సగానికిమోక్షం లేనట్లే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల్లో సగానికి కూడా మోక్షం కలిగే అవకాశం కనిపించడంలేదు. జీఓ 58 కేటగిరీ కింద జిల్లావ్యాప్తంగా వచ్చిన 1,52,249 దరఖాస్తులను పరిశీ లించిన రెవెన్యూ యంత్రాంగం.. ప్రాథమిక స్థాయిలోనే 56,449 అర్జీలను పక్కనపెట్టగా, తాజాగా మరో 11,194 దరఖాస్తులను అనర్హమైనవిగా తేల్చింది. దీన్నిబట్టి చూస్తే సగం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 125 గజాల ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో నివసిస్తున్న పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం భావించింది.
అయితే, వీటిలో చాలావరకు నిబంధనలకు అనుగుణంగాలేవని పరిశీలన దశలోనే గుర్తించింది. శిఖం, నాలా, కోర్టు కేసులు, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూముల్లో వెలిసిన నిర్మాణాలను క్రమబద్ధీకరించకూడదనే నియమావళిని పరిగణనలోకి తీసుకున్న రెవెన్యూ అధికారులు 56వేల దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టి.. అభ్యంతరంలేని మిగతా దరఖాస్తులను వడపోశారు. ఈ మేరకు 61 ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు 37,127 దరఖాస్తులను పరిశీలించిన యంత్రాంగం.. దీంట్లో 25,933 సవ్యంగా ఉన్నట్లు తేల్చింది.
సగటున 52.74 శాతం పరిశీలన
క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన విచారణను తలపిస్తుందని, ఈ ప్రక్రియ తలనొప్పిగా మారిందని రెవెన్యూ టీంలు వాపోతున్నాయి. అంతేకాకుండా ఈనెల 20లోపు పరిశీలన పర్వాన్ని పూర్తిచేయాలని, ఆ తర్వాత ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేయడం కూడా అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ప్రతి టీం దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. అర్హుల జాబితా రూపకల్పనకు సంబంధించిన చెక్ మెమో చాంతాడంతా ఉండడంతో బృందాలపై పనిభారం పెరిగింది.
గతంతో పోలిస్తే అర్జీల పరిశీలన ప్రక్రియను చకచకా పూర్తి చేస్తున్నప్పటికీ, మూడో వంతు కూడా కొలిక్కిరాకపోవడం అధికారులను కలవరపరుస్తోంది. కాగా, ప్రతి బృందం రోజుకు సగటున 52.74 శాత ం దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు లెక్క తేల్చారు. దరఖాస్తుల వడపోతలో వెనుకబడిన మేడ్చల్, బాలానగర్, శంషాబాద్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి మండలాల అధికారులను కూడా స్పీడ్ పెంచమని ఆదేశించారు.