List of pensions
-
ఇదేం చోద్యం !
ఇందూరు : మగవారికి వితంతు పింఛన్ రావడమేంటీ.. మరీ ఇంత అన్యాయమా పీడీ గారూ ! అర్హూలకు అందించే ‘ఆసరా’ ఇదేనా..? అంటూ జిల్లాలో జరిగిన ఓ ఘటనను ఉద్దేశించి జిల్లా పరిషత్ చైర్మన్, గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం చైర్మన్ దఫేదార్ రాజు అసహనం వ్యక్తం చేశారు. పెన్షన్ల జాబితాలో వితంతు పింఛన్ మంజూరైన రామవ్వ అనే మహిళ పేరును రామయ్యగా తప్పుడు పేరుతో ముద్రించడంతో ఆమె ‘ఆసరా’ కోల్పోయిందన్నారు. నిజాంసాగర్ మండలంలో చోటు చేసుకున్న ఘటనపై, సంబంధిత అధికారుల పని తీరుపై మండిపడ్డారు. మంగళవారం జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా మొదటి రోజు ఉదయం గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘ సమావేశం జిల్లా పరిషత్‌లో నిర్వహించారు. వికలాంగులు పింఛన్ పొందటానికి ధ్రువపత్రాల కోసం జిల్లా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపునకు వస్తే అక్కడ అధికారులు, డాక్టర్లు పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల తన మండలానికి చెందిన ఓ వికలాంగుడు సదరం క్యాంపునకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ఓ డాక్టరు ఆ దరఖాస్తును తీసి బయటపడేశారన్నారు. దీంతో వికలాంగుడు తన వద్దకు వచ్చి సదరంలో జరిగిన ఘటనపై గోడును వెల్లబోసుకున్నాడని, తాను స్పందిస్తే కాని ధ్రువ పత్రం లభించలేదన్నారు. ఇదేనా అధికారుల పనితీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల పేర్లను తారుమారు చేయడంతో ఇండ్ల రుణాల విషయంలో లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని హౌసింగ్ పీడీ చైతన్య దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో నిర్వహించిన సదరం క్యాంపుల్లో సిబ్బంది అనర్హులకు సైతం వికలాంగ ధ్రువ పత్రాలు ఇచ్చారని, డబ్బులకు కక్కుర్తి పడి అడ్డదారులు తొక్కుతున్నారని కొందరు సభ్యులు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని సందరం క్యాంపులో సమయానికి అధికారులు ఉండటం లేదని, వికలాంగులు సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇటు బోగస్ వికలాంగుల పింఛన్లపై విచారణ చేపట్టాలని సభ్యులు తీర్మానం చేశారు. జోగినీ, ఎయిడ్స్ బాధితులు, భర్త వదిలేసిన మహిళలకు కూడా పింఛన్ మంజురు చేసే విధంగా ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానం చేశారు. కాగా సమావేశానికి జిల్లా పరిశ్రమల శాఖ డీజీఎం రావడం లేదని, మరోసారి ఇలా జరిగితే ఊరుకోమని ద్వితీయ శ్రేణి అధికారిపై మండిపడ్డారు. యువజన సంక్షేమ శాఖ ద్వారా నిరుద్యోగ యువకులకు బ్యాంకు రుణాలు అందించే విషయంలో బ్యాంకర్లు ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. అంత్యోదయ రేషన్ కార్డుల విషయంలో అర్హులకు అన్యాయం చేస్తున్నారన్నారు. జిల్లాలో అక్రమ ఇసుక దందాపై ఓ రెండు పేపర్లలో కథనాలు వస్తే తప్ప అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. మైనింగ్ శాఖ అడ్డగోలుగా అనుమతులివ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎవరికి ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని సభ్యులు వాపోయారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు సంబంధించిన బిద్యుత్ బకాయిలను పంచాయతీలు కట్టే స్థితిలో లేవన్నారు. ఎప్పటిలాగే కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని సమావేశంలో సభ్యులు తీర్మానం చేశారు. -
ఆసరా కోసం ఆందోళన
నిజామాబాద్‌లో మొక్కుబడి జాబితాలో పేరు లేదని ఆందోళన నెట్వర్క్: వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవితాలకు ఆసరా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఆసరా పింఛన్ల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలుజిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో పింఛన్ల తంతు మొక్కుబడిగా సాగింది. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం ఫాజుల్‌నగర్‌లో పంచాయతీ కార్యదర్శిని, సీనియర్ అసిస్టెంట్‌ను గదిలో నిర్బంధించారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలో గ్రామపంచాయతీని ముట్టడించారు. భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌లో ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్, పంచాయితీ కార్యదర్శి, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను గ్రామ పంచాయతీలో మూడు గంటల పాటు నిర్బంధించారు. ఇదే మండలం ముస్తఫాపూర్, గొల్లపల్లి గ్రామాలకు చెందిన బాధితులు ధర్నా చేశారు. ఇబ్రహీంపట్నం ఎర్దండిలో పింఛన్‌దారుల నుంచి కాగితాల ఖర్చులకంటూ రూ.వంద చొప్పున వసూలు చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో సుమారు 1,000 మంది పింఛన్లు గల్లంతయ్యాయి. గతంలో పింఛన్లు పొందుతూ అన్ని అర్హతలున్న వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. బాధితులంతా బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించా రు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. జిల్లాలో మొత్తం 3,13,831 మంది దరఖాస్తు చేసుకోగా, 2,14,605 మందిని అర్హులుగా గుర్తించామని, తొలిరోజున 1.92 ల క్షల మందికి పంపిణీ చేశామని కలెక్టర్ ఇలంబరితి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణచందా మండలం రాచాపూ ర్ పంచాయతీ పరిధిలోని కొత్తపతి(కె) గ్రామస్తులు 30 మంది ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల ముందు బుధవారం ఆందోళన చేశారు. జాబితాలో పేర్లు లేకపోవడంతో కెరమెరి మండలం గోయగాం, సావర్‌ఖేడ్ గ్రామస్తులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశా రు. కాసిపేట మండలంలో బుధవారం చేపట్టాల్సిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారానికి వాయిదా వేశారు. నెన్నెల మండల పరిధిలోని పలు గ్రామాల్లోనూ పెన్షన్ల పంపిణీ జరగలేదు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో పలువురి పేర్లు జాబితాలో లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ కుంచె కుమారస్వామి రెండ్రోజుల్లోగా పెన్షన్లు అందజేస్తానని హామీ ఇచ్చారు.నిజామాబాద్ జిల్లాలో ఆర్భాటంగా పంపిణీకి శ్రీకారం చుట్టినా.. 20 శాతం మంది కి కూడా పంపిణీ చేయలేదు. బాన్సువాడ నియోజకవర్గంలో ఒక్క వర్ని మండలంలో మాత్ర మే పింఛన్లు పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక్క ఎల్లారెడ్డి మినహా మిగిలిన ఐదు మండలాల్లో పంపిణీ వాయిదా పడింది. బోధన్‌లో పింఛన్ల పంపిణీ గురువారం నుంచి చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆర్మూర్ పట్టణంలో పింఛన్ల కోసం సాయంత్రం వరకు నిరీక్షించారు. వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పింఛన్లు పంపిణీ కాలేదు. చిట్యా ల, డోర్నకల్, మహబూబాబాద్, నెల్లికుదురు, ఏటూరునాగారం, తొర్రూరు, నర్సంపేటతో పాటు నగరంలో అధికారులు సకాలంలో రాకపోవడంతో లబ్ధిదారులు నిరసన తెలిపారు. మంగపేటలో పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. నర్సింహులపేట మండలం రేపోణి గ్రామంలో తమ కుటుంబాలకు చెందిన వారికి పింఛన్లు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరు వ్యక్తులు వీఆర్వో రమేష్‌పై దాడికి ప్రయత్నించారు. జాబితాలో పేరు లేదని ఆత్మహత్య గార్ల: పింఛన్ల జాబితాలో పేరు లేదని మనస్తాపంతో ఖమ్మం జిల్లా గార్ల మండలం సీతంపేటకు చెందిన దైదా సత్యనారాయణరెడ్డి(65) ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణరెడ్డి మూడేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నాడు. మంగళవారం కొత్త జాబితా ప్రకటించగా, అందులో సత్యనారాయణరెడ్డి పేరు లేదు. దీంతో మనోవేదనకు గురై బుధవారం ఇంట్లో ఉరి వేసుకున్నాడు. పింఛన్ కోసం వెళ్తూ మృత్యుఒడికి.. సిరిసిల్ల : కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పింఛన్ కోసం వెళ్తూ బండారి కాంతమ్మ(65) బుధవారం మృతి చెందింది. సిరిసిల్ల శాంతినగర్‌కు చెందిన కాంతమ్మ పింఛన్ కోసం రెండోవార్డులో ఏర్పాటు చేసిన పంపిణీ పాయింట్‌కు వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న సైకిలిస్ట్ ఆమెను ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన కాంతమ్మను స్థానికులుఆస్పత్రికి తీసుకెళ్లగా రాత్రి చనిపోయింది. -
‘ఆసరా’ ఏది?
సాక్షి, ఖమ్మం: ఆసరా (నూతన పింఛన్ ) పథకం అబాసుపాలవుతోంది. జిల్లాలో దరఖాస్తుల పరిశీలన పలు మండలాల్లో పూర్తయినా పంపిణీ మాత్రం ప్రారంభం కాకపోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలు పింఛన్ అందుతుందో..? లేదోనని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 2,12,954 మంది పింఛన్ పొందడానికి అర్హత సాధించారు. అలాగే 91,869 మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వేలల్లో దరఖాస్తులను నిరాకరించడంతో జాబితాలో తమ పేరు ఉంటుందా..? అని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. నూతన పింఛన్ పథకం కింద దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ప్రభుత్వం వికలాంగులకు రూ.1,500, మిగతావారికి రూ.1000 వరకు పింఛన్ పెంచడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమైంది. ప్రస్తుతం పింఛన్ అందకపోవడంతో వీరంతా ఆందోళనలో ఉన్నారు. మరోవైపు ఈ దరఖాస్తుల్లో అర్హులు, అనర్హులను తేల్చి తుది జాబితాను రూపొందించేందుకు అధికారులు కుస్తీ పడుతున్నారు. నాలుగు డివిజన్లలో 3,17,801 దరఖాస్తులు వస్తే ఇప్పటి వరకు 3,06,451 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. వచ్చిన దరఖాస్తులకు.. అర్హత ఉన్న లబ్ధిదారులను పోల్చితే పరిశీలనలో భారీగా అనర్హులుగా తిరస్కరించారు. ఖమ్మం, కొత్తగూడెం డివిజన్లలోనే 70 వేల మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇంకా నాలుగు డివిజన్లలో కేవలం 11,372 దరఖాస్తులు మాత్రమే పరిశీలించాల్సి ఉంది. ఆన్లైన్ కష్టాలు దరఖాస్తుల పరిశీలనే అధికారులు, సిబ్బందికి ప్రహాసనంగా మారితే.. ఇప్పుడు ఆన్లైన్ నమోదు తలకు మించిన భారమైంది. అర్హత సాధించిన దరఖాస్తులను ఆన్లైన్ చేస్తేనే వచ్చేనెల నుంచి వారికి ప్రభుత్వం పింఛన్ సొమ్ము మంజూరు చేస్తుంది. అర్హత సాధించిన 2,12,954 దరఖాస్తుల్లో 1,61,614 దరఖాస్తులు ఆన్లైన్ చేశారు. ఈ నెలలో ఆన్లైన్ ప్రక్రియ పూర్తవనుండటంతో వచ్చే నెల మొదటి వారానికి కాని తుది జూబితా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ నమోదుకు సర్వర్ మొరాయిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. జాబితా కోసం నిరీక్షణ ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీలో అర్హులైన వారి జాబితా పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈనెల 8న ప్రతి నియోజకవర్గంలో కొంత మంది అర్హులకు ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందజేసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. గ్రామాల్లో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. పింఛన్ పథకంలో తమ పేరు లేకుంటే రూ.వెయ్యి కోల్పోతామని వృద్ధులు, రూ.1,500 దక్కవని వికలాంగులు ఆవేదన చెందుతున్నారు. ఆసరా సమాచారం కోసం గ్రామ పంచాయతీ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే కాకుండా మండల పరిషత్ కార్యాలయాలకు కూడా క్యూ కడుతూ తమకు కనిపించిన అధికారినల్లా పింఛన్ జాబితాలో తమపేరు ఉందా..? అని అడుగుతున్నారు. ఆన్లైన్ నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాతే తుది జాబితా వస్తుందని అప్పటి వరకు లబ్ధిదారులు ఆందోళనకు గురికావద్దని అధికారులు చెబుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఆశలు పెట్టుకున్న నూతన లబ్ధిదారులు వేల సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురువుతుండడంతో అర్హత ఉండి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. ఉన్న వాటికే ప్రభుత్వం కోత పెడుతుందన్న ఆరోపణలు వస్తుండడంతో అసలు తమకు పింఛన్ వస్తుందా..? రాదా..? అని నూతనంగా దరఖాస్తు చేసుకున్నవారిలో ఆందోళన నెలకొంది. ప్రధానంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వేలాది మంది నూతనంగా దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలన ఇంకా పూర్తి కాకపోవడంతో అర్హులు కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్నారు. -
తేలని పింఛన్ల జాబితా
మచిలీపట్నం : జిల్లాలో పింఛనుదారుల అర్హత జాబితా ఇంకా కొలిక్కి రాలేదు. అక్టోబర్ రెండో తేదీ నుంచి అర్హులైన వృద్ధులు, వితంతువులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు, 80 శాతం కన్నా వైకల్యం అధికంగా ఉన్న వికలాంగులకు రూ.1500 పింఛను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ నెల ప్రారంభమవుతున్నా జిల్లాలో పింఛనుదారుల వివరాల సేకరణ ఇంకా పూర్తికాలేదు. జిల్లాలో మొత్తం 3,12,185 మంది లబ్ధిదారులు వివిధ రకాల పింఛన్లు తీసుకుంటున్నారు. వారిలో ఇప్పటివరకు 2,97,710 పింఛనుదారుల వివరాలు పరిశీలించిన అధికారులు 12,857 మందిని అనర్హులుగా గుర్తించారు. ఇంకా 16,475 మందికి సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించాల్సి ఉంది. వీరిలో ఎంతమంది అనర్హులుగా ఉంటారో తేల్చాలి. అధికారులు పింఛనుదారుల వివరాలు సేకరించే సమయంలో వారికి ఉన్న రేషన్ కార్డు, ఆధార్ కార్డులు రెండుచోట్ల నమోదయ్యాయా అనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండుచోట్ల నమోదై ఉంటే ఒకచోట తొలగిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రెండున్నర ఎకరాల మాగాణి, ఐదు ఎకరాల మెట్ట భూమి ఉంటే వారిని అనర్హులుగా గుర్తిస్తున్నారు. వితంతు పింఛను పొందేవారి వద్ద మరణ ధ్రువీకరణ పత్రాలు లేకపోవటంతో వారు పింఛను వస్తుందా, రాదా అనే అంశంపై లోలోపల మధనపడుతున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరికి వృద్ధాప్య పింఛను వస్తుంటే వారిలో ఎవరికి నిలిపివేస్తారోననే అంశంపైనా చర్చ సాగుతోంది. పింఛన్ల తుది జాబితా ఇంకా ఖరారు చేయలేదని, త్వరితగతిన పూర్తిచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీఆర్డీఏ పీడీ రజనీకాంతారావు తెలిపారు. కొత్తగా వివిధ రకాల పింఛన్ల మంజూరు కోసం 25 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు.