Rejection of Applications
-
ఉద్యోగానికి సరిగ్గా సరిపోతారు.. అందుకే రిజెక్ట్!
కొత్త ఉద్యోగానికి సరిపడా అర్హతలు లేక చాలా మంది తిరస్కరణను ఎదుర్కొంటారు. తనకు అన్ని అర్హతలు ఉండి, సదరు కొత్త జాబ్‌ను చేయగల సమర్థత ఉన్నాసరే ఉద్యోగాన్ని పొందలేకపోవడంతో ఒక అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఉద్యోగం ఇవ్వలేకపోవడానికి గల కారణాన్ని చూసి అవాక్కయింది. తర్వాత ఆ తిరస్కరణ తాలూకు వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా అందరితో పంచుకుంది. గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ.. అనూ శర్మ అనే ఈ అమ్మాయి ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థలో ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలు, జీతం, కొత్త సవాళ్లను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వేరే సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో రెజ్యూమ్, వివరాలు పంపారు. ఉద్యోగం తప్పకుండా వస్తుందనుకుంటే ‘తిరస్కరిస్తున్నాం’అన్న సందేశం వచి్చంది. ఉద్యోగంలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను సంస్థ వివరించింది. ‘‘మీ రెజ్యూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాం. ఇక్కడ తేలిందేమంటే సదరు ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ మీలో ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి. ఇంతటి ప్రతిభావంతురాలు మాకు వద్దు. ఎందుకంటే ఎక్కువ ప్రతిభ ఉండి తక్కువ స్థాయి ఉద్యోగం చేసే వాళ్లలో సాధారణంగా ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. మరింత మెరుగైన ఉద్యోగాన్ని వీలైనంత త్వరగా వెతుక్కుని పాత ఉద్యోగాన్ని వదిలేస్తారు’’అని వివరణ ఇచి్చంది. ఇలాంటి కారణాలకు కూడా తిరస్కరిస్తారా? అని ఆమె ఆలోచనలో పడింది. ‘‘అర్హతలున్నా ఉద్యోగం ఎందుకు రాదో మీకు తెలుసా?’అంటూ అనూ శర్మ సంబంధిత సంస్థ రిప్లై స్క్రీన్‌షాట్‌ను ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు.స్పందనల వెల్లువఅనూ శర్మ పెట్టిన పోస్ట్‌కు స్పందనల వరద మొదలైంది. ‘‘అతి అర్హతలతో బాధపడుతున్నారా?’అని ఒక నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘ఇదొక మంచి పరిణామానికి సంకేతం. ఒకరి దగ్గర పనిచేయడం మానేసి మీరే సొంతంగా కంపెనీ పెట్టి ఉద్యోగాలివ్వండి’అని మరొకరు ఉచిత సలహా ఇచ్చారు. ‘‘ఉద్యోగం చేసే స్థాయి మీకున్నా, ఇచ్చేస్థాయి మాకు లేదు అని కంపెనీయే ఒప్పుకుంది’’అని మరొకరు ట్వీట్‌చేశారు. సంస్థనూ మెచ్చుకున్న వాళ్లు కోకొల్లలు ఉన్నారు. ‘‘కంపెనీ మంచిపనే చేసింది. అర్హత కాస్తంత తక్కువ ఉంటే ఉద్యోగం ఇచ్చి, పని బాగా చేయించి రాటుదేలాలా చేస్తారు. ఈమెలాగే అప్పటికే మంచి ప్రతిభ ఉంటే మధ్యలోనే మానేస్తారు. అప్పుడు మళ్లీ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్, శిక్షణ అంటూ సంస్థ ఉద్యోగ వేట మళ్లీ మొదలవుతుంది’’అని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ‘‘కనీసం రెజ్యూమ్ చదవకుండా, ఏవేవో పిచ్చి కారణాలు చెప్పకుండా నిజాయతీగా రిప్లై ఇచ్చిన సంస్థను మెచ్చుకోవాల్సిందే’అని ఇంకొకరు ట్వీట్‌చేశారు. దీంతో సరిగ్గా సరిపోయే అర్హతలున్న వారికి ఉద్యోగం ఇవ్వాలా? లేదంటే కాస్తంత తక్కువ అర్హత ఉన్న వారికి ఉద్యోగం ఇచ్చి తమకు తగ్గట్లు తీర్చిదిద్దుకోవాలా? అన్న చర్చ మొదలైంది. – న్యూఢిల్లీ -
రైల్వే ఉద్యోగార్థులకు మరో అవకాశం
న్యూఢిల్లీ: తిరస్కరణకు గురైన దరఖాస్తులను సరిచేసుకునేందుకు సుమారు 70 వేల మంది అభ్యర్థులకు రైల్వే శాఖ మరో అవకాశం ఇచ్చింది. ఫొటోలు సరిగా అప్లోడ్ కాకపోవడం వల్ల జరిగిన దోషాలను సరిదిద్దుకోవడానికి మూడు రోజుల గడువు ఇస్తున్నట్లు రైల్వే శాఖ అధికారి తెలిపారు. అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల ఉద్యోగాల కోసం వచ్చిన 48 లక్షల దరఖాస్తుల్లో 1.27 లక్షల దరఖాస్తుల్లో ఫొటోలు సరిగా అప్లోడ్ కాలేదని గుర్తించారు. అందులో, 70 వేల మంది ఫొటోల్లో మార్పులు చేసుకుని మళ్లీ అప్లోడ్ చేయాలని అధికారులు సూచించారు. ఈ మేరకు సదరు అభ్యర్థులకు ఈమెయిల్స్ ద్వారా సమాచారం పంపారు. జూలై 18–20 మధ్య రైల్వే నియామక బోర్డు వెబ్సైట్లో ఈ తప్పులను సరిదిద్దుకోవాలని తెలిపారు. మిగిలిన 57 వేల దరఖాస్తుదారులను కూడా పరిశీలించామని, వాటిలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. -
గడువు ముగిస్తే బహిష్కరణ!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా విధానంలో అగ్రరాజ్యం అమెరికా కీలక మార్పులు తీసుకొచ్చింది. హెచ్–1బీ వీసా పొడిగింపు దరఖాస్తు తిరస్కరణకు గురైనా, వీసాలో ఉన్న గడువు దాటిపోయి ఎక్కువకాలం అమెరికాలో ఉన్నా ఇకపై అలాంటివారు దేశ బహిష్కరణను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఉద్యోగం లేకపోయినప్పటికీ కేసుల విచారణకు హాజరవ్వాల్సి ఉన్నందున వెంటనే అమెరికాను వదిలి వేరే దేశం వెళ్లే అవకాశం ఉండకపోవడం మరింత ఆందోళన కలిగించే అంశం. అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం గత నెల 28 నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలు హెచ్–1బీ వీసాదారులకు పీడకలలు తెప్పిస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి హెచ్–1బీ వీసా పొడిగింపునకు లేదా స్టేటస్ మార్పు కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైనా లేదా అతను వీసా గడువు తీరిపోయాక అమెరికాలో ఉన్నా అలాంటి వారికి అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) ‘నోటీస్ టు అప్పియర్’ (ఎన్టీయే)ను జారీ చేస్తుంది. దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియలో ఇదే తొలి చర్య. గతంలో ఈ ఎన్టీయేను నేరం చేసిన వాళ్లకు మాత్రమే జారీ చేసేవారు. గతానికి, ఇప్పటికి తేడా ఏంటి? గతంలో ఉన్న విధానం ప్రకారం ఉద్యోగి హెచ్–1బీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసినప్పుడు అది తిరస్కరణకు గురైతే సదరు ఉద్యోగి వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేస్తాడు. ఆ తర్వాత అతని కంపెనీ మళ్లీ కొత్తగా (పొడిగింపు కాదు) అతని పేరిట హెచ్–1బీ వీసాకు దరఖాస్తు చేస్తుంది. వీసా వచ్చాక మళ్లీ అమెరికా వెళ్లొచ్చు. అయితే తాజాగా వచ్చిన నిబంధన ప్రకారం ఉద్యోగి హెచ్–1బీ వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేస్తే అతని ప్రస్తుత వీసా గడువు తీరినప్పటి నుంచి 240 రోజులు అమెరికాలో ఉండి పనిచేసుకోవచ్చు. ఇక్కడో మెలిక ఉంది. వీసా పొడిగింపునకు ఆమోదం లభిస్తే ఏ సమస్యా లేదు. దరఖాస్తు తిరస్కరణకు గురైతే మాత్రం ఉద్యోగులు ఇబ్బందులు తప్పవు. వీసా పొడిగింపు లభించకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురైన నాటి నుంచి అతను అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లు పరిగణిస్తారు. వీసా పొడిగింపు దరఖాస్తు తిరస్కరించిన వెంటనే యూఎస్సీఐఎస్ సదరు ఉద్యోగికి ఎన్టీయే జారీ చేస్తుంది. అంటే అతను ఇక స్వచ్ఛందంగా అమెరికా వీడి రావడానికి లేదు. వీసా లేకపోవడంతో ఉద్యోగం పోతుంది. ఏ ఉద్యోగం లేకపోయినా, విచారణను ఎదుర్కోవడానికి ఉద్యోగి అమెరికాలోనే ఉండాలి. ఇలా అక్రమంగా ఉన్నందుకు కొన్నాళ్లు అమెరికాకు రాకుండా దేశం నుంచి బహిష్కరిస్తారు. ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం అక్రమంగా అమెరికాలో ఉన్నట్లయితే పదేళ్ల వరకు అమెరికాకు రాకుండా బహిష్కరించే నిబంధన ఉంది. స్వచ్ఛందంగా వచ్చేసే అవకాశం లేదా? ఒకసారి ఉద్యోగికి ఎన్టీయే జారీ అయితే అతను తప్పకుండా కోర్టులో విచారణకు హాజరుకావాల్సిందే. ఒకవేళ విచారణకు గైర్హాజరైతే ఐదేళ్ల వరకు తిరిగి అమెరికాలోకి రాకుండా బహిష్కరిస్తారు. స్వచ్ఛందంగా అమెరికాను వీడి రావాలన్నా అందుకు జడ్జి ఆమోదం అవసరం. అయితే ఇప్పటికే వీసా కేసులు కుప్పలు తెప్పలుగా ఉన్నందుకు సదరు ఉద్యోగి కేసు అప్పటికప్పుడు విచారణకు రాదు. స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లిపోతానని జడ్జిని కోరేందుకు తొలి విచారణ వరకు అమెరికాలో ఉండాల్సిందే. కొత్త నిబంధనతో అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు తలనొప్పులు పొంచిఉన్నాయి. చదువు తర్వాత అక్రమంగా ఉద్యోగంలో చేరినా, విద్యార్థుల రికార్డులను అప్డేట్ చేయడంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నిర్లక్ష్యంగా వ్యవహరించినా తిప్పలు విద్యార్థులకే. వీసాను తిరస్కరించిన నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లే అవకాశమున్నా, అప్పీల్ పరిష్కారానికి కూడా సుదీర్ఘ సమయం పట్టనుంది. దీంతో అమెరికాలో ఉద్యోగం చేస్తూ హెచ్–1బీ వీసా గడువు చివరి దశలో ఉన్నవారికి తాజా నిబంధన పెద్ద ఎదురుదెబ్బే. మనవాళ్లకే పొడిగింపులు ఎక్కువ సాధారణంగా భారతీయ ఉద్యోగుల్లో కొత్తగా అమెరికా వెళ్లే వారి కన్నా, ఇప్పటికే అక్కడ ఉండి వీసా గడువు పొడిగింపు పొందేవారే ఎక్కువ. హెచ్–1బీపై ఉద్యోగం చేస్తున్న భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. 2016 అక్టోబరు నుంచి 2017 సెప్టెంబరు మధ్య కాలంలో దాదాపు 2 లక్షల మంది భారతీయ ఉద్యోగులు హెచ్–1బీ వీసా పొడిగింపు పొందారు. వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకునే వారికి అమెరికా ప్రభుత్వం తాజాగా నిబంధనలు కఠినతరం చేయడంతో ఇకపై దరఖాస్తు చేసే వాందరికీ గడ్డు కాలమేనని నిపుణులు అంటున్నారు. -
నిరుద్యోగులతో రైల్వే బోర్డు చెలగాటం
అనంతపురం ఎడ్యుకేషన్ : సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు ఇటీవల ఐటీఐ కోర్సుల అర్హతతో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 17లోగా దర ఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులు నేరుగా కాకుండా జిల్లా కేంద్రంలోని ఎంప్లాయింట్ అధికారి కార్యాలయం, లేదా ప్రభుత్వ ఐటీఐ ద్వారా పంపాలని పేర్కొంది. దీంతో జిల్లాలో ఐటీఐ పూర్తయిన అభ్యర్థులు రోజూ వందలాది మంది ఎంప్లాయిమెంట్, ఐటీఐ కళాశాలకు వస్తున్నారు. అయితే ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో వారు దరఖాస్తులు తీసుకోకుండా తిరస్కరిస్తున్నారు. ఐటీఐ, ఎంప్లాయిమెంట్ కార్యాలయం అధికారుల వాదన మరోలా ఉంది. తమకు రైల్వే నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని ఈ పరిస్థితుల్లో తాము దరఖాస్తులు తీసుకునేందుకు వీలుకాదని స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థుల నుంచి తాము దరఖాస్తులు స్వీకరించి వాటిని బోర్డుకు పంపితే ఒకవేళ తిరస్కరణకు గురైతే అభ్యర్థులు నష్టపోతారని, అందుకు బాధ్యులెవరని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
సగానికిమోక్షం లేనట్లే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల్లో సగానికి కూడా మోక్షం కలిగే అవకాశం కనిపించడంలేదు. జీఓ 58 కేటగిరీ కింద జిల్లావ్యాప్తంగా వచ్చిన 1,52,249 దరఖాస్తులను పరిశీ లించిన రెవెన్యూ యంత్రాంగం.. ప్రాథమిక స్థాయిలోనే 56,449 అర్జీలను పక్కనపెట్టగా, తాజాగా మరో 11,194 దరఖాస్తులను అనర్హమైనవిగా తేల్చింది. దీన్నిబట్టి చూస్తే సగం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 125 గజాల ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే, వీటిలో చాలావరకు నిబంధనలకు అనుగుణంగాలేవని పరిశీలన దశలోనే గుర్తించింది. శిఖం, నాలా, కోర్టు కేసులు, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూముల్లో వెలిసిన నిర్మాణాలను క్రమబద్ధీకరించకూడదనే నియమావళిని పరిగణనలోకి తీసుకున్న రెవెన్యూ అధికారులు 56వేల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టి.. అభ్యంతరంలేని మిగతా దరఖాస్తులను వడపోశారు. ఈ మేరకు 61 ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు 37,127 దరఖాస్తులను పరిశీలించిన యంత్రాంగం.. దీంట్లో 25,933 సవ్యంగా ఉన్నట్లు తేల్చింది. సగటున 52.74 శాతం పరిశీలన క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన విచారణను తలపిస్తుందని, ఈ ప్రక్రియ తలనొప్పిగా మారిందని రెవెన్యూ టీంలు వాపోతున్నాయి. అంతేకాకుండా ఈనెల 20లోపు పరిశీలన పర్వాన్ని పూర్తిచేయాలని, ఆ తర్వాత ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేయడం కూడా అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ప్రతి టీం దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. అర్హుల జాబితా రూపకల్పనకు సంబంధించిన చెక్ మెమో చాంతాడంతా ఉండడంతో బృందాలపై పనిభారం పెరిగింది. గతంతో పోలిస్తే అర్జీల పరిశీలన ప్రక్రియను చకచకా పూర్తి చేస్తున్నప్పటికీ, మూడో వంతు కూడా కొలిక్కిరాకపోవడం అధికారులను కలవరపరుస్తోంది. కాగా, ప్రతి బృందం రోజుకు సగటున 52.74 శాత ం దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు లెక్క తేల్చారు. దరఖాస్తుల వడపోతలో వెనుకబడిన మేడ్చల్, బాలానగర్, శంషాబాద్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి మండలాల అధికారులను కూడా స్పీడ్ పెంచమని ఆదేశించారు. -
‘ఆసరా’ ఏది?
సాక్షి, ఖమ్మం: ఆసరా (నూతన పింఛన్ ) పథకం అబాసుపాలవుతోంది. జిల్లాలో దరఖాస్తుల పరిశీలన పలు మండలాల్లో పూర్తయినా పంపిణీ మాత్రం ప్రారంభం కాకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలు పింఛన్ అందుతుందో..? లేదోనని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 2,12,954 మంది పింఛన్ పొందడానికి అర్హత సాధించారు. అలాగే 91,869 మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వేలల్లో దరఖాస్తులను నిరాకరించడంతో జాబితాలో తమ పేరు ఉంటుందా..? అని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. నూతన పింఛన్ పథకం కింద దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ప్రభుత్వం వికలాంగులకు రూ.1,500, మిగతావారికి రూ.1000 వరకు పింఛన్ పెంచడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమైంది. ప్రస్తుతం పింఛన్ అందకపోవడంతో వీరంతా ఆందోళనలో ఉన్నారు. మరోవైపు ఈ దరఖాస్తుల్లో అర్హులు, అనర్హులను తేల్చి తుది జాబితాను రూపొందించేందుకు అధికారులు కుస్తీ పడుతున్నారు. నాలుగు డివిజన్లలో 3,17,801 దరఖాస్తులు వస్తే ఇప్పటి వరకు 3,06,451 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. వచ్చిన దరఖాస్తులకు.. అర్హత ఉన్న లబ్ధిదారులను పోల్చితే పరిశీలనలో భారీగా అనర్హులుగా తిరస్కరించారు. ఖమ్మం, కొత్తగూడెం డివిజన్లలోనే 70 వేల మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇంకా నాలుగు డివిజన్లలో కేవలం 11,372 దరఖాస్తులు మాత్రమే పరిశీలించాల్సి ఉంది. ఆన్లైన్ కష్టాలు దరఖాస్తుల పరిశీలనే అధికారులు, సిబ్బందికి ప్రహాసనంగా మారితే.. ఇప్పుడు ఆన్లైన్ నమోదు తలకు మించిన భారమైంది. అర్హత సాధించిన దరఖాస్తులను ఆన్లైన్ చేస్తేనే వచ్చేనెల నుంచి వారికి ప్రభుత్వం పింఛన్ సొమ్ము మంజూరు చేస్తుంది. అర్హత సాధించిన 2,12,954 దరఖాస్తుల్లో 1,61,614 దరఖాస్తులు ఆన్లైన్ చేశారు. ఈ నెలలో ఆన్లైన్ ప్రక్రియ పూర్తవనుండటంతో వచ్చే నెల మొదటి వారానికి కాని తుది జూబితా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ నమోదుకు సర్వర్ మొరాయిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. జాబితా కోసం నిరీక్షణ ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీలో అర్హులైన వారి జాబితా పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈనెల 8న ప్రతి నియోజకవర్గంలో కొంత మంది అర్హులకు ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందజేసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. గ్రామాల్లో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. పింఛన్ పథకంలో తమ పేరు లేకుంటే రూ.వెయ్యి కోల్పోతామని వృద్ధులు, రూ.1,500 దక్కవని వికలాంగులు ఆవేదన చెందుతున్నారు. ఆసరా సమాచారం కోసం గ్రామ పంచాయతీ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే కాకుండా మండల పరిషత్ కార్యాలయాలకు కూడా క్యూ కడుతూ తమకు కనిపించిన అధికారినల్లా పింఛన్ జాబితాలో తమపేరు ఉందా..? అని అడుగుతున్నారు. ఆన్లైన్ నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాతే తుది జాబితా వస్తుందని అప్పటి వరకు లబ్ధిదారులు ఆందోళనకు గురికావద్దని అధికారులు చెబుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఆశలు పెట్టుకున్న నూతన లబ్ధిదారులు వేల సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురువుతుండడంతో అర్హత ఉండి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. ఉన్న వాటికే ప్రభుత్వం కోత పెడుతుందన్న ఆరోపణలు వస్తుండడంతో అసలు తమకు పింఛన్ వస్తుందా..? రాదా..? అని నూతనంగా దరఖాస్తు చేసుకున్నవారిలో ఆందోళన నెలకొంది. ప్రధానంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వేలాది మంది నూతనంగా దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన ఇంకా పూర్తి కాకపోవడంతో అర్హులు కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్నారు.