కంపెనీ మళ్లీ కొత్తగా (పొడిగింపు కాదు) అతని పేరిట హెచ్–1బీ వీసాకు దరఖాస్తు చేస్తుంది. వీసా వచ్చాక మళ్లీ అమెరికా వెళ్లొచ్చు. అయితే తాజాగా వచ్చిన నిబంధన ప్రకారం ఉద్యోగి హెచ్–1బీ వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేస్తే అతని ప్రస్తుత వీసా గడువు తీరినప్పటి నుంచి 240 రోజులు అమెరికాలో ఉండి పనిచేసుకోవచ్చు. ఇక్కడో మెలిక ఉంది. వీసా పొడిగింపునకు ఆమోదం లభిస్తే ఏ సమస్యా లేదు. దరఖాస్తు తిరస్కరణకు గురైతే మాత్రం ఉద్యోగులు ఇబ్బందులు తప్పవు.
వీసా పొడిగింపు లభించకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురైన నాటి నుంచి అతను అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు పరిగణిస్తారు. వీసా పొడిగింపు దరఖాస్తు తిరస్కరించిన వెంటనే యూఎస్‌సీఐఎస్ సదరు ఉద్యోగికి ఎన్టీయే జారీ చేస్తుంది. అంటే అతను ఇక స్వచ్ఛందంగా అమెరికా వీడి రావడానికి లేదు. వీసా లేకపోవడంతో ఉద్యోగం పోతుంది. ఏ ఉద్యోగం లేకపోయినా, విచారణను ఎదుర్కోవడానికి ఉద్యోగి అమెరికాలోనే ఉండాలి. ఇలా అక్రమంగా ఉన్నందుకు కొన్నాళ్లు అమెరికాకు రాకుండా దేశం నుంచి బహిష్కరిస్తారు. ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం అక్రమంగా అమెరికాలో ఉన్నట్లయితే పదేళ్ల వరకు అమెరికాకు రాకుండా బహిష్కరించే నిబంధన ఉంది.
స్వచ్ఛందంగా వచ్చేసే అవకాశం లేదా?
ఒకసారి ఉద్యోగికి ఎన్టీయే జారీ అయితే అతను తప్పకుండా కోర్టులో విచారణకు హాజరుకావాల్సిందే. ఒకవేళ విచారణకు గైర్హాజరైతే ఐదేళ్ల వరకు తిరిగి అమెరికాలోకి రాకుండా బహిష్కరిస్తారు. స్వచ్ఛందంగా అమెరికాను వీడి రావాలన్నా అందుకు జడ్జి ఆమోదం అవసరం. అయితే ఇప్పటికే వీసా కేసులు కుప్పలు తెప్పలుగా ఉన్నందుకు సదరు ఉద్యోగి కేసు అప్పటికప్పుడు విచారణకు రాదు. స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లిపోతానని జడ్జిని కోరేందుకు తొలి విచారణ వరకు అమెరికాలో ఉండాల్సిందే.
కొత్త నిబంధనతో అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు తలనొప్పులు పొంచిఉన్నాయి. చదువు తర్వాత అక్రమంగా ఉద్యోగంలో చేరినా, విద్యార్థుల రికార్డులను అప్‌డేట్ చేయడంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నిర్లక్ష్యంగా వ్యవహరించినా తిప్పలు విద్యార్థులకే. వీసాను తిరస్కరించిన నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లే అవకాశమున్నా, అప్పీల్ పరిష్కారానికి కూడా సుదీర్ఘ సమయం పట్టనుంది. దీంతో అమెరికాలో ఉద్యోగం చేస్తూ హెచ్–1బీ వీసా గడువు చివరి దశలో ఉన్నవారికి తాజా నిబంధన పెద్ద ఎదురుదెబ్బే.
మనవాళ్లకే పొడిగింపులు ఎక్కువ
సాధారణంగా భారతీయ ఉద్యోగుల్లో కొత్తగా అమెరికా వెళ్లే వారి కన్నా, ఇప్పటికే అక్కడ ఉండి వీసా గడువు పొడిగింపు పొందేవారే ఎక్కువ. హెచ్–1బీపై ఉద్యోగం చేస్తున్న భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. 2016 అక్టోబరు నుంచి 2017 సెప్టెంబరు మధ్య కాలంలో దాదాపు 2 లక్షల మంది భారతీయ ఉద్యోగులు హెచ్–1బీ వీసా పొడిగింపు పొందారు. వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకునే వారికి అమెరికా ప్రభుత్వం తాజాగా నిబంధనలు కఠినతరం చేయడంతో ఇకపై దరఖాస్తు చేసే వాందరికీ గడ్డు కాలమేనని నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment