ఆసరా (నూతన పింఛన్ ) పథకం అబాసుపాలవుతోంది.
సాక్షి, ఖమ్మం: ఆసరా (నూతన పింఛన్ ) పథకం అబాసుపాలవుతోంది. జిల్లాలో దరఖాస్తుల పరిశీలన పలు మండలాల్లో పూర్తయినా పంపిణీ మాత్రం ప్రారంభం కాకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలు పింఛన్ అందుతుందో..? లేదోనని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 2,12,954 మంది పింఛన్ పొందడానికి అర్హత సాధించారు. అలాగే 91,869 మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వేలల్లో దరఖాస్తులను నిరాకరించడంతో జాబితాలో తమ పేరు ఉంటుందా..? అని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. నూతన పింఛన్ పథకం కింద దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ప్రభుత్వం వికలాంగులకు రూ.1,500, మిగతావారికి రూ.1000 వరకు పింఛన్ పెంచడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమైంది. ప్రస్తుతం పింఛన్ అందకపోవడంతో వీరంతా ఆందోళనలో ఉన్నారు.
మరోవైపు ఈ దరఖాస్తుల్లో అర్హులు, అనర్హులను తేల్చి తుది జాబితాను రూపొందించేందుకు అధికారులు కుస్తీ పడుతున్నారు. నాలుగు డివిజన్లలో 3,17,801 దరఖాస్తులు వస్తే ఇప్పటి వరకు 3,06,451 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. వచ్చిన దరఖాస్తులకు.. అర్హత ఉన్న లబ్ధిదారులను పోల్చితే పరిశీలనలో భారీగా అనర్హులుగా తిరస్కరించారు. ఖమ్మం, కొత్తగూడెం డివిజన్లలోనే 70 వేల మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇంకా నాలుగు డివిజన్లలో కేవలం 11,372 దరఖాస్తులు మాత్రమే పరిశీలించాల్సి ఉంది.
ఆన్‌లైన్ కష్టాలు
దరఖాస్తుల పరిశీలనే అధికారులు, సిబ్బందికి ప్రహాసనంగా మారితే.. ఇప్పుడు ఆన్‌లైన్ నమోదు తలకు మించిన భారమైంది. అర్హత సాధించిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేస్తేనే వచ్చేనెల నుంచి వారికి ప్రభుత్వం పింఛన్ సొమ్ము మంజూరు చేస్తుంది. అర్హత సాధించిన 2,12,954 దరఖాస్తుల్లో 1,61,614 దరఖాస్తులు ఆన్‌లైన్ చేశారు. ఈ నెలలో ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తవనుండటంతో వచ్చే నెల మొదటి వారానికి కాని తుది జూబితా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్ నమోదుకు సర్వర్ మొరాయిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు.
జాబితా కోసం నిరీక్షణ
ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీలో అర్హులైన వారి జాబితా పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈనెల 8న ప్రతి నియోజకవర్గంలో కొంత మంది అర్హులకు ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందజేసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. గ్రామాల్లో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. పింఛన్ పథకంలో తమ పేరు లేకుంటే రూ.వెయ్యి కోల్పోతామని వృద్ధులు, రూ.1,500 దక్కవని వికలాంగులు ఆవేదన చెందుతున్నారు.
ఆసరా సమాచారం కోసం గ్రామ పంచాయతీ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే కాకుండా మండల పరిషత్ కార్యాలయాలకు కూడా క్యూ కడుతూ తమకు కనిపించిన అధికారినల్లా పింఛన్ జాబితాలో తమపేరు ఉందా..? అని అడుగుతున్నారు. ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాతే తుది జాబితా వస్తుందని అప్పటి వరకు లబ్ధిదారులు ఆందోళనకు గురికావద్దని అధికారులు చెబుతున్నా ఫలితం లేకుండా పోతోంది.
ఆశలు పెట్టుకున్న నూతన లబ్ధిదారులు
వేల సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురువుతుండడంతో అర్హత ఉండి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. ఉన్న వాటికే ప్రభుత్వం కోత పెడుతుందన్న ఆరోపణలు వస్తుండడంతో అసలు తమకు పింఛన్ వస్తుందా..? రాదా..? అని నూతనంగా దరఖాస్తు చేసుకున్నవారిలో ఆందోళన నెలకొంది. ప్రధానంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వేలాది మంది నూతనంగా దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన ఇంకా పూర్తి కాకపోవడంతో అర్హులు కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్నారు.