ఉద్యోగానికి సరిగ్గా సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌! | Google employee gets rejected from job for being too good | Sakshi
Sakshi News home page

ఉద్యోగానికి సరిగ్గా సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌!

Published Sun, Oct 20 2024 6:10 AM | Last Updated on Sun, Oct 20 2024 6:10 AM

Google employee gets rejected from job for being too good

సంస్థ నుంచి ఊహించని సమాధానం 

దాంతో అవాక్కైన ఆశావహురాలు 

స్క్రీన్‌షాట్‌ తీసి షేర్‌ చేసిన వైనం 

కొత్త ఉద్యోగానికి సరిపడా అర్హతలు లేక చాలా మంది తిరస్కరణను ఎదుర్కొంటారు. తనకు అన్ని అర్హతలు ఉండి, సదరు కొత్త జాబ్‌ను చేయగల సమర్థత ఉన్నాసరే ఉద్యోగాన్ని పొందలేకపోవడంతో ఒక అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఉద్యోగం ఇవ్వలేకపోవడానికి గల కారణాన్ని చూసి అవాక్కయింది. తర్వాత ఆ తిరస్కరణ తాలూకు వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’వేదికగా అందరితో పంచుకుంది.  
 

గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ.. 
అనూ శర్మ అనే ఈ అమ్మాయి ప్రతిష్టాత్మక గూగుల్‌ సంస్థలో ఢిల్లీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలు, జీతం, కొత్త సవాళ్లను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వేరే సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో రెజ్యూమ్, వివరాలు పంపారు. ఉద్యోగం తప్పకుండా వస్తుందనుకుంటే ‘తిరస్కరిస్తున్నాం’అన్న సందేశం వచి్చంది. ఉద్యోగంలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను సంస్థ వివరించింది. ‘‘మీ రెజ్యూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాం. ఇక్కడ తేలిందేమంటే సదరు ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ మీలో ఉన్నాయి. 

వాస్తవం చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి. ఇంతటి ప్రతిభావంతురాలు మాకు వద్దు. ఎందుకంటే ఎక్కువ ప్రతిభ ఉండి తక్కువ స్థాయి ఉద్యోగం చేసే వాళ్లలో సాధారణంగా ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. మరింత మెరుగైన ఉద్యోగాన్ని వీలైనంత త్వరగా వెతుక్కుని పాత ఉద్యోగాన్ని వదిలేస్తారు’’అని వివరణ ఇచి్చంది. ఇలాంటి కారణాలకు కూడా తిరస్కరిస్తారా? అని ఆమె ఆలోచనలో పడింది. ‘‘అర్హతలున్నా ఉద్యోగం ఎందుకు రాదో మీకు తెలుసా?’అంటూ అనూ శర్మ సంబంధిత సంస్థ రిప్లై స్క్రీన్‌షాట్‌ను ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు.

స్పందనల వెల్లువ
అనూ శర్మ పెట్టిన పోస్ట్‌కు స్పందనల వరద మొదలైంది. ‘‘అతి అర్హతలతో బాధపడుతున్నారా?’అని ఒక నెటిజన్‌ సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘ఇదొక మంచి పరిణామానికి సంకేతం. ఒకరి దగ్గర పనిచేయడం మానేసి మీరే సొంతంగా కంపెనీ పెట్టి ఉద్యోగాలివ్వండి’అని మరొకరు ఉచిత సలహా ఇచ్చారు. ‘‘ఉద్యోగం చేసే స్థాయి మీకున్నా, ఇచ్చేస్థాయి మాకు లేదు అని కంపెనీయే ఒప్పుకుంది’’అని మరొకరు ట్వీట్‌చేశారు. సంస్థనూ మెచ్చుకున్న వాళ్లు కోకొల్లలు ఉన్నారు. ‘‘కంపెనీ మంచిపనే చేసింది. అర్హత కాస్తంత తక్కువ ఉంటే ఉద్యోగం ఇచ్చి, పని బాగా చేయించి రాటుదేలాలా చేస్తారు.

 ఈమెలాగే అప్పటికే మంచి ప్రతిభ ఉంటే మధ్యలోనే మానేస్తారు. అప్పుడు మళ్లీ నోటిఫికేషన్, రిక్రూట్‌మెంట్, శిక్షణ అంటూ సంస్థ ఉద్యోగ వేట మళ్లీ మొదలవుతుంది’’అని ఇంకో నెటిజన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘కనీసం రెజ్యూమ్‌ చదవకుండా, ఏవేవో పిచ్చి కారణాలు చెప్పకుండా నిజాయతీగా రిప్లై ఇచ్చిన సంస్థను మెచ్చుకోవాల్సిందే’అని ఇంకొకరు ట్వీట్‌చేశారు. దీంతో సరిగ్గా సరిపోయే అర్హతలున్న వారికి ఉద్యోగం ఇవ్వాలా? లేదంటే కాస్తంత తక్కువ అర్హత ఉన్న వారికి ఉద్యోగం ఇచ్చి తమకు తగ్గట్లు తీర్చిదిద్దుకోవాలా? అన్న చర్చ మొదలైంది. 

– న్యూఢిల్లీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement